ఈ రోజు మా మహిళా మండలి ప్రత్యేక సమావేశం. జాయింట్‌ సెక్రెటరీగా వున్న నన్ను సెక్రెటరీగా ఎన్నుకోబోతున్నారు ఈ రోజు సమావేశంలో. అందుకే త్వరగా బయల్దేరాలని, తయారవుతున్నాను. మా వైస్‌ ప్రెసిడెంట్‌ వనజాక్షి వచ్చి, తనే తీసుకు వెళ్తానని అంది. చాలా సేపట్నుంచే తయారవుతున్నాను, కాని ఇంకా పూర్తిగా తృప్తి కలగడం లేదు నాకు. అందుకే టెన్షన్‌ ఎక్కువైంది నాకు.స్వతహాగానే అందగత్తెనైన నాకు, కాలేజీ రోజుల్లో డ్రీమ్‌ గర్ల్‌ అనే పేరుండేది. నా పెళ్ళిలో కూడా అందరూ, నాలాంటి ‘అందగత్తె- అలాంటి వాణ్ణా పెళ్ళి చేసుకునేది?’ అన్నారు కూడా.అలంకరణలతో, నగలతో నా అందం ఇంకా మెరుగుపడుతుంది. ఏ ఆర్చ్‌ లైట్స్‌ లేకపోయినా, సినిమా స్టారుకు తగ్గకుండా వుంటుంది నా అందం. నా వైపు చూడకుండా ఎవరూ వుండలేరు. అపర ప్రవరాఖ్యుడైనా సరే, నా వంక ఒక చూపు వేయా ల్సిందే. అదీ నా బ్యూటీ మహిమ. అందరూ అలా పొగుడుతూ వుంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అందరిలోనూ అందగత్తెనైతే గర్వంగా వుండదా మరి?!అంతలో కాలింగ్‌ బెల్‌ మ్రోగింది. నాకు గుండె గుభేల్‌మంది. 

అందుకు కారణం జయమ్మ వస్తు న్నందుకే. జయమ్మ ఎవరో కాదు మా ఇంటి పని మనిషి. ‘‘పని మనిషిని చూసి జడుసుకోవడమా?’’ అంటారేమో గాని, జయమ్మని చూస్తే నాకు మాత్రం భయం. భయం అంటే నిజంగా భయం అని కాదు గాని, ఒక రకమైన ఈర్ష్య నాకు.ఎందుకంటే, ఏ మేకప్పులూ లేకపోయినా, ఏ హంగులు లేకపోయినా, రంగురంగుల డ్రెసెస్స్‌ లేక పోయినా, ఏ నగలు లేకపోయినా, అందంగా కని పించడం జయమ్మ గొప్పదనం. మెడలో ఉన్న పసుపు తాడు, చెమటకు తడిసిపోయి నల్లగా మారిన ఆ తాడు-ఆమె మెడలో వున్న ఒకే ఒక నగ.నల్లగా వున్నా, సరైనా దుస్తులు లేకున్నా, ఎందుకో జయమ్మను చూస్తే కొట్టొచ్చినట్లుండే అందం అనిపిస్తుంది. ‘జయమ్మ’ను జూస్తే నాకు అసూయ పుడుతుంది. కాని, ఇవేమీ పట్టించుకోని జయమ్మ తన పనేదో తను చేసుకుపోతుంటుంది. జయ మ్మను చూస్తుంటే కొంచెం భయం, ఎక్కడ జయమ్మ నాకన్నా అందగత్తె అనో, లేక ‘నాచురల్‌ బ్యూటీ-వితవుట్‌ మేకప్‌’ అనో, ఎవరైనా గబుక్కున అనేస్తారేమోనని నాకు భయంగా వుంటుంది.