డిప్యూటీ జైలర్‌ కృష్ణమోహన్‌ సివిల్‌ డ్రెస్‌లో సాయంత్రం ఏడు గంటలకు సబ్‌జైలు ఆవరణలో రౌండ్స్‌ వేస్తున్నారు. కృష్ణమోహన్‌ అక్కడ డ్యూటీలో చేరి నాలుగు రోజులే అయింది. రెండు రోజులపాటు చార్జి తీసుకోవడం, ఇంతకుమునుపక్కడ పనిచేసిన అధికారి తనకప్పగించిన ఫైళ్ళు, రికార్డులు సరిచూసుకోవడంతోనే సరిపోయింది. మూడవరోజు జిల్లా కేంద్రంలో అధికారులేర్పాటుచేసిన రివ్యూ మీటింగ్‌కు హాజరయ్యాడు.

భార్య వినీతకు ఆరోగ్యం బాగులేకపోవడంతో ఉదయం హాస్పిటల్‌కు చెకప్‌కు తీసుకెళ్ళి, మధ్యాహ్నం మూడింటికి తాను పనిచేస్తున్న సబ్‌జైలుకు చేరుకున్నాడు.కృష్ణమోహన్‌ ఆదర్శ భావాలు గల యువకుడు. తన పరిధిలో ఖైదీలకు మానవతా దృక్పథంతో ఏదో ఒక సహాయం చేయాలన్న తాపత్రయం కలవాడు. ‘నేరస్తులు చేసిన అకృత్యాలకు కఠిన శిక్ష ననుభవించే ప్రదేశం కాక, వారిలో పరివర్తన తీసుకువచ్చే దేవాలయం వంటిది ఖైదు అన్న’ సూక్తిని నమ్మినవాడు.ఉదయమూ, మధ్యాహ్నమంతా ఖైదీలు ఎక్సర్‌సైజ్‌, యోగాభ్యాసం, తమకప్పగించిన విధులతో బిజీగా వుంటారు. వారికి కాస్త తీరిక దొరికేది సాయంత్రం ఆరు గంటల తరువాతే. ఆ సమయాన్ని వారెలా గడుపుతున్నారో పరిశీలించాలనుకున్నాడు కృష్ణమోహన్‌. కొత్తగా డ్యూటీలో చేరినందున అతని ముఖం ఎవరికీ పరిచయం లేదు.ఒక సెల్లో నలుగురు ఖైదీలు పేకాడుతూ, బీడీలు కాలుస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ‘వీరికి పేకముక్కలు, బీడీలు ఎలా వచ్చాయో’ అని ఆశ్చర్యపోయాడు కృష్ణమోహన్‌. పహారా కాయవలసిన సిబ్బంది నిర్లక్ష్యం వల్లనో, లంచగొండితనం వల్లనో జైల్లోకి అన్‌వాంటెడ్‌ మెటీరియల్‌ చేరబడుతోంది. 

కృష్ణమోహన్‌ను ఎవరో ఖైదీకోసం వచ్చిన విజిటర్‌ అనో, మరోలా అనుకున్నారేమో వాళ్లసలు పట్టించుకోలేదు.మరో చీకటి కొట్టులో ముగ్గురు సినిమా పత్రికలు, డిటెక్టివ్‌ నవలలు చదువుకుంటున్నారు. ఒకడు అభినయంతో ఏవో సినిమా డైలాగులు జోరుగా వల్లిస్తున్నాడు.‘‘మీ వూరికొస్తా, మీ పేటకొస్తా, మీ ఇంటికొస్తా, కత్తులతో కాదు, కంటి చూపుతోనే చంపేస్తా, నా చూపే పాశుపతాస్త్రం’’ అని నానా హంగామా చేస్తున్నాడు. ఒకరిద్దరు ఆనందంతో చప్పట్లూ, విజిల్స్‌తో ఆ ఖైదీని ఎంకరేజ్‌ చేస్తున్నారు.సినిమా పత్రికల మీద వున్న శ్రద్ధ వీరికి మంచి సాహిత్యం పట్ల లేకపోయిందే అని బాధపడుతూ కదిలాడు మోహన్‌. లైబ్రరీలో ఎన్నో మంచి పుస్తకాలున్నప్పటికీ అవి చదివే నాధుడే కరువయ్యాడు. ఖైదీలు ఎంతసేపు వార్తాపత్రికలు, సినిమా పుస్తకాలు తప్ప శరత్‌ సాహిత్యం, కొడవటిగంటి నవలలు వంటి పుస్తకాల జోలికి పోవడం లేదు.టీవీ రూంలో ఇరవైమంది దాకా ఖైదీలు కూర్చుని సినిమా పాటలను ఉత్సాహంగా చూస్తున్నారు. మరికొందరు జర్దాపాన్‌లను నములుతూ పిచ్చాపాటి కబుర్లలో మునిగి తేలుతున్నారు.కృష్ణమోహన్‌ తన ఛాంబర్లో కూర్చుని, వార్డెన్ని పిలిచి ఈ దుస్థితికి కారణం అడిగాడు.