పావని డ్రెస్సింగ్ టేబుల్ ముందు టీపాయ్ మీద కూర్చుంది. అద్దంలో తన ముఖాన్ని ముందుకు వంగి దగ్గరగా చూసుకుంది. బుగ్గలు క్రిందకి జారి పోయాయి. కళ్ళ క్రింద నల్లని చారలు కనిపిస్తున్నాయి. మెడ దగ్గర, కంఠం మీద ముడతలు.ఈ మధ్య అద్దంలో చూసుకోవడం ఎక్కువయింది పావనికి. దానికి కారణం లేకపోలేదు. ఈ కొత్త అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాక తన తోటి వయసు వారితో తనని పోల్చుకుని ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవసాగింది.తిరిగి ముందుకు వంగి చూసుకుంది. మొహం ప్రక్కకి తిప్పి రెండు వైపులా చెంపల వంక చూసుకుంది. చెవుల దగ్గర నెరిసిన జుట్టు, రంగు వేసుకుంటున్నా పాపిడి మధ్యలో తెల్లదనం కనిపిస్తూనే ఉంది.నిట్టూర్చింది, లేచి నుంచుంది.ఏభై దాటిన వయసు, వయసుతోపాటు పెరిగిన శరీరం. అందం తగ్గిన మాట వాస్తవం.అద్దంలో తనని చూసుకుంటుంటే ఇంకా బెంగ అనిపించింది పావనికి.లేచి వెళ్ళి మంచం మీద పడుకుంది.పెళ్ళిటైముకి అచ్చు చందనం బొమ్మలా ఉండేది. అసలు తన అందం చూసే కదా కట్నం అక్కరలేదని కోరి చేసుకున్నాడు తన భర్త.
సహజంగా అందంగా ఉంటాననే కాస్త గర్వం. అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది కాదు.కాని వయసు ప్రభావం అందం మీద ఉంటుందని గ్రహించలేకపోయింది. ఆ ధ్యాసే ఉండేది కాదు. మధ్యాహ్నం రేఖ చెప్పేవరకు.ప్రక్క ఫ్లాట్‌లో ఉంటున్న శారద కూతురు రేఖ బీటెక్ చదువుతోంది.‘‘ఆంటీ’’ అంటూ చనువుగా ఇంటికి వచ్చి పావనితో కాసేపు కబుర్లు చెప్పి వెళుతూ ఉంటుంది.ఈ రోజు...భర్త ఆఫీసుకి వెళ్ళిపోగానే మంచం మీద నడుం వాల్చింది. తలుపు చప్పుడయింది. వెళ్ళి తలుపు తీసింది.ఎదురుగా రేఖ నిలబడి ఉంది.‘‘ఏమిటి ప్రొద్దున్నే ఇలా వచ్చావు’’ అంది పావని లోపలికి దారి ఇస్తూ.‘‘ఈ రోజు కాలేజ్‌కి వెళ్ళలేదు. అమ్మ బయటకు వెళ్ళింది. బోర్ కొట్టి ఇలా వచ్చాను’’ అంది రేఖ సోఫాలో కూర్చుంటూ.వాళ్ళ అమ్మకి రేఖతో మాట్లాడే సమయం ఉండదు కనుక. పావని దగ్గరకు వచ్చి కాలేజ్ విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు చెప్పి రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటుంది రేఖ.కాలేజీ ముచ్చట్ల అయ్యాక హఠాత్తుగా అంది రేఖ.‘‘ఆంటీ! ఎన్నాళ్ళ నుంచో ఈ మాట మీకు చెబుతామనుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ అంతా మీరు చాలా అందంగా ఉంటారని అనుకుంటూ ఉంటాము. మన ఫ్లాట్స్‌లో అందరి కన్నా మీరే బాగుంటారు’’ అంది రేఖ.కొంచెం సిగ్గుపడుతూ నవ్వింది పావని.‘‘కానీ... మీరు మీ అందం గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు లేదు’’ అంది రేఖ.‘‘అంటే’’ అర్థం కానట్టు అడిగింది పావని.