అమ్మగారూ-వెళ్ళొస్తానండి. మళ్ళీ సోమవారమేనండి పన్లోకి రావటం’’ అంది పనమ్మాయి ఈశ్వరి.‘‘తప్పకుండా వచ్చేస్తావుగా... ఇంకా లేటు చేయకు. ఇప్పటికేమూడు రోజులు పని మానేస్తున్నావ్‌’’ అంది మా మేడమ్‌ -అదే మా హోం మినిస్టర్‌.‘‘ఎందుకు రానండి.. సోమవారం తెల్లారేసరికిబండి దిగేస్తాం కదండీ.. పదో గంటకల్లాపన్లో కొచ్చేస్తానండీ’’ అంది ఈశ్వరి.‘‘అలాగే అంటావ్‌.... తర్వాత పన్లోకి రానందుకు ఏదో ఒక కారణం చెప్తావ్‌’’ అంది మేడమ్‌.‘‘తిరుపతి మొక్కు తీర్చుకోటానికి కదండీ వెళ్ళేది. లేకపోతే మూడు రోజులు పని మానేస్తానటండీ’’ అంది ఈశ్వరి.వాళ్ళ సంభాషణ వింటున్న నేను ఓ వంద నోటు తీసి... ‘‘తిరుపతి వెళ్తున్నానంటుందిగా... ఖర్చులకుంటాయ్‌ ఇచ్చేయ్‌’’ అని మా మేడమ్‌ చేతిలో పెట్టాను.అయిష్టంగానే ఈశ్వరి చేతిలో వంద నోటు పెట్టింది మేడమ్‌.ఊహించని సహాయానికి ఈశ్వరి కళ్ళల్లో కృతజ్ఞతాభావం.‘‘ఏదో వంక చెప్పి, పని మానేస్తుంటారు ఈ పనోళ్ళు. అయినా వీళ్ళకి ఈ మొక్కులు... దానికి బోలెడు ఖర్చులు దేనికి చెప్పండి. అంతగా అయితే దగ్గర్లో వున్న ఏ చిన్న తిరుపతికో వెళ్ళి రావాలి కాని... అంతదూరం ఎంత ఖర్చని... ఇంక వచ్చిన దగ్గర్నుంచి... అమ్మగోరూ ఓ ఐదొందలు అడ్వాన్సు ఇప్పించండి... వచ్చే నెల ఇరుపుకొందురుగాని... అంటూ బేరాలు. అయినా మీరేంటి... అయిన దానికి కానిదానికి దానధర్మాలు చేసేస్తుంటారు.

 మనకీ బోలెడు ఖర్చులుంటాయి... ఉన్నదంతా దులిపేసుకుంటే ఇంతే సంగతులు... కొంచెం బుర్రుపయోగించండి’’ అంటూ పని మనిషిమీద కోపంతో నన్ను కూడా కలిపి నా డైలీకోటా ఇచ్చేసింది మేడమ్‌.మనకిది మామూలే కనుక పెద్దగా పట్టించుకోనవసరం లేదు.్‌్‌్‌ఆ రోజు మధ్యాహ్నం మా ఫ్లాట్‌లోనే మా గ్రూప్‌ హౌస్‌ లేడీస్‌ మీట్‌ జరిగింది. పెంట్‌హౌస్‌ ‘వీర్రాణి’ గారు, సెకండ్‌ ఫ్లోర్‌ సుబ్బలక్ష్మిగారు, ఫస్ట్‌ ఫ్లోర్‌ సుకుమారిగారు, థర్డ్‌ ఫ్లోర్‌ మా మేడమ్‌ గారు రొటీన్‌ అజెండా అయిపోయిన తర్వాత, ఈశ్వరి తిరుపతి యాత్ర చర్చకు వచ్చినప్పుడు... తిరుపతి వెంకన్న దగ్గర ఎవరెవరికి ఎంతెంత పరపతి వుందో పోటీలు పడి చెప్పేసుకున్నారు.‘‘మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా, మినిస్టరుగారు లెటరు ఇచ్చేస్తారు. కాటేజీలు, బ్రేక్‌ దర్శనాలు, ఆర్జితసేవలు, ఏది కావాలంటే అది అప్పటికప్పుడు ఏర్పాటుచేస్తారు. కనీసం మూడు దర్శనాలైనా చేసుకుంటాము వెళ్ళిన ప్రతిసారి... ఇక లడ్డూలైతే... ఎన్ని తెస్తామో లెక్కేలేదు’’ అంటూ వీర్రాణిగారు ముందుగా లార్డు (లడ్డు) వెంకన్న దగ్గర తమకున్న పరపతి గురించి చెప్పేశారు.‘‘ఎం.పిగారు మా వారికి కజినే కదా! ఇంకో ‘కజిన్‌’ ఎం.ఎల్‌.ఏ. ఎవరో ఒకరు లెటర్‌ ఇచేస్తుంటారు. సంవత్సరంలో కనీసం రెండు సార్తైనా కంపల్సరీగా తిరుపతి వెళ్ళొస్తుంటాం. ముందుగా ఏం అనుకోం. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు బయలుదేరిపోతాం. కాటేజి రిజర్వేషన్లు, విఐపి దర్శనాలు, అన్నీ ఇలా అనుకుంటే అలా జరిగిపోతాయి. స్వామి వారి కళ్యాణం ఇప్పటికి ఎన్నిసార్లు చేయించామో లెక్కలేదు’’ ఉన్న వాళ్ళకి ఆ గోవిందుడు ఎంత అందుబాటులో వుంటాడో సుబ్బలక్ష్మిగారి మాటల్లో వ్యక్తమవుతోంది.