ఏటి ఒడ్డున అర్చన తన మూడేళ్ల బాబుతో పడవ కోసం ఎదురు చూస్తోంది. ఆమె వచ్చి అప్పుడే గంటకు పైగా అయింది. ఆమె ఉదయం ఈ ఊరు ఆడపడుచు కూతురి పెళ్లికని వచ్చింది. పెళ్లికి వచ్చిన దగ్గర్నుంచిఆమె మూడేళ్ల బాబు రామానికి విపరీతమైన జ్వరం, దాంతో పాటే వాంతులు.... అందుకే పెళ్లికి వచ్చిందేగానీ ఆమె దాన్ని ఆస్వాదించలేక పోయింది.వస్తున్నప్పుడు కారులో, ఏరుదాటుతున్నప్పుడు పడవలో ఎంతో హుషారుగా ఉన్న రామానికి పెళ్లికి వచ్చిన గంటకు జ్వరం మొదలైంది. అది మధ్యాహ్నానికి మరింత ఎక్కువైంది. అర్చనకు బాబు పరిస్థితి చూసి భయమేసింది. ఆ ఊళ్లోనే ఉన్న ఆర్‌.ఎమ్‌.పి డాక్టరుకి చూపిస్తే అతను ఏవో మందులిచ్చాడు కానీ, అవేమీ పని చేయలేదు. అందుకే సాయంత్రం త్వరగా పట్నం వెళ్లాలనీ ఎవరు చెప్పినా వినకుండా ఏటి ఒడ్డుకొచ్చేసింది. పట్నం వెళ్లాలంటే ఏరు దాటాల్సిందే. దానికి ఆ ఊరికున్న రెండు పడవలే ఆధారం. తను వచ్చినపుడు కారుని ఏటి ఆవలి ఒడ్డున ఉంచి పడవ దాటి వచ్చింది.తను పెళ్లికి వెళ్లనని ఎంత చెప్పినా బలవంతంగా పంపించిన భర్త భరద్వాజ మీద పీకల దాకా కోపం వచ్చిందామెకు.

 ఆ రోజు అర్జెంట్‌ పని పడటంతో ఢిల్లీ వెళ్లవలసి రావటంతో అర్చనని బ్రతిమిలాడి పెళ్లికి పంపాడు; ఎవ్వరూ వెళ్లకపోతే చెల్లెలు లక్ష్మికి కోపం వస్తుందని అతని భయం. పైగా ఆమెకు ఒక్కతే కూతురు; అదీగాక భరద్వాజ పెళ్లైన తరువాత చెల్లెలి ఊరు ఒక్కసారి కూడా వెళ్లలేదు. అందుకే అర్చనకు వాళ్లతో పరిచయం లేకపోయినా అన్నీ చెప్పి పంపించాడు.అర్చన అమెరికాలో పుట్టి పెరిగింది. కాలేజీలో పరిచయం అయిన భరద్వాజను ప్రేమించి పెళ్లాడింది. అప్పుడు భరద్వాజ ఎమ్మెస్‌ చదవడానికి స్టేట్స్‌కి వెళ్లాడు. పెళ్లయిన తరువాత అతను అమెరికాలోనే సెటిలవ్వాలన్న కండిషన్‌తో ఆమె పెళ్లికి ఒప్పుకుంది. కానీ భరద్వాజ తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో అతని వ్యాపారాలు చూడ్డానికి యిండియా వచ్చేశాడు. అతనితో పాటే అర్చన కూడా వచ్చింది. ఆమె తండ్రి రఘు రామయ్య కూడా ఒకప్పుడు కోనసీమ వాసే. యిక్కడ బ్రతకలేక అమెరికా వెళ్లి బాగా సంపాదించాడు.విశాఖపట్నం నుంచి ఆమే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చింది. సీతాపురం ఎలా వెళ్లాలో భరద్వాజ ఆమెకు అర్థమయ్యేలా రూట్‌ మేప్‌ గీసి మరీ చెప్పడంతో ఆమె పని సులువైంది. ప్రయాణంలో బాబు చాలా ఎంజాయ్‌ చేశాడు. కానీ సీతాపురం ఏటికి ఆవల ఉండటంతో కారుని ఆవలి గట్టు దగ్గర ఆపి, పడవ మీద ఏరుదాటి పెళ్లింటికి చేరింది.