రాత్రి తొమ్మిదైంది. మా ఆవిడ సుభద్రకి చెప్పాను, అవధాని గారింటికి వెడుతున్నానని.‘‘వెళుతున్నా కాదు. వెళ్ళొస్తా అనండి’’ అంది సుభద్ర.నేనెప్పుడు బైటికెళ్లినా ఎక్కడికని అడగదు తను. కారణం, అడిగితే పని సానుకూలం కాదన్న భయం కాదు. అసలు నేను చెయ్యబోయే పనుల గురించి ఆలోచించదామె. తనకేం కావాలో చెబుతుంది. నేను బైటికెళ్ళి తిరిగొస్తే చాలు, పనైపోతుందని ఆమె నమ్మకం. ఎలాగవుతుందో ఆమెకి పట్టదు. అవకపోయినా నిరుత్సాహపడదు. మరో ప్రయత్నం చెయ్యొచ్చని సరిపెట్టుకుంటుంది.ఆమెకి నా ఉనికి ముఖ్యం. తన జీవితాన్ని పూర్తిగా నా ఉనికితో ముడి పెట్టుకుంది. అందుకే నా నుంచి ‘వెళుతున్నా’ అనే పదం నిషిద్ధం ఆమెకి.తిరిగి రానని తెలుసు. అయినా ఆమె తృప్తికోసం, ‘‘వెళ్ళొస్తా’’ అన్నాను. ఆమె తృప్తిపడింది. ఆ తృప్తి చూస్తే నాకు జాలేసింది. జాలి పడుతూనే ముందడుగేశాను.ఇంటి తలుపులు మూసుకున్నాయి. మళ్లీ తెరుచుకున్నప్పుడు, అవి నాకోసం మాత్రం కావని తెలుసు.అడుగు ముందుకు వేస్తూ ఆలోచిస్తున్నాను.దేశానికి వెన్నెముక రైతు. దేశానికి అన్నదాత రైతు అన్న మాటలు తరచు మీడియాలోనూ, నాయకుల నోటా వినిపిస్తుంటాయి. కానీ చేస్తున్నది వ్యవసాయమైనా, రైతునని చెప్పుకోను. రైతు అంటే మనిషని నాకు అనిపించదు. వ్యవసాయానికి మట్టిని నమ్ముకున్నాను కాబట్టి, మట్టి మనిషినని చెప్పుకోవడం నాకిష్టం. అలా మనిషిని అనిపించుకుంటున్నాను. కానీ మట్టి విషయమేమిటి? మన దేశంలో మట్టికి గౌరవముందా?గురజాడ అంతటి మహాకవే ‘దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌’ అన్నాడు మరి. అయితే ఆయన ఉద్దేశం మట్టిని నిరసించడమని నాకనిపించదు. ఎందుకంటే మనిషే కాదు, ఏ జీవమైనా మట్టిలోంచే రావాలి. మట్టి లేనిదే మనిషికి మనుగడ లేదు. అలాంటప్పుడు దేశం మట్టి కాకుండా ఎలా పోతుంది?హరి అంటే విష్ణువే కాదు - కప్ప, కోతి, చిలుక, పాము వగైరా ఏదైనా కావచ్చు. రాజు అంటే ఏలికే కాదు - చంద్రుడు, భర్త కూడా కావచ్చు. శ్రీ అంటే సంపదే కాదు, విషం కూడా. భాషమీద పట్టున్న మహాకవులు ఏ మాటన్నా, ఎన్నో అర్థాలుంటాయి. తెలియని చాలామంది మట్టిని నిరసిస్తూ, మట్టిలోంచి జీవమున్న తోటలకి బదులు, కాంక్రీటు భవంతులు కావాలంటున్నారు. 

మట్టిని చదివే బదులు, మట్టి అంటని చదువులు కావాలంటున్నారు. మట్టిని నమ్ముకున్నవారికి భావి లేకుండా చేసి, చావురేవుకి తరుముతున్నారు.నా ఈ మాట రాజకీయాల్లోంచి కాదు, స్వానుభవంలోంచి పుట్టింది. నేనిప్పుడు చావురేవువైపే పయనిస్తున్నాను. అబ్బాయి చైతన్య ఇంజనీరింగు రెండో సంవత్సరంలో ఉన్నాడు. అమ్మాయి రాశిని పురిటికి తీసుకురావాలి. కొన్నేళ్ళుగా నా ఆదాయానికి అవమానం. వ్యయానికి రాజపూజ్యం. ఆ పరిస్థితుల్లో గతేడాది తుఫానొచ్చి పంట పోయింది. ఈ ఏడు వానల్లేక దిగుబడి లేదు. దాంతో ఇంటిమీద అప్పు. పొలంమీద అప్పు. పెళ్లాం మెడలో నగలు తాకట్టు. అయినా ఒక్కేడు బాగుంటే చాలు, కొంత సర్దుకోగలను. కానీ ఇప్పుడు అప్పులవాళ్లు పీకలమీద కూర్చున్నారు. పొలం అమ్మమని ఒకరు, ఇల్లు వేలం వేస్తామని ఒకరు వేధిస్తున్నారు.