ఫోను రింగవుతూనే వుంది. చదువుతున్న పేపరు పక్కన పడేసి ఫోను దగ్గరకెళ్ళి ‘‘డిస్‌ ప్లే’’ చూసాడు శ్రీనివాసరావు. అది తంబయ్య నుంచి ఫోను. అప్పటికిఅయిదోసారి ఫోను రావడం! మూడుసార్లు మర్యాదగా ఫోను తీసాడుతను. కాని తంబయ్య కట్‌ చేసాడుఫోను. నాలుగోసారి రింగయినప్పుడుశ్రీనివాసరావు తీయలేదు. గంటన్నర తరువాత తిరిగి యిప్పుడు... యిలా.... ఫోను రింగవుతోంది. శ్రీనివాసరావు తీద్దామనుకుని ‘వద్దులే’’ అనుకుని పేపరులోకి తల దూర్చేసాడు.పావుగంట తరువాత ఫోను? తంబయ్య నుంచే! శ్రీనివాసరావుకు కోపం వచ్చింది. ‘హలో’ అంటూనే ఫోను తీసాడు.‘‘ఏమిటి... ఫోను తీయటం లేదూ’’ కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు తంబయ్య.‘‘విషయం చెప్పు... సాగదీయకు’’ క్లుప్తంగా అడిగాడు శ్రీనివాసరావు.‘‘మీ యింటికి రావాలనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటావు’’.‘‘అదేం పిచ్చి ప్రశ్న! నా దగ్గరకు వచ్చేందుకు అపాయింటుమెంటు, ముందస్తు అనుమతి కావాలా! కొత్తగా మాట్లాడుతున్నావేంటి! నేను నీలాటివాడిని కాకపోయినా నీలా మాత్రం కాదు. 

కాబట్టి ఎప్పుడైనా రావచ్చు’’ శ్రీనివాసరావుకి నిజంగానే కోపం వచ్చింది.‘‘ఇంతకీ ఎప్పుడు రమ్మంటావు’’ తంబయ్య ప్రశ్నించాడు.‘‘నీకు పనుంటే నువ్వు ఎలాగైనా వస్తావు. అనవసరంగా నువ్వు రావు. ఫోను చేయవు. నేను చేస్తే అవసరాన్ని బట్టి ఫోను తీస్తావు. లేకపోతే కట్‌ చేస్తావు. నాలుగైదు సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్న పనే యిది. పావలా ఖర్చుపెట్టవు నువ్వు. లాభ నష్టాల గురించి లెక్కలు కట్టి - ప్లస్సు, మైనస్సులతో బేరీజు వేస్తావు. కాబట్టి నీకు ఎలా చేయాలనుంటే అలా చేయి’’ అంటూ ఫోను పెట్టేసాడు శ్రీనివాసరావు.తనతో ఏమిటి పని! అనుకున్నాడు.గంట తరువాత తంబయ్య శ్రీనివాసరావు యింటికొచ్చాడు. అయిదు నిమిషాలు మంచీ చెడ్డా కార్యక్రమం తరువాత యోగక్షేమాల పర్వాన్ని కూడా టచ్‌ చేసాడు తంబయ్య. శ్రీనివాసరావు వింటున్నాడు.‘‘ఈ మధ్య అయిదారు ఇంజనీరింగ్‌ కాలేజీలకు వెళ్ళి వచ్చాను’’ తంబయ్య పాయింటుని టచ్‌ చేసాడు.‘‘ఎందుకు’’.‘‘మా వాడిని కాలేజీలో చేర్పించేందుకు! మేనేజిమెంటు కోటాలో చేర్పించాలని! కావలసిన గ్రూపు రావాలిగా!’’‘‘ఇక్కడ సీటు రాదా’’‘‘మంచి కాలేజీలో రాదు’’‘‘శుభం నిర్ణయం మంచిదే... గుడ్‌లక్‌’’ అన్నాడు శ్రీనివాసరావు.‘‘కాలేజీలు, చదువులు, సీట్లు, ఫీజులు, డొనేషన్లు, హాస్టల్‌ ఫీజులు, పుస్తకాలు, డ్రస్సులకు రెండు మూడు లక్షల దాకా అవుతుంది’’ అంటూ నసిగాడు.‘‘సరే అయితే! నీ డబ్బు.... నీ కొడుకు.. నీ యిష్టం. నువ్వు డబ్బు విషయంలో బాగానే ఆలోచిస్తావు. పైగా డబ్బు గురించి నీ తర్వాతే ఎవరైనా!’’ అన్నాడు శ్రీనివాసరావు - తంబయ్య గురించి తెలుసు కాబట్టి.‘‘నువ్వు పాతిక వేలు సర్దాలి.... రెండు నెలల్లో తిరిగి యిచ్చేస్తాను. బ్యాంకులోను అప్లయ్‌ చేస్తాను. రాగానే యిచ్చేస్తాను’’ పాయింటులో కొచ్చాడు తంబయ్య.