ఆంధ్రప్రదేశ్‌లో మూలమూలలా, వాడవాడలా దావానలంలా వ్యాపించిపోయింది ఆ వార్త. జనం అట్టుడికిపోవడం మొదలుపెట్టారు. ఎటు చూసినా హాహాకారాలు మిన్నుముట్టాయి. ఇక పోతే మీడియా వాళ్ల సంబరానికి మాత్రం హద్దుల్లేవు. ‘వారం రోజుల పాటు ప్రోగ్రాంలే ప్రోగ్రాంలు’ అనుకుంటూ తెగ ఇదైపోయారు. వచ్చీరాని ఆనందంతో ఒకళ్ల కొకళ్లు ‘హైఫైన్స్‌’ ఇచ్చుకున్నారు. టివి ఛానెళ్లు పోటాపోటీలుగా ఆ వార్తను ఫ్లాష్‌ న్యూస్‌గా చూపించేశాయి. రేడియోలు అవిరామంగా, విరామం ఇచ్చి మళ్లీ మళ్లీ ఈ వార్త అనౌన్స్‌ చేశాయి. పాపం వార్తా పత్రికలకు అంత అదృష్టం లేదు. రేపటి దాకా ఆగక తప్పదు.ఇపడిపడే మోడలింగ్‌ రంగం నుంచి సినీరంగంలోకి వచ్చిన వర్థమాన తార అనూహ్య. షూటింగ్‌ లేకపోవడంతో తీరిగ్గా లేచింది. తీరికగా జాజీ అందించిన కాఫీ సిప్‌ చేస్తూ సోఫాలో కూర్చుని, యధాలాపంగా న్యూస్‌ ఛానల్‌ ‘‘క్లిక్‌’’ చేసింది. అపడు టైం తొమ్మిది కావడంతో న్యూస్‌ రీడర్‌ స్ర్కీన్‌ మీద ప్రత్యక్షమయింది. 

ఆమె ముఖం మీద అలవాటుగా సంతోషం దోబూచులాడింది. పెదవులపై నవ్వు నింపుకుని ఆమె వార్తలు చదవసాగింది.‘‘గుడ్‌ మార్నింగ్‌ ! సినీ ప్రేక్షకులకు ఒక దుర్వార్త. మన అభిమాన హీరో, యూనిక్‌ స్టార్‌, స్టారాఫ్‌ది యూనివర్స్‌, డాక్టర్‌ ప్రద్యుమ్నగారు దురదృష్టవశాత్తు షూటింగ్‌లో కాలు బెణికి పడడంతో దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే తీసుకొచ్చి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ‘ఆయుశ్శు’లో చేర్పించారు. ఇంకా తెలివిరాలేదని వార్త! అక్కడితో సంగ్రహ వార్తలు ముగియడంతో కొంచెం విరామం వచ్చింది.హీరో ప్రద్యుమ్నకి యాక్సిడెంటు అయ్యిందన్న వార్త వినగానే అనూహ్య మ్రాన్పడిపోయింది. కొంతసేపటికి తేరుకుని వెంటనే గోడ మీద తగిలించి వున్న వెంకటేశ్వరస్వామి పటం ముందు కన్నీళ్లు వరదలౌతుండగా సాష్టాంగం పడిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామిని పరిపరి విధాలుగా వేడుకుంది బెక్కుతూనే.‘‘స్వామీ! ఈ కలియుగంలో నీవే కదా ప్రత్యక్ష దైవానివి! నా మొర విను స్వామి! నా మీద దయ చూపి ప్రద్యుమ్నగారికి ఏ ఆపదా రానీకు. నా బ్రతుకు నాశనం చెయ్యకు స్వామి! నీ కొండంతా కాలినడకన ఎక్కి వచ్చి నీ దర్శనం చేసుకుంటా. పాహిమాం...పాహిమాం!’’