తెలవారుతున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఇంకా సెల్ ఫోన్లో అలారం మోగకపోవడంతో మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు విఠల్. నిద్రమత్తు పూర్తిగా వదల్లేదింకా. అలారానికి బదులు ఫోను మోగేసరికి లేచి కూర్చున్నాడు. ఫోన్లో రవి చెప్పిన విషయాలు విని అతనికి నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది.ప్రముఖ పారిశ్రామిక వేత్త శేషగిరిగారు చనిపోయార్ట. రాత్రి పన్నెండు గంటలప్పుడు గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేకపోయిందట. నాలుగ్గంటలకి శాంతి నగర్‌లోని ఇంటికి తీసుకొచ్చీసేర్ట. విశాఖపట్నంలో ఇదొక సంచలన వార్త. ఓ ఇరవైనిముషాల్లో అక్కడుంటానని రవికి చెప్పి బాతురూంలో దూరేడు ప్రశాంత్.ఐదు నిముషాల్లో తయారై బైక్ మీద బయల్దేరాడు. దారి పొడవునా శేషగిరి గారి గొప్పతనం, తనపై ఆయనకు గల ప్రత్యేకమైన అభి మానం అన్నీ అతనికి గుర్తుకొచ్చాయి.ముప్ఫయి ఏళ్ళ క్రితం పదిలక్షల రూపాయలతో మందుల హోల్‌సేల్ సప్లయి ఏజెన్సీ మొదలెట్టి అనతి కాలంలోనే అల్లోపతీ మందుల తయారీ కంపెనీ నెలకొల్పి అంచెలంచెలుగా విస్తరించి నేటికి వందకోట్ల టర్నోవరు గల కంపెనీ స్థాయికి తీసుకెళ్ళడం శేషగిరిగారి అకుంఠిత దీక్షకు, మొక్కవోని పట్టుదలకూ నిదర్శనం. ఆయన నిర్వహించే ఎన్నో ధార్మిక, సామాజిక, విద్యా, వైద్య పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటి కవరేజికి వెళ్ళడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర్నుంచి పరిశీలించగలిగే అవకాశం విఠల్‌కి కలిగింది.విఠల్ ఓ దినపత్రికలో చీఫ్ రిపోర్టరుగా పని చేస్తున్నాడు.
అతను కవర్ చేసే న్యూస్‌ని ఆ పేపరుకు సంబంధించిన న్యూస్ ఛానెల్ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ప్రత్యేకించి విశాఖపట్నం పరిసరాల్లో సంచలనాత్మక వార్తలను కవర్ చేసే బాధ్యత అతనికప్పగిస్తుంటారు. ఏదైనా విషయాన్ని అతను నెరేట్ చేసే విధానం అతని భాష కాస్త ఉత్తమ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఆ దినపత్రికలో, ఛానెల్‌లో అతనికి గుర్తింపు ఉంది. రవి కెమెరా మ్యాన్‌గా అతని వ్యాఖ్యానంతో వచ్చే వార్తలు నాణ్యంగా ఉంటాయని పేరుంది.గతంలో ‘బిజినెస్ మ్యాగ్నెట్స్’ అనే కార్యక్రమంలో సతీ సమేతంగా శేషగిరిగారిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఛానెల్‌లో ప్రసారం చేసారు. ఆ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఆ సందర్భంగా శేషగిరిగారిని, శ్రీమతి మణిగారిని వాళ్ళబ్బాయి సురేష్‌ని విఠల్ కలిసి మాట్లాడి కొన్ని షాట్స్ రికార్డ్ చేసి ఇంటర్వ్యూలో జతపరిచాడు. ఆ విధంగా వారితోనూ విఠల్‌కి పరిచయం ఏర్పడింది.ఇలా ఆలోచనల పరంపరలో ఉండగానే కొత్త రోడ్ దాటి శాంతినగర్ కాలనీ లోనికి బండి చేరుకుంది. దూరాన్నుంచి శేషగిరిగారి స్వగృహం దగ్గర అప్పటికే వందలాదిగా జనసమూహం కన్పిస్తోంది. టీవీ చానెళ్ళ కోలాహలమూ కన్పిస్తోంది. కాస్త దూరంలోనే రోడ్డు వారగా బైక్ పార్క్ చేసి ముందుకు నడిచాడు. విఠల్‌ని గమనించి ఎదురొచ్చాడు రవి. ‘‘విఠల్.. నీ కోసమే ఎదురు చూస్తున్నా... త్వరగా లైవ్ కనెక్ట్ చెయ్యాలి.’’