సైకియాట్రిస్టు డా. మనస్వి కుర్చీలో గొంతుక్కూర్చుని నన్ను భయం భయంగా బిత్తర చూపులు చూస్తున్నాడు. చీటికి మాటికీ తన పక్కన తలుపుకేసి చూడసాగాడు. బహుశా పారిపోవడానికేమో అనుకున్నా. ‘‘నమస్కారం డాక్టరు గారూ’’ అంటూ పరిచయం చేసుకున్నాను.అతడెందుకు భయపడుతున్నాడో తెలియడం లేదు. కానీ నా మనసులో ఆనందతరంగాలు ఎగసి ఎగసి పడుతున్నాయి. పుట్టి బుద్ధెరిగిందగ్గర్నుంచి నన్ను చూసి భయపడ్డది ఈయనొక్కడే. అంచేత ఆయన మీద నాకు ఆప్యాయత అభిమానం బిపి పెరిగినట్లు పెరిగాయి.‘‘నాదో విచిత్రమైన కేసు మనస్వి గారూ. నాకు పిచ్చి ఇప్పటికే ఎక్కిందా లేక సమీప భవిష్యత్తులో ఎక్కబోతోందా తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నా’’ఈ మాటలతో డా. మనస్వి మరింత భయంతో కుర్చీలో మరింత ముడుచుకున్నాడు. తలుపు చాటున ఒక స్త్రీ మా సంభాషణ వింటోందన్న నా ఇంగితం నన్ను పదే పదే హెచ్చరిస్తున్నది.‘‘ముందు మీ పేరు విని మీరు ఆడమనిషి- సారీ స్త్రీ స్వరూపిణి అనుకున్నాను. కాని మీ ముఖం చూశాక-మొహం చూసి మాత్రమేనండోయి- మీరు మగవారేనని నిశ్చయించుకొని చాలా సంతోషిస్తున్నాను’’ఆడ మనిషినైనా బాగుండేదంటూ మూలిగాడు మనస్వి.‘‘సరే నా విషయం చెబుతాను. నాకు మంచి ఉద్యోగం వుంది. 

నలభై లోపు వయసుంది. విజ్ఞానం ఫ్లోరోసెంటు కాంతిలా నా మొహం లోనూ మొహం నుంచి కూడాను-నిత్యం సతతధారాపాతంలా ప్రసరిస్తున్నది. ఈ విషయం ఈ సరికే మీరు గ్రహించి వుంటారు. మీకు మాత్రమే చెపుతున్నానండోయ్‌’’ లో గొంతుకతో చెప్పాను. ‘‘నా బ్యాంకు బ్యాలన్సు కూడా బానే వుంది’’తలుపు చాటున గాజుల చపడు వినిపించింది. మనిషి కనపడడలేదు. ‘‘ఎవరో చాటుగా మన మాటలు వింటున్నట్లుంది’’ అనుమానం వ్యక్తం చేశాను.‘‘అవును. నిజమే అలా వినడం చాలా అవసరం కూడా’’ గంభీరంగా అన్నాడు మనస్వి.‘‘సార్‌... నా సమస్య చెపుతాను. నాకు జీవితంలో సంతోషం అనేది అందరానిపండు-గగన కుసుమం ఇలాంటివే పోలికలు మరో రెండు మూడు కలుపుకోండి. మరేం ఫర్వాలేదు. అసలు నా బాధేమిటంటే నాకంటే వయసులో రెండింతలు పెద్దవాళ్లు కూడా నన్ను అంకుల్‌ అని సంబోధిస్తున్నారు. మొన్నటి మొన్న బస్టాపులో ఒకావిడ - వయసు అరవై పై మాటే. నన్ను అంకుల్‌ అని పిలుస్తూ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగింది. నేను జ్యోతిష్కుడిని కాదు. అంకుల్‌ అంతకంటే కానని నిర్మొహమాటంగా చెప్పాను. అంత కోపమెందుకు అంకుల్‌ అంది. సిగ్గూ లజ్జా మానాభిమానాలు ఉన్నవాడిని కాబట్టి ఆవిడను అక్కడే చంపేయాలని ఆ తరువాత స్వయంగా చితి పేర్చుకొని ప్రాయోపవేశం చేసుకోవాలనుకున్నాను. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పన్లూ రెండూ ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నాను.