ప్రతిరోజూ వేకువ జామునే ఆమె గుమ్మంలో అపడే నిద్రలేచిన అందంతో.. సగం నలిగిన చామంతి పువ్వులాగా మెరుస్తుంది. తనకు తోచిన గీతల్ని లతలు లతలుగా జతలు జతలుగా అల్లించి తెల్లటి రేఖల్ని ముగ్గులుగా సింగారిస్తుంది. ఆమెను అలాగే చూస్తుండిపోతాను.. నిర్ఘాంత పోయిన మేఘంలా. ఆమెను గురించి తెల్లవార్లూ నేను మేల్కొని పండించిన కవిత్వమంతా ఉదయ్యాన్నే ఎర్రకాగితపు పూల గుత్తుల్లో ప్రత్యక్షమౌతుంది. సెలయేటి ఆవలి గట్టున ఏకాంతంగా అల్లుకున్న కవిత్వమంతా పున్నమి వెన్నెల్లో పూసిన మొగలి పూల పరిమళాల్లో గుబాళిస్తుంది.కురిసి వెలిసిన ఆకాశాన్ని చూసినా.. తుఫాను తర్వాత సాగ రాన్ని చూసినా.. హృదయం మీద చందమామ వాలినట్లుంటుంది. అలాగే.. స్రవంతిని చూసినా.స్రవంతి... అందమైన చామంతి. మైమరిపించే సొగసుల పూబంతి. ఆకాశం నవ్వినట్లు, సముద్రం పాడినట్లు, నీలిమేఘాల్ని కడలి నురగల్ని కలిపి సంతూర్‌ మీటినట్లు ఆమె నవ్వు ఏ దూర తీరాలకో విసిరేసేది.రాత్రంతా వెన్నెల తనివితీరా దోసిళ్ళతో తాగి అల్లకల్లోలంగా అల్లుకున్న ఆమె అందమైన జాజిపూల జ్ఞాపకం కల చీకట్లోనే కరిగిపోయినా ఆ పరిమళం ఎంత దులిపినా పోదెందుకు? అయినా ఎదగడానికి వయసే పెరగ నక్కర్లేదు.. వేదన పెరిగినా చాలు కదా!స్రవంతి మా ఎదురింటి అమ్మాయి. చూడ్డానికి ఎంత అందంగా వుంటుందో మాట్లాడితే అంత కఠినంగానూ వుంటుంది. అందుకే కాలనీలో అందరూ ‘లేడీ విలన్‌’ అని ముద్దుగా పిల్చుకుంటూ వుంటాం. 

అందమైన అమ్మాయి వుండే కాలనీలో అబ్బాయిగా వుండడం కంటే మరో నరకం యింకోటి లేదనిపిస్తోంది. నలుగురు ఫ్రెండ్స్‌ తోడైతే చాలు మా మాటల మధ్యలోకి స్రవంతి పేరు వచ్చేస్తుంది. ఆ తర్వాత నా పేరు.. యింకేముంది ఏదీ చేతగాని వాడికిందకి నన్ను చేర్చేయడం జరుగుతోంది. త్వరగా ఆ అమ్మాయికి వాళ్ళింట్లో వాళ్ళు పెళ్ళి చేసేస్తే నాకు మనశ్శాంతి అయినా మిగుల్తుందని అనిపిస్తోంది. నాకు ఇపడిపడే పెళ్ళి అయ్యే పరిస్థితులు కూడా కన్పించడం లేదు. ఇంట్లో ‘కీర్తన’ చెల్లెలు వుందికదా!ఇలా ఆలోచనల్లో వుండగానే మిత్రుడు కార్తీక్‌ వచ్చాడు. తను హైద్రాబాదు వెళ్తున్నట్లు చెప్పి కొంత డబ్బు ఏదైనా వుంటే సర్దమని అడిగాడు. తపతుందా? నా దగ్గర ఖర్చుల కోసం వుంచుకున్నదంతా ఊడ్చి వాడి చేతుల్లో పోశాను. వాడి ముఖం వెలిగిపోయింది.‘‘తిరిగి ఇచ్చేది వుందా లేదా?’’ అని అడిగాను వాడ్ని అనుమానంగా.‘‘చూద్దాం మామ! నా దగ్గరుంటే నీదగ్గరున్నట్లు కాదా.. నీదగ్గరుంటే నా దగ్గరున్నట్లు కాదా...’’ అన్నాడు కళ్ళు ఎగరేస్తూ.అయినా వీళ్ళకు తీసుకోవడం తప్పితే యివ్వడం ఎపడు కుదిరి చచ్చింది గనుక...