హంపీనగరం గాఢ సుషుప్తిలో మునిగి ఉంది. నిశ్శబ్దం.. రాజు ప్రసాదపు గవాక్షంలో ఒక వ్యక్తి పంజరంలో బంధింప బడ్డ మృగరాజులా కలయ తిరుగుతున్నాడు. వర్ష ఋతువు .. నల్లటి మృత్యుమేఘాలు బలహీనంగా ప్రకాశిస్తున్న రాకా సుధాకరుని మింగాలని ముంచు కొస్తున్నాయి.ఆ నిశీధిలో నగరానికి ఉత్తర దిక్కున ఉన్న తుంగభద్రానది కల్లోల భరితంగా ఉంది. కన్నడ రాజ్య రమా రమణ ‘మూరు రాయన గండ’ ‘ఆంధ్రబోజ’ బిరుదాంకితుడైన రాయల మనస్సు తుంభద్ర కన్నా కల్లోలంగా ఉంది.మేఘాలు చంద్రుడిని పూర్తిగా కప్పి వేసాయి. గజశాలలో ఏదో బాధగొన్న ఏనుగు తదేకంగా రోదిస్తోంది. ఆ నిశీధిలో ఆ భీకర ధ్వని హృదయ వికారంగా ఉంది.‘‘విరుపాక్షా నా చిన్నారి యువరాజును కాపాడు.. మా కులదైవమా.. తిరుమల నాథా, నీ పేరే నా కుమారునిది... నా చిన్ని తిరుమ రాయని, పెద్ద తిరుమ రాయుడైన నీవైనా కాపాడు...’’ఆరు సంవత్సరాలు నిండని తిరుమ రాయుడు ఏదో అంతు చిక్కని వ్యాధితో బాధ పడుతున్నాడు.గవాక్షం నుంచి వైదొలగి చిన్ని రాయల నివాసం వైపు కదిలాడు రాయలు. ఇది ఎన్నోసారో.. ఈ ఒక్క రోజులో...వాలిపోయి బల్లిలా మంచానికంటుకుని ఉన్నాడు, తిరుమల రాయుడు.ఎంతలో ఎంత మార్పు.. చిన్న రాయలు రాజుగా పట్టాభిషిక్తుడయినప్పుడు నిండు జాబిల్లిలా వెలిగిపోయాడు. 

ఇప్పుడు? ఆహారం ఇమడదు.. తిన్నది వమనమయిపోతోంది... కళ్లు, కేశములు. నఖములు కళా విహీనమయి పోతున్నాయి.రాయల మనసు మరీ వికలమయింది. ఆ లేఖ చూసిన తర్వాత.‘‘రాజా! యువ రాజుకి విష ప్రయోగం జరిగింది. చేసింది ఎవరో కాదు.. మీ రాజ ప్రాసదానికి గోక్షీరం ఎక్కడ నుంచి వస్తుందో ఆ గోశాలను దర్శించండి.. విష ప్రయోగం ఎలా జరిగిందీ తెలుస్తుంది...రాజుకు శత్రువుల కొదువ లేదు. మర్మంగా ఉంటూ దెబ్బతీసేవారు.. పురంలో ఉంటూ అంతఃపురాన్ని ధ్వంసం చేయాలని చూసే దుష్టశక్తులు, పచ్చికలో విషనాగుల్లా కాటేయాలని చూసే విదేశీ కుట్రదారులు.రాయల మనసు ఒక క్షణంలో విజయనగర సామ్రాజ్యాన్ని చుట్టి వచ్చింది. అహమదీ నగర్‌ సుల్తాన్‌, బీదర్‌, బిరార్‌, బిజీపూర్‌, గోల్కొండ నవాబు-వీరందరూ విజయనగరాన్ని నాశనం చెయ్యాలని ఆశతో ఉన్నవారే.