ఆదివారం కావడంతో షేవింగ్‌ కోసం సెలూన్‌కు బయలుదేరాను. ప్రతిసారి వెళ్ళే సెలూన్‌లో బాగా రద్దీగా వుండడంతో ప్రక్కకి కొత్తగా ఓపెన్‌ చేసిన మరో సెలూన్‌లోకి వెళ్ళాను. షాపు ఓనర్‌ ఓ 20 ఏళ్ళ కుర్రాడే అయినా షాపునంతా మోడ్రన్‌గా అలంకరించాడు.్ఠ‘ఏమోయ్‌ షేవింగ్‌ చేయాలి’’ అని అడిగాను.‘‘రండి సార్‌, కూర్చోండి’’ అంటూ కుర్చీని క్లీన్‌ చేశాడు.‘‘వ్యాపారం ఎలాగుంది?’’ అని అడిగాను.‘‘బాగానే వుంది. అయినా మీలాంటి రెగ్యులర్‌ పార్టీలు దొరకాలి కదా సార్‌’’ అన్నాడు తన పనిలో నిమగ్నమవుతూ.‘‘సార్‌ మీ సెల్‌ఫోన్‌ తీసి టేబుల్‌ మీద వుంచండి, లేకపోతే నీళ్ళు తగులుతాయి సార్‌’’ అనడంతో సెల్‌ఫోన్‌ తీసి టేబుల్‌ మీద వుంచాను.షేవింగ్‌ ముగించుకున్న నేను కాసేపు పేపర్‌ చదువుతూ అక్కడే కూర్చున్నాను. ఇంతలో షాపులో రద్దీ పెరగడంతో పర్సులోంచి డబ్బులు తీసి ఎంత అని అడిగాను బయలుదేరబోతూ.‘‘పది రూపాయలివ్వండి సార్‌’’ అన్నాడు ఆ అబ్బాయి.పర్సులోంచి తీసిన వంద రూపాయలు ఆ అబ్బాయికిచ్చాను.

‘‘ఇదిగోండి సార్‌ చిల్లర’’ అంటూ నాలుగు వందల తొంభై రూపాయలను చేతిలో వుంచి మళ్ళీ తన పనిలో నిమగ్నమయిపోయాడు.తనిచ్చింది 500 రూపాయల నోటు కాబోలు అనుకున్నట్లున్నాడు. నాలుగు వందల రూపాయలు ఎక్కువిచ్చాడు.అయినా అందివచ్చిన లాభం ఎందుకు వదులు కోవాలనుకుంటూనే మెల్లగా బయటికి వచ్చాను. అంతరాత్మ ప్రబోధిస్తున్నా లెక్కపెట్టకుండా విజిల్‌ వేసుకుంటూ బైక్‌ స్టార్ట్‌ చేసి టెన్నిస్‌ కోర్టువైపు బయలుదేరాను.సరదాగా టెన్నిస్‌ ఆడుతున్న నాకు పక్కనే వున్న సుబ్బారావు సెల్‌ మ్రోగడంతో ఒక్కసారి నా సెల్‌ఫోన్‌ సంగతి గుర్తుకువచ్చింది. అప్పటివరకు నాకు ఆ సెల్‌ఫోన్‌ సంగతి జ్ఞాపకమే లేదు.దాదాపు 20 వేల రూపాయల ఇంపోర్టెడ్‌ పీస్‌ అది. నాలుగు వందల రూపాయలకోసం ఆశపడిన నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూనే సెలూన్‌ దగ్గరికి బయలుదేరాను.అప్పటికే సెలూన్‌ మూసివుండడంతో కాసేపు అక్కడే కూర్చుండిపోయాను. రేపు ఆ అబ్బాయి ఆ సెల్లు సంగతి తెలియదన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఉస్సురుమంటూనే ఇంటిదారి పట్టాను.నన్ను చూడగానే నా భార్య లోపలినుంచి వచ్చింది. తన చేతిలో వున్న నా సెల్‌ఫోన్‌ చూడగానే ఒక్కసారి షాక్‌ అయ్యాను.