రైలు ముందుకు పోతూంది.కిటికీలో నుండి చూస్తుంటే చెట్టూ, మునిసుందరంచేనూ, కొండా, కోనా వెనక్కిపోతున్నాయి నా ఆలోచనల లాగే. నా జ్ఞాపకాల్లాగే...‘‘చాలా సంతోషం బాబూ!’’‘‘అంతా మీ ఆశీర్వాదం నాన్నా!’’చిరునవ్వు చారిక అట్లా మెరిసి యిట్లా వెళ్ళిపోయింది గోపాలం పెదిమలపై. పల్చటి నీలినీడలు పరుచుకున్నాయి అతడి ముఖంపై.మౌనంగా కిటికీ కేసి చూస్తూ నిలబడ్డాడు.‘‘నేను రేపు బయలుదేరుతాను నాన్నా’’‘‘రాజా!’’ ఆపాలన్న ఆదుర్దా ఆ పిలుపులో.‘‘చెప్పండి నాన్నా!’’‘‘నీకప్పుడు ఏడు సంవత్సరాలు. మనం యీ పట్నానికి బతకడానికి వచ్చాం’’‘‘తెలుసు నాన్నా’’.‘‘నువ్వు ఉద్యోగంలో చేరే ముందు మన వూరు సీతారామాపురం వెళ్లి రావాలి’’.‘‘అలాగే నాన్నా!’’‘‘అక్కయ్యచెరువు శివాలయంలో దేవుడికి పూజచేసి రావాలి. ఎందుకో అక్కడికి వెళ్లాక నీకే తెలుస్తుంది’’.‘‘తప్పకుండా. అయితే నేను రైల్లో వెడతాను నాన్నా’’.‘‘నీ యిష్టం’’రైలు మిట్ట ఎక్కుతున్నట్టుంది. టన్నుల బరువును నెత్తిన పెట్టుకుని నడుస్తున్న మధ్య తరగతి జీవితంలా.ముసురుకున్న ఆలోచనలు.జీవితం అంటే అలజడి. కాలమా? క్షణమాగదు. అయినా... ఏదో ఆశ. మనిషిని నడిపిస్తుంది. ఎప్పుడూ నడిపిస్తూనే వుంటుంది.ఆశయం, ఆదర్శం అంటే అర్థం తెలిసి పోరాడే వారిలో స్వార్థం వుంటుంది. 

అర్థం తెలియక పోరాటం సలిపే పామరునిలో....శ్రమించి అల్లుకున్నగూడు పెనుగాలికి చెదిరిపోతే పిచ్చుక ఎంత బాధ పడుతుంది.రోజూ యీ గాలి ఎన్ని నిట్టూర్పులు మోసుకెళుతుందో...చిన్నిచిన్ని చేతులు కట్టిన గుజ్జనగూళ్లు... కెరటాలు చెరిపేసి పోతూంటే... పసిగుండెల చూపులు... ఆశతో నిండినవో నిరాశతో కుంగినవో... అంచనా వేయడం సులభమా?పూడి స్టేషన్‌లో రైలు ఆగింది. ఇంకో 15 కిలోమీటర్లు. తడుకు స్టేషన్‌ వచ్చేస్తుంది.నేను పుట్టిన వూరు సీతారామాపురం. జ్ఞాపకాల దొంతరలో నా జన్మభూమి దృశ్యం. కొండలమధ్య వెళ్లే యిరుకుదారి. రైలు దిగి వెళ్లాలంటే భయం భయంగా వుండేది. వూరి గెవినిలో పెద్దరాగిచెట్టు. దాన్ని జండా మాను అనేవారు. నాగూరు మీరాసామి జెండాలు ఎగురుతుండేవి. నడివీధిలో గంగరాయి. తూరుపుగా గ్రామ దేవత గుడి. తామర పూలతో నిండిన అక్కయ్య చెరువు. గట్టుమీద పెద్ద వేప చెట్టు. ఆ చెట్టంటే పిల్లలకు భయం. అక్కడ అక్క దేవతలుంటారనే వాళ్లు. గేదెల్ని చెరువు మొరవలోకి తోలి నా నేస్తగాళ్లు....రాజా జ్ఞాపకాల తోరణం తెగిపోయింది. కూత వేస్తూ రైలు.... జ్ఞాపకాల కదలికలు నాలో...నేస్తగాళ్లు రామ్మూర్తి, నారాయణ, లక్ష్మి, ఎట్లా వున్నారో, నాలాగే వాళ్లూ పెద్ద వాళ్లయిపోయి వుంటారు.లక్ష్మీ... ఎంత అందంగా వుండేది. చక్రాల్లాంటి కళ్లు తిప్పుతూ మాట్లాడేది. అటుకులు, బెల్లం తెచ్చి పెట్టేది. పొడుగాటి వెంట్రుకలు. దువ్వేది కాదు. ఆటల్లో తన జట్టులోనే వుండేది. అమాయకంగా నవ్వేది.స్టేషన్‌లో దిగి కాలినడకన బయలుదేరాను. ఎద్దుబండి కూడా పోలేని ఎగుడు దిగుడు దారి. ఎద్దుల బండ్లు తిరగడం వల్ల మధ్యన ఎత్తుగా... అటూ యిటూ పల్లం. దారికటూ యిటూ అడ్డం దిడ్డంగా పెరిగిన సర్కారు కంప. మన అభివృద్ధిని తెలియజేస్తూంది. దారి మధ్యలో అక్కడక్కడా పిచ్చి మొక్కలు.