ఈనుపుల్లలా ఉంది రాధమ్మ చెయ్యి.దానితో అట్ల పుల్లని పట్టుకుని మూకుడులో బంగాళాదుంప ముక్కలను వేయిస్తోంది. డైబ్భై ఏళ్ళకి అటూ ఇటూగా ఉన్న ఆమె లక్ష్మీనారాయణ గురించి ఆలోచిస్తోంది.అతను గడిచిన రాత్రి నుంచీ ‘బంగాళా’-‘వేపుడు’ అంటున్నాడు. అంటూనోరు చప్పుడు చేస్తున్నాడు. ఏభై అయిదేళ్ళుగా ఆమెకి లక్ష్మీ నారాయణ ప్రతి కదలికా తెలుసు. ఆమె పుట్టి బుద్దెరిగినప్పటినుంచీ వింటోన్న సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వంటి వారి కథల నించే జీవిత నిర్వహణకు నమూనా లభించింది. ఆ నమూనాలలోనే ఆమె సకల ఉద్వేగాలూ ప్రదర్శితమయ్యాయి. ఇది ఆనందించవలసిందనీ ఇది బాధపడవలసిందనీ ఆమె అంతరంగాన్ని ప్రోగ్రామ్‌ చేసినవి ఆ నమూనాలే. ఆమెకి ప్రత్యేకమైన ప్రశ్నలు లేవు. ఏ ప్రశ్నలు కలగవచ్చో- కలిగితే ఏ జవాబులు ఇచ్చుకోవచ్చో కూడా ఆ నమూనాలే నిర్దేశించాయి.

భర్త తనని నిర్లక్ష్యం చేసి, వేశ్యల చుట్టూ తిరిగితే దానికి ఎంతవరకూ ఎలా దుఃఖించాలో, దుఃఖించి, ఆ దుఃఖం నుంచి బయటపడటానికి ఏ వేదాంతాలను ఆశ్రయించాలో, ఏయే దేవతలను ప్రసన్నం చేసుకోవాలో అవే నమూనాలు మార్గదర్శమయ్యాయి. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకో, వాళ్ల కష్టసుఖాలకో లక్ష్మీ నారాయణ తన జీవనాధారాలను కరిగించి వేస్తుంటే రేపెలా అన్న సహజమైన ప్రశ్న కలిగితే, దాన్నతని ముందు ఉంచితే, అదే ఓ తిరుగుబాటుగా అతను భావించితే, ఆ భావనతో ఆమెని శిక్షించటమే అతను స్వధర్మంగా ఎంచితే, అతనా స్వధర్మాన్ని నిర్వహించితే ఆమె దెబ్బలకు మందుకోసం ఆస్పత్రికి వెళ్ళింది గాని...సాయంకోసం పుట్టింటినీ, న్యాయం కోసం చట్టాన్నీ ఆశ్రయించలేదు.ఇక మగవాడు కొడుకుగా ఎలా ప్రవర్తించాలో, అన్నగా ఎలా జీవించాలో, యజమానిగా కిందివాళ్ళను ఎలా వంచాలో, కుటుంబమనే గొడుగుకు ఎలా కర్రగా నిల్చొవాలో, సామాజిక బాధ్యతకూ సంసార ధర్మానికీ మధ్య సంఘర్షణ తలెత్తితే ఎటు పక్క నిలవాలో చూపించిన శ్రీరామ చంద్రుని నమూనా, భార్య పట్ల వ్యక్తిగా ఎలా ప్రవర్తించాలో మాత్రం చెప్పలేదు.

 ఆ దాంపత్యంలో భార్య విధేయతకి లభించిన ప్రచారం ముందు భర్తకి ఉండవలసిన కొద్దిపాటి ధర్మాలు కొట్టుకుపోవడంతో భారతీయ పురుషుడికి స్త్రీ విషయంలో దాదాపు నమూనా లేకుండాపోయింది. రాముడి ఏకపత్నీవ్రతం దైవసాధ్యమై, కృష్ణుని బహు స్త్రీ సంగమం మానవుని సహజ వయోధర్మమై పోయింది. దాంతో లక్ష్మీ నారాయణ ఎందరికి లాగానో తనకి సౌలభ్యంగా ఉన్న అంశాలను రాముడి నమూనా నుంచి స్వీకరించి భర్తగా రాధమ్మని పాలించాడు. అదే ప్రేమయితే ప్రేమించాడు. ధర్మం అదే అయితే దాన్ని తు.చ. తప్పకుండా పాటించాడు.