ఒకప్పుడు అది దట్టమైన అడవి. మానవ సంచారానికి దూరంగా ఉండేది.అలాంటి అడవిలో మానవుల అలికిడి మెల్లగా మొదలైంది. క్రమేణా జనాభా పెరిగింది, అడవి తరిగింది.చివరకు అడవి అంతరించి కొండ చుట్టూ నగరం ఏర్పడింది. ఈలోగా మనిషి జీవితంలోకి మతం ప్రవేశించింది.ప్రారంభంలో ఒకే మతం, క్రమంగా ఎన్నో బేధాలు వచ్చాయి. పూర్వులు చెప్పిన ఏకమేవ సత్‌ సూక్తి అంతా మర్చిపోయారు. అంతటితో ఆగలేదు. ఎవరి ఆరాధనా విధానం గొప్ప అన్న అంశంపై వాదనలు, ప్రతి వాదనలు ముదిరి కొట్లాటలు, కొట్లాటలు ముదిరి దొమ్మీలు, దొమ్మీలు ముదిరి హత్యలు... ఇలా అంతులేని రక్తపాతం జరిగింది.పేరుకు ఒకటే నగరం కానీ కనిపించని అడ్డుగోడలెన్నో. గాలిని ఆరాఽధించేవారిది ఒక పేట, నీటిని పూజించేవారిది ఒక వాడ, అసలు ఆరాధనే వద్దనే వారిది ఒక వీధి, ఈ తేడాలన్నీ నాన్సెన్స్‌ అంతా ఒకటే అనేవాళ్లు కొందరు..... ఇలా నానా కంగాళీగా తయారయింది సమాజం. ఈ పరిస్థితి చూసి కొందరు బాధపడ్డారు కాని. సమాజాన్ని మార్చాలనే ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు. ఒకతను మాత్రం ఆ పరిస్థితిని అసహ్యించుకునేవాడు. ఆ అసహ్యం ఆలోచనగా అయింది. ఊరొదిలాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. చివరకు బ్రహ్మమొక్కటే అని తెలుసుకున్నాడు.తాను తెలుసుకున్న సత్యాన్ని తన ఊరివాళ్లకు చెప్పాలని తిరిగి వచ్చాడు. పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయని నగరంలో అడుగిడగానే అర్థమైందతనికి. ఊర్లో భారీ కొట్లాట జరుగుతోంది. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. కత్తులు లేస్తున్నాయి. అదే సమయానికి ఆ గందరగోళానికి భయపడి తుర్రుమంటున్న పావురానికి గుంపులోనుంచి విసిరిన చురకత్తి తగిలింది. అది చూసి తట్టుకోలేకపోయాడు అతను. ‘ఆపండి’ అని గట్టిగా అరిచాడు.

 ఇన్నాళ్ల ధ్యానానికి, సంపాదించిన జ్ఞానానికి మహిమ ఉందేమో అన్నట్లు అంతా ఆగిపోయారు. ఒక్కసారిగా నిశ్శబ్దం. కిందపడిన పావురాన్ని చేతులోకి తీసుకుని దయతో దాని భయం పోయేలా గుండెలకు హత్తుకున్నాడు. అద్భుతం పావురం గాయం మానింది.చూస్తున్న జనం నివ్వెరపోయారు. ఇతనెవరో మహానుభావుడనుకున్నారు. అతను పావురాన్ని తిరిగి గాల్లోకి ఎగరేసి నివ్వెరపోయి చూస్తున్న జనాన్ని ఉద్దేశించి దయతో కూడిన కొన్ని మాటలు చెప్పాడు. కఠినాత్ములు సైతం కరిగిపోయేలా ఉన్నాయి ఆ మాటలు. మంత్రముగ్దులైన జనం ఆయన వెంట నడిచారు. నగరం నలుమూలలా తిరిగాడతను. అందరూ సమానమే అని బోధించాడు. భిన్న రకాల ఆరాధనలున్నా అన్నీ దైవానికే చెందుతాయని చెప్పాడు.వాడలన్నీ ఏకమయ్యాయి. జనాల గుండెల్లో గోడలు బద్దలయ్యాయి. ఆయన మాటల ప్రభావంతో ఊరంతా ఒక్కటయింది. ఆయన్ని తమ రాజుగా ఉండమంది. సున్నితంగా తిరస్కరించాడతను. మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి అన్నాడు. తన బోధనలను మరవొద్దన్నాడు. ఎలా వచ్చాడో అలానే వెళ్లాడు. ఆయన్ను స్మరించుకుంటూ జనాలు స్వచ్ఛజీవనం గడపాలని నిర్ణయించుకున్నారు.