నిశ్శబ్దరాగాన్ని ఆలపిస్తూ భూదేవి సకల జనాలనూ ఆదమరిచి నిదుర పోయేలా జోలపాడుతున్న వేళ కృష్ణకిరణ్‌ మాత్రం నిద్రపోకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అదే ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక గురించో కాదు. రేపు అమ్మ, నాన్నలను ఏ విధంగా చూసుకోవాలి? ఎంతలా సుఖ పెట్టాలని! అతని ప్రతి ఆలోచనా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దానికో ఆకారం వస్తే గానీ అతనికి మనఃశ్శాంతి ఉండదు. అప్పటిదాకా అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటాడు. చెట్లన్నీ మౌన పాఠాన్ని వినిపిస్తున్నాయి. ఎదురింటి గోడమీద పడుతున్న అతని నీడ ఒక్కటే తోడుగా అనుసరిస్తోంది. అతని నిస్వార్థ కృషి ఫలించి తొమ్మిది నిముషాల తర్వాత ఓ మంచి ఆలోచన పురుడు పోసుకుంది. సంతోషం పాప పుట్టింది. అది వెల్లువై రేపు తన తల్లితండ్రులను ఆనందంలో తడిపాలి అనుకున్నాక అప్పటిదాకా దూరంగా దాక్కున్న నిద్రాదేవి అమాంతం వచ్చి మీద పడి అతన్ని ఆవహించింది.్‌్‌్‌అమ్మా! నాన్నా! ఈ రోజు మనం ‘సిరిపురం’ వెళుతున్నాం.‘‘నిజమాఁ!’’ వాళ్ళిద్దరి కళ్ళలో అంతులేని కాంతులు.‘‘తొందరగా రడీ అవండి. ఆలస్యం చేస్తే ఊరుకొనేది లేదు’’ తండ్రి పిల్లలకు చెప్పినట్లు చెప్పి ఇద్దరకూ ముద్దు ఇచ్చి వెళ్ళాడు.ఎందుకాలస్యం చేస్తాం అన్నట్లు తల్లీ, తండ్రి పోటీ పడుతూ గబగబా లేచి దుప్పట్లు మడత బెట్టబోయారు.

‘‘ఆ పని మీకెందుకు? నేను చూస్తానుగా! మీరు వెళ్ళి తయారవ్వండి’’ ఎప్పుడు వచ్చిందో కోడలు ‘కారుణ్య’ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది.ఏ పనీ చెయ్యనివ్వదు. ‘పైగా ఇన్నాళ్ళూ చేసింది చాలు. ఈ వయసులో హాయిగా విశ్రాంతి తీసుకోవాలి’ అంటూ వాళ్ళను చిన్నపిల్లలను చేసి నీతులు చెబుతుంది.అందుకే చిన్నతనంలో తను ఏదయినా పని చెప్పునప్పుడు కామ్‌గా చేసేస్తానన్నట్లు నోటి మీద వేలువేసుకుని కృష్ణ తమకు సంజ్ఞ చేసి ఆ పని చేసేవాడు. అది గుర్తు వచ్చి నవ్వుకుంటూ బయటకు నడిచారు.కొడుకు, కోడలి ఆప్యాయతతో అనునిత్యం సుప్రభాతం పాడే అదృష్టం నూటికో కోటికో ఏ ఒక్కరికో దక్కుతుంది. అది భగవంతుడు తన సొంతం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తే ఆయనను అనుసరించింది ఆమె.ఎనిమిది గంటలకు అలారం కొట్టింది.టిఫిన్‌ తిని హాలులో పడకుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నా తండ్రి చెంత చేరి ‘నాన్నా! ఇదుగో మీ షుగర్‌ టాబ్లెట్‌’ అన్నాడు.పేపరు ప్రక్కనపెట్టి ఆయన మందు బిళ్లను తీసుకోగానే ఎడమచేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాసును కుడి చేతిలోకి తీసుకొని ఆయనకి అందించాడు.పక్కింట్లోంచి పరుశురామయ్య గొంతు ‘‘నాకూ ఉన్నారు కొడుకులు చంపటానికి మందులిస్తారు కానీ బ్రతకటానికి మంచినీళ్ళు కూడా పొయ్యరు. ప్రక్కింటి కృష్ణని చూసి బుద్ధి తెచ్చుకోండి రా’ అంటే ‘పెద్ద చెప్పొచ్చావులే! నోరు మూసుకు కూర్చో!’ అని దబాయిస్తూ ఏదో బిరుదు ఇచ్చినంత ఆనందపడిపోతారు. ఎవరికెంత రాసిపెడితే అంతే. ఇలా సర్దుకుపోవటం అలవాటు చేసేసుకున్నాడు. తప్పదుగా మరి.