సమయం...రాత్రి తొమ్మిది గంటలు!ఆటోలోంచి దిగాడు మనోహర్. నేలను చిల్లులు చేస్తున్నట్లుగా కురుస్తున్న వాన చినుకుల్ని తప్పించుకోవడానికి ఒక చెయ్యి తల పైన పెట్టుకొని ఆటోవాడికి డబ్బులిచ్చి పరుగులాంటి నడకతో బస్ స్టేషన్‌లోకి వచ్చాడు. ఆ కాస్త వ్యవధిలోనే అతని శరీరం వానకి పూర్తిగా తడిసిపోయింది.ఒక్కసారి తల విదిలించి జేబులోంచి సిగరెట్‌ని తీసి వెలిగించాడు. అతనికి చాలా హుషారుగా వుంది. అదంతా కళ్లలో ఆనందంగా తొణికిసలాడుతోంది. తను సిటీకి వచ్చిన పని దిగ్విజయంగా పూర్తికావడంతో మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది.ఒకసారి టైం చూసుకున్నాడు... తొమ్మిందిపావు అవుతోంది. ‘తమ ఊరికి ఈ సమయంలో బస్సు వుందా? లేదా? అనుకుంటూ ‘ఎంక్వైరీ’లో కనుక్కుందామని నడిచాడు.వర్షం మరీ పెద్దదవడంతో ఒళ్లంతా చలితో సన్నగా ఒణుకుతోంది. గబగబా అడుగులు వేస్తున్న అతను చూసుకోకుండా ఎదురుగా వస్తున్న ఓ అమ్మాయిని గుద్దుకున్నాడు.ఆ హఠాత్పరిణామానికి ఓ క్షణం పాటు నివ్వెరపోయాడు మనోహర్. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకి ఆ అమ్మాయి భయపడింది కాబోలు- అందమైన కళ్లని గుండ్రంగా తిపతూ వైపు గుర్రుగా చూసింది.
మనోహర్ ఒక్క క్షణం తనను తాను మరిచిపోయాడు. ఆ అమ్మాయిని చూస్తూ నోట మాట రానట్లు అలాగే నిల్చుండిపోయాడు. అతడెంతో మంది అమ్మాయిల్ని చూశాడు కానీ, ఇంత అందమైన అమ్మాయిని చూడడం గానీ, మనసు ఇంతగా చలించడం ఇంతకుమునుపు ఎన్నడూ జరగలేదు.ఆ అమ్మాయి వంకే చూస్తూ-‘వావ్‌ఁ...బ్యూటీఫుల్’! అని అనుకున్నాడు. అంతలోనే తేరుకుని ‘‘సారీ అండీ...చూసుకోలేదు. ఐ యామ్ రియల్లీ వెరీ సారీ....’’ అన్నాడు రిక్వెస్టింగ్‌గా...ఆమె మాట్లాడలేదు. కిందపడ్డ బ్యాగు, పుస్తకాలూ తీసుకొని ఓసారి అతని మొహంలోకి తీక్షణంగా చూసి, వడివడిగా ముందుకెళ్లిపోయింది.ఆమె ముఖంలో ఏదో కంగారుని కనిపెట్టాడు మనోహర్. చల్లగా వీస్తున్న గాలి వల్లో, లేక ఆమెని ఆవరించిన ఆందోళన వల్లనో ఆమె పెదవులు కంపిస్తూండడం కూడా అతడి దృష్టిని దాటిపోలేదు.కాసేపటికి తేరుకొని గట్టిగా తల విదిలించి ఎంక్వైరీ రూం వైపు కదిలాడు.ఆశ్చర్యం!!.... ఆ అమ్మాయి కూడా అటువైపే వస్తోంది.ఆమె మనోహర్‌ని పట్టించుకోకుండా అతడి ముందునుంచే వడివడిగా వెళ్లి ఎంక్వైరీ కౌంటర్‌లోని వ్యక్తిని కంగారుగా అడిగింది.
‘‘వెంకటాపురానికి వెళ్లాల్సిన బస్ ఇంకా రాలేదు... ఎపడొస్తుం దండీ?’’‘‘ఆ ఊరి బస్ ఫెయిల్ అయిందమ్మా! ఆ బస్‌ని క్యాన్సిల్ చేశారు. ఇపడిక బస్ లేదు.... ఉదయం ఆరున్నరకి వేరే బస్ వుంది’’ చెప్పాడతను.ఆ మాటలకి పక్కనే బాంబ్ పేలినట్లు అదిరిపడింది ఆ అమ్మాయి. తన పెద్ద పెద్ద కళ్లలో ఒక్కసారిగా కన్నీళ్లు సుడులు తిరిగాయి. ముఖమంతా ఆందోళన అలుముకుంది. భయంతో నిలువునా వణికిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అక్కడ్నించి కదిలింది.