‘‘దయ్యం?’’‘‘అవును... దయ్యమే. నాకు బాగా గుర్తున్న చిన్నప్పటి జ్ఞాపకం. మీకు నవ్వొస్తోందా?’’‘‘లేదు. మీ మనసుతో చెప్పుకున్నట్టే నా దగ్గర అన్నీ చెప్పుకోవచ్చు. చెప్పండి. ఎప్పుడు చూశారు?’’‘‘మేము అప్పుడు నాయనమ్మ దగ్గర ఉండేవాళ్ళం. నాయనమ్మకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్న వేరే ఊరిలో ఉద్యోగం చేసేవాడు. మా ఇంటి పక్కన ఉండే రమణమ్మ పిన్నికి ఎప్పుడూ దయ్యం పడుతుండేది. రమణమ్మ పిన్ని భర్త చాలా పెద్దవాడు. ఆయనని మేము తాత అని పిలిచేవాళ్ళం. పెళ్ళి చేసేటప్పటికి రమణమ్మ పిన్ని చాలా చిన్నదంట. జీలకర్ర, బెల్లం ఇస్తే తినేసింది అని చెప్తారు. మండపం మీద తాత ఒళ్ళో పడుకుని నిద్రపోతే లేపి తాళిబొట్టు కట్టారంట. రమణమ్మ పిన్నికి దయ్యం పట్టినప్పుడు ఒక రోజు నేను చూడటానికి వెళ్ళాను. మీకు బోర్‌ కొడుతోందా?’’‘‘లేదు చెప్పండి.’’‘‘చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. పూజలవీ చేశారు. రమణమ్మ పిన్ని కేకలు పెడుతూ నేలపైన పొర్లుతోంది. కాసేపటి తరువాత దయ్యం రమణమ్మ పిన్నిని వదిలేసింది. అప్పుడు ఆమె నిద్రలోకి పోయింది. కాని...’’‘‘ఊ... చెప్పండి.’’‘‘ఆ దయ్యాన్ని నేను చూశాను. అది రమణమ్మ పిన్నిలో నుంచి లేచి నా దగ్గరకు వచ్చింది.’’‘‘ఏమి చెప్పింది?’’‘‘నేను పెద్దదాన్నయ్యాక నా దగ్గరకు వస్తానని చెప్పింది. నాకు భయం వేసి అరిచాను. 

నాయనమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకుంది. ‘నాయనమ్మా... దయ్యం నేను పెద్ద అయిన తరువాత నా దగ్గరకు వస్తుందంట’ అని చెప్పాను. నాయనమ్మ నన్ను గట్టిగా హత్తుకుంది. ‘నేను ఉండగా నీ దగ్గరకు ఏ దయ్యమూ రాదు’ అని చెప్పింది. అప్పుడు నాకు భలే ధైర్యంగా అనిపించింది. నాయనమ్మ ఆ మాట నిలబెట్టుకుంది.’’‘‘ఊ.’’‘‘నేను చెప్పింది మీరు నమ్ముతున్నారా?’’‘‘నమ్ముతున్నాను.’’‘‘థాంక్‌ యు డాక్టర్‌. నాకు దయ్యం కనబడింది అంటే ఎవరూ నన్ను నమ్మలేదు. అరుణ్‌ కూడా. మీకు చాలా విషయాలు తెలుసు కదా. మీరు చెప్పండి. దయ్యాలున్నాయి కదా?’’‘‘ఉన్నాయి. అవి అందరినీ ఏదో రూపంలో పీడిస్తూనే ఉన్నా ఆ విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళు మిమ్మల్ని నమ్మటం లేదు.’’ఫఫఫ‘‘మీది ప్రేమ వివాహమా?’’‘‘అవును.’’‘‘మీకు అరుణ్‌ అంటే చాలా ఇష్టమా.’’‘‘అవును డాక్టర్‌. చాలా ఇష్టం. నా జీవితంలో నేను అంతగా నమ్మిన వ్యక్తి గాని, అంత దగ్గరగా ఫీల్‌ అయిన వ్యక్తి గాని ఇంకెవరూ లేరు. తన కోసం ప్రాణం ఇవ్వాలనిపిస్తుంది.’’‘‘మీ ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు?’’‘‘నేనే. అరుణ్‌కి నేనంటే ప్రేమని నాకు అర్థం అయిన తరువాత నేనే ముందుగా చెప్పాను.’’