ఫిబ్రవరి 7, శనివారం రాత్రి 1.00 గంట, రింగ్‌రోడ్‌అప్పుడే సినిమా అయిపోయి బయటికొచ్చారు బాబు, సతీష్‌. పార్కింగ్‌ నుంచీ మోటార్‌ సైకిల్‌ బయటికి తీశారు. మోటార్‌ సైకిల్‌ స్టార్ట్‌ చేసుకుని బయలుదేరిన వాళ్ళు, అరగంటలో రింగు రోడ్డు దాటి మైసూర్‌ రోడ్‌ చేరుకున్నారు. అంతవరకూ సినిమా గురించే సాగాయి మాటలు.మైసూరు రోడ్‌ ప్రవేశించగానే కాంపస్‌ దగ్గరకొచ్చేసినట్లు అనిపిస్తుంది. అయినా ఎప్పుడూ బిజీగా వుండే ఆ ప్రాంతం ఎందుకో ఈ రోజు అసాధారణంగా నిర్మానుష్యంగా ఉంది.ఏడో సెమిస్టర్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ ఈ మధ్యే ప్రవేశించిన ఆ ఇద్దరికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తమ కోర్సు వల్ల ఉద్యోగావకాశాలు సున్న అని తెలుసు. మూడేళ్ళ క్రితం కష్టపడి చదివి తెచ్చుకున్న సీట్లవి!హ ఠాత్తుగా ఇద్దరి మనసులూ సినిమాను విడిచి తమ భవిష్యత్తు వైపు వెళ్ళాయి.‘‘నీకేంరా, మీ డాడీ నిన్ను ఆస్ర్టేలియాకు పంపి ఎమ్‌.ఎస్‌ చదివిస్తారు. ఉద్యోగ ప్రయత్నానికి కాస్త వాయిదా పడుతుంది. నా గతేమవుతుందో?’’బాబుకు బాధేసింది. బాబుది కర్నూలు. వాళ్ళ నాన్నగారు పెద్ద వ్యాపారవేత్త. సతీష్‌కు తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అనంతపూర్‌లో కాలేజీ లెక్చరర్‌. ఇద్దరూ ఆర్‌వీ కాలేజ్‌లో చేరి, హాస్టల్లో రూంమేట్స్‌ అయాక మంచి స్నేహితులయ్యారు.

బాక్‌ లైటు వెలుగులో కాస్త దూరంలో ఒకతను తన బైక్‌ ఆపి, కింద మునిగాళ్ళమీద కూర్చుని ఏదో తంటాలు పడుతుండటం కనిపించింది. ఏమయినా సహాయం కావాలేమోనని బాబు తమ మోటార్‌ సైకిల్‌ ఆపాడు.అదే వాళ్ళు చేసిన తప్పు! మసక వెలుతురులో నలుపు మీసాలు, గెడ్డం వెనుక దాగి ముఖం కూడా బాగా కనిపించని ఆ ముప్పయిఏళ్ళ మనిషి నిదానంగా లేచి నిలుచుని, జేబులో ఉన్న చాకు తీసి చూపుతూ బెదిరించాడు. తమ దగ్గరున్న విలువయిన వస్తువులిచ్చేస్తే చాలు అనుకున్నారు వీళ్ళు.సతీష్‌ ‘‘ఏం కావాలి నీకు?’’ అన్నాడు కాస్త క్షీణమయిన స్వరంతో. చీకటి ముఖం వాడేమీ అనకముందే, అక్కడ పక్కనే చెట్లలో కొంచెం దూరం నుంచీ మారుతి ఎస్టీమ్‌ కారొచ్చి వీళ్ళ దగ్గర ఆగింది. అందులోంచి దిగిన రెండో గెడ్డంవాడు, ‘‘ఏరా కిట్టూ? బాబుగాడేనా దొరికింది!’’ అని సందేహం తీర్చుకుని తనపని మొదలుపెట్టాడు.బాబును, సతీష్‌ను తాళ్ళతో కట్టి కార్లో వేసుకుని, రజాక్‌ అనే గెడ్డంవాడు వెళ్ళిపోయాడు. నలుపుముఖం కిట్టు, తను కూచుని నటిస్తున్న పాత రిపేరు బైకును అక్కడే వదిలేసి, బాబు మోటార్‌ సైకిల్‌ తీసుకుని బయలుదేరాడు.ఐదు నిముషాల్లో ఆ రోడ్డు అంతవరకూ ఏదో జరిగిన ఆనవాళ్ళు కూడా లేకుండా మళ్ళీ నిర్మానుష్యమయిపోయింది.