‘‘నాన్నకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది పెదనాన్నా! హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాం. డాక్టర్లు అబ్జర్వేషన్‌లో ఉంచారు. మాకేం తోచడం లేదు. మీరు వెంటనే రండి పెదనాన్నా!’’ ఫోన్‌ చేశాడు రాజేష్‌. ఆ వార్త విని ఫోన్‌ చేత్తో పట్టుకుని అలా నిస్తేజంగా ఉండిపోయాడు శ్రీనివాస్‌.‘‘ఏంటి నాన్నా! ఏమైంది?’’ కంగారుగా అడిగాడు అనిల్‌.‘‘చంద్రం చిన్నాన్నకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందట. హాస్పిటల్‌లో ఉన్నాడట. రాజేష్‌ ఫోన్‌ చేసి చెప్పాడు.‘‘అయ్యో, అలాగ! వెంటనే వెళ్ళాలి నాన్నా! ఇప్పుడేదైనా ట్రైన్‌ ఉందేమో కనుక్కుంటాను’’.తండ్రీ కొడుకులిద్దరూ గరీబ్‌రథ్‌లో బయలుదేరారు. శ్రీనివా్‌సకి భయంగా ఉంది. చంద్రానికి హార్ట్‌ అటాకా? నమ్మలేకపోతున్నాడు తను. ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళారు.తన గుండెమీద చేత్తో ఆప్యాయంగా రాస్తూ చంద్రం అన్నాడు. ‘‘ఈ బుజ్జిముండ నాతోనే ఉందిరా. నేను రెస్టు తీసుకున్నా అది రెస్టు తీసుకోకుండా నా వెంటే ఉంటూ అవిరామంగా పనిచేస్తూ నాకు తోడూనీడగా ఉంటోంది! ఇంకెన్నాళ్ళు దానికి పని చెప్తాం? దానికి రెస్టు లేదు పాపం. వెర్రిది. నన్ను నమ్ముకుని ఉంది. దాన్ని కాపాడుకోవాలంటే అది మన చేతుల్లో ఉందా చెప్పు అన్నయ్యా?!’’ చంద్రం నవ్వుతూ అంటున్నాడు.‘‘ఎందుకురా అలా మాట్లాడతావు? అయినా నీకేం తక్కువైంది. ఇద్దరు కొడుకులుఉన్నారు!’’ శ్రీనివాస్‌ అన్నాడు.‘‘అవున్రా! నాకూ ఉన్నారు కొడుకులు! ప్రతీ సంవత్సరం డింకీలు కొడుతూ అదే క్లాసులో మూడేళ్ళబట్టి ఉన్నారు. ఇంట్లో కంచాలకు కంచాలు లాగించేసి ఊరుమీద పడి తిరుగుతున్నారు. 

కుక్కలకైతే విశ్వాసం ఉంటుంది. వీళ్ళకి అదీ లేదు! ఇంట్లో ఏ పనీ ముట్టుకోరు. అది కావాలి. ఇది కావాలి అని నన్ను పీక్కుతినడం తప్ప!’’ఏదైనా నవ్వుతూనే చెబుతాడు చంద్రం. అదే అతని ప్రత్యేకత!ఈలోగా జానకి వచ్చింది రూమ్‌లోకి.‘‘ఏంటి బావగారూ! ఈయన అప్పుడే తిట్లదండకం మొదలెట్టేశారా? పొద్దున్న లేచింది మొదలు ఇంట్లో అందర్నీ తిడుతూ ఉంటేగాని ఆయనకి రోజు గడవదు’’.‘‘అన్నయ్యా! దీని మాటలు నమ్మకు. అన్నీ అబద్ధాలు’’.‘‘కాదు, మీరే. నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. ఒక్క నిజం బైటకు రాదు’’.‘‘అవునే. నీలాంటి బ్రహ్మరాక్షసి పెళ్లాంగా దొరికితే నిజాలు బైటకెలా వస్తాయి? అన్నీ మరుగున పడిపోతాయి!’’ గొణిగాడు చంద్రం.‘‘ఏమిటి? ఏమంటున్నారు?’’ గయ్యిమని లేచింది జానకి.‘‘ఒరేయ్‌ చంద్రం! ఇప్పుడెందుకురా అవన్నీ. హాయిగా రెస్టు తీసుకోక. నువ్వు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు తిడుదువు గానిలే’’.‘‘ఎప్పుడూ నాతో, పిల్లల్తో గొడవ పెట్టుకుంటారు! అసలు ఎందుకు తిట్టాలి? రిటైరై పనీ పాటా లేకుండా ఇంట్లో కూర్చుంటే ఇలాగే ఉంటుంది మరి’’ జానకి రుసరుసలాడింది.ఇంతలో డాక్టరు వచ్చాడు.‘‘ఏమిటిగోల? పేషంటుని డిస్టర్బ్‌ చెయ్యకూడదని తెలియదా? మీరందరూ అవతలకి వెళ్లండి’’ అన్నాడతను కోపంగా.