తనను రెండు కళ్లు గమనిస్తున్నాయని గుర్తించింది అపూర్వ.ఆ వైపుగా తనూ దృష్టి సారించింది.అవే కళ్లు.... తనకిష్టమైన కళ్లు.... 15 ఏళ్ల తర్వాత...ఆశ్చర్యంతో ఒక్క క్షణం చూసింది. వెంటనే కనుమరుగయ్యాయి.ఇంకా చూడాలనిపించింది. కానీ అర్జున్‌ బండిమీద తాను.అర్జున్‌ అపూర్వను అక్కడకు దగ్గరలోనే ఉన్న గ్రంథాలయం ముందు దించి, అరగంటలో వస్తానంటూ వెళ్లిపోయాడు.ఆ కళ్లు మళ్లీ కనిపిస్తాయని అన్నివైపులా దృష్టి సారించింది అపూర్వ.కనిపించలేదు.నిరాశతో అక్కడే ఉన్న సుగుణా ఆంటీ వాళ్లింటికి వెళ్లింది.సుగుణా ఆంటీతో మాట్లాడుతున్నా... అపూర్వ మనస్సంతా గందరగోళంగా ఉంది. ఆంటీ అడుగుతున్న వాటికి ఏదో సమాధానాలు చెపుతూ ఉంది కానీ...మళ్లీ బయటకు వెళితే ఆ కళ్లు కనిపిస్తే బాగుండనుకుంటుంది మనస్సులో.ఇక అక్కడ కూర్చోలేక బయటకు వచ్చింది. మళ్లీ అవే కళ్లు కనిపించాయి. ఆ కళ్లతో తన కళ్లూ కలిపింది అపూర్వ. ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకోవడం ఆరంభించింది.... అలాగే నిగ్రహించుకుని ఆ కళ్లల్లోకే చూస్తోంది అపూర్వ.గ్రంథాలయంలోకి వస్తూ ‘బాగున్నావా?’ అన్న విశాల్‌ పలకరింపుతో కనురెప్పలు రెపరెపలాడించింది.‘బాగానే ఉన్నా... మరి ఉంటా...’ అన్నాడు విశాల్‌.‘అంతే ఖచ్చితం.... ఏమాత్రం మార్పులేదు మనిషిలో...’ విశాల్‌ గూర్చి అనుకుంది అపూర్వ.ఆ కళ్లు దూరమైపోతున్నాయి. విశాల్‌ ఇంకాస్సేపు అక్కడే ఉండి మాట్లాడితే ఎంత బాగుండు అనుకుంది. దూరమైపోతున్నాడు... అయినా ఆవైపుగానే చూస్తుండిపోయిన అపూర్వకు గతం ఒక్కసారి గుర్తుకొచ్చింది.్‌్‌్‌అపూర్వ చాలా చలాకీ అయిన అమ్మాయి. సమస్య ఏదైనా వస్తే దాని పరిష్కారానికి ఆలోచించాలిగానీ, బాధపడకూడదనేది ఆమె సిద్ధాంతం. 

అసలే పేదరికం... ఆపైన కుటుంబ బరువు, బాధ్యతలు పట్టకుండా తండ్రి దేశాన్ని పట్టుకుని పోయాడు. ఆ బాధను తట్టుకోలేక... అవమానాలు తట్టుకోలేక తల్లి ఉరివేసుకుని చనిపోయింది. అపూర్వే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. బాధ్యతలను ఎన్నడూ బరువుగా అనుకోలేదు అపూర్వ. చెల్లెల్ని డిగ్రీ వరకూ చదివించి, వివాహం చేసింది. తనొక్కతే ఉంటోంది.ఈ సమాజంలో కొందరు మాత్రమే గొప్పవారు. చాలా మంది పేదవారు. ఇందుకు కారణమైన ఈ వ్యవస్థ మారాలనే ఎప్పుడూ బలంగా కోరుకునేది అపూర్వ. ఆ సంకల్పంతో పనిచేస్తున్న ఒక రాజకీయపార్టీ కార్యాలయంలో చిరు ఉద్యోగిగా చేరింది. అక్కడ పనిచేయడం అపూర్వకు చాలా ఇష్టం. ఎంతో అంకితభావంతో పనిచేస్తుండేది అపూర్వ. అందరూ ఆమె పనితీరుకు ముగ్ధులై ప్రశంసించేవారు.అలా గడిచిపోతున్న జీవితంలోకి విశాల్‌ ప్రవేశించాడు. అతను పేరుకు తగ్గట్టే విశాల భావాలు కలవాడు. విశాల్‌ను కొద్దికాలంగా గమనిస్తోంది అపూర్వ.అపూర్వ కోరుకున్నట్లే అతనూ ఈ వ్యవస్థ మారాలనుకుంటున్నవాడు. అనుకుంటున్నవాడే కాదు ఆచరణలో నిజంగా అలా చేసేవాడే. అతను తెల్లవారితే మురికివాడల్లో ప్రత్యక్షమవుతాడు. వాళ్ల సమస్యలనే తన సమస్యల్లా నిరంతరం వాటి గురించే ఆలోచిస్తాడు. ఆ సమస్యలకు పరిష్కార రూపాల కోసం శోధిస్తాడు. అందుకనుగుణంగా పోరాటాలు జరపడంలో ముందుంటాడు. ఆ క్రమంలోనే అతను అక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి మరింత ఎక్కువ సమయం గడుపుతూ వారితో మమేకమై పనిచేస్తున్నాడు.