‘‘అప్పుడే వెళ్లి పోతున్నారా?...’’అడిగింది సరస్వతి. ఆ అడగడంలో ఏ భావమూ లేదు. చందూ నించి జవాబూ లేదు. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సరస్వతే మళ్లీ అంది’’ మీతో కొంచెం మాట్లాడాలి. నాకు సాయంత్రం వరకు కుదరదు. అందుకే... ఈ రోజు ఉండడం అవుతుందా?...’’ ఆ అడగడంలో అభ్యర్థన ఉందో, ఆదేశమే ఉందో అర్థం కాలేదు చందూకి. కానీ ఆమె మాట కాదనలేకపోయాడు. ఎందుకంటే ఇందాక జరిగిన సంఘటనతో ఆమె తనకెక్కడ దూరమౌతుందో’’ నని భయంగా ఉందతడికి. అలాంటిది. ఈ పలకరింపు కాస్త ఊరట కలిగించింది. అందుకే ఆమె అభ్యర్థనని ఆజ్ఞగానే భావించాడు. ఐనా... తనిందాక అలా ప్రవర్తించి ఉండవలసింది కాదేమో... అన్పించింది. ఆ వెను వెంటనే ఆ సంఘటన అతడి కళ్ల ముందు కదలాడింది.‘‘ఒసేయ్‌ సరస్వతీ! ఇలారమ్మీ!’’ అటుగా వెళుతున్న మూడో కూతుర్ని పిలిచింది తల్లి. ఆ పిలుపు విన్నామె దగ్గరికి రాకుండానే‘‘ఎందుకమ్మా?’’అనడిగింది. 

అంత దూరం వెళ్లే ఓపిక లేక. ఆమెకే కాదు ఇంట్లో ఉన్న అందరికీ అలాగే ఉంది. రాత్రి ఆ ఇంట్లో జరిగిన పెళ్లితో ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు. చాలా మంది చుట్టాలు వెళ్లిపోయారు. ముఖ్యమైన వాళ్లు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఉండిపోయారు. అదీ కాక పెళ్లి కూతుర్ని అత్తారింటికి పంపే రోజు ఈ రోజు. ఆ హడావుడిలో ఉన్నారు. ఆడవాళ్లంతా. అందుకే కూతురి ఇబ్బంది కనిపెట్టిన తల్లి కూడా అక్కడ్నుంచే జవాబిస్తూ’’సరస్వతీ! ఆ కొట్టు గదిలో సారీ సామాన్లున్నాయి. అవన్నీ సర్దు’’అంటూ పని పురమాయించింది.అప్పుడే ఆ పక్క నుంచి వెళుతున్న చందూ చెవిన పడ్డాయి ఆ మాటలు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. ‘‘ఇదొక సువార్ణావకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ బందరు లడ్డూ లాంటి పడుచు పిల్ల. తనకి ఏకాంతంగా దొరకబోతోంది. బంతి పూవులాంటి ఆమె మేని మెత్తదన ం తన చేతికి పరిచయమే.

అది గుర్తుకు రాగానే నరాలు జివ్వుమన్నాయి చందూకి.సన్న జాజి తీగలాంటి నాజూకుతనం, దానికి తగ్గ అందం, ఆ అందానికి తగ్గ చలాకీతనం ఇవన్నీ చూసి ఆమె పై మనసు పడ్డ చందూ సరస్వతికి వరసైనవాడే. మంచి ఉద్యోగం, మెరుగైన ఆదాయం ఉన్నవాడు అదీకాక బంధువుల ఇంట పెళ్లిలో ఆమెను చూసినచ్చాడు. అందుకే కోరి ఆ పిల్లని చేసుకుంటానని ఆమె తల్లిదండ్రుల్నడిగాడు.అన్ని విధాల అనుకూలుడు, బంధువు, పైగా మనసుపడి అడిగాడు కాబట్టి ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆమె కంటే పెద్దామెకి పెళ్లయ్యాకే ఈమెకి చేస్తామని చిన్న షరతు పెట్టారు. ఇప్పుడా పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడా పెళ్లికే వచ్చాడు. తనకిక లైన్‌ క్లియర్‌. ‘‘ఆలోచనల్తో ఉన్న చందూ పక్కకి చూసాడు. సరస్వతి అక్కడ లేదు.