ర్రెండు రోజులైనా వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ఊరువాడా ఏకమై పోయినట్లు అంతా జలమయమై పోయింది. కరెంట్‌ పోయి అంతా చీకటిగా ఉంది. రాత్రి పదకొండు గంటలు దాటి ఉంటుంది, మాయా మెటర్నిటి అండ్‌ ఫెర్టిలిటి నర్సింగ్‌ హోంలో ఎమర్జెన్సీ జెనరేటర్‌ లైట్లు మినుకు మినుకుమని వెలుగుతున్నాయి. లేబర్‌ వార్డ్‌ నుంచి చిన్న మూలుగులు, అప్పుడప్పుడు చంటి పాపల ఏడ్పులు తప్ప లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. నైట్‌ డ్యూటీ నర్సులు చిన్నగా మాట్లాడుకుంటూ వారి పని చూసుకుంటున్నారు.లేబర్‌ రూమ్‌నించి సుజాతని ఇద్దరు ఆయాలు స్ర్టెచర్‌ మీద తోసుకుంటూ రూం కేసి తీసుకెళ్ళి ఆమె బెడ్‌ మీదకు చేర్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళే వరకు ఆగిన సుజాత, తర్వాత కుమిలి కుమిలి ఏడవసాగింది.కొంచెం తమాయించుకున్నాక... ఎందుకు భగవాన్‌ ఇలా అయింది! ఎంత దురదృష్టవంతురాలినో, ఏ పాపం చేసానో నా చేతికందిన ప్రేమ ఫలం ఇలా నా చేయి జారిపోయింది? భగవాన్‌, నేను ఇలా గొడ్రాలిగానే ఉండిపోతానా? అని పరిపరి విధాల దుఃఖిస్తూ మగతగా పడుకొంది.సుజాతకి గ్రాడ్యుయేషన్‌ అవగానే ఈశ్వర్‌తో పెళ్ళయిపోయింది. కాపురానికి అతనితో హైదరాబాద్‌ వచ్చింది. రెండేళ్ళు మురిపాలు ముచ్చట్లతో గడిచిపోయాయి. పిల్లలు ఉంటే బాగుంటుందని ఎదురుచూడసాగారు. ఏడాది గడిచిపోయింది, ఇంక సుజాతకి దిగులు మొదలైంది. ఈశ్వర్‌ ధైర్యం చెప్పి సుజాతని, తెలిసిన గైనకాలజిస్ట్‌ దగ్గరకి తీసుకెళ్ళి చెకప్‌ చేయించాడు. ఏమీ ఫరవాలేదని, ఇద్దరిలోను, ఏమీ లోపం లేదని, తప్పకుండా పిల్లలు కలుగుతారని అన్నారు. పెళ్లి అయి ఎనిమిది సంవత్సరాలైంది. స్పెషలిస్టులను కలుస్తూనే ఉన్నారు. తను తల్లి అయ్యే భాగ్యం లేదేమో అని సుజాత నిరుత్సాహ పడసాగింది.అనుకోకుండా ఒక రోజు తన చిన్ననాటి చెలి మాయ కలిసింది. మాయా, సుజాతా ఇంటర్‌ వరకు కలిసి చదువుకున్నారు. 

ఇంటర్‌ తరువాత మాయ మెడిసిన్‌ చదవడానికి వైజాగ్‌ వెళ్ళి పోయింది. సుజాత బీఎస్సీ చెయ్యగానే పెళ్లి అయి హైదరాబాద్‌ వచ్చేసింది. ఇన్నాళ్ళకు తిరిగి కలుసుకున్నారు.సుజాత, మాయని తమ ఇంటికి ఆహ్వానించింది. ఎన్నో ఏళ్ళ తర్వాత కలుస్తున్నామనే ఆనందంతో, మాయ ఉత్సాహంగా సుజాత ఇంటికి బయలుదేరింది.‘‘ఏమిటే విశేషాలు? నీ పెళ్ళికి కలుసుకున్నాం, మళ్ళీ ఇన్నాళ్లకు...ఊం ఇంకేమిటి? మీ ఆయనేడి? శనివారం సెలవు కాదా? అన్నట్లు పిల్లలేరీ?’’ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించేస్తోంది. సుజాత అన్యమనస్కంగా జవాబు చెబుతూ, కంటనీరు పెట్టుకొని చటుక్కున వంటింటికేసి వెడుతుంటే, మాయ ఆమె చెయ్యి పట్టుకుని ‘‘ఏమిటి సుజా... ఏమైందే నేనేమైనా తప్పుగా అన్నానా?’’ సుజాత ఏడుపు ఆపుకుంటూ కాదని బుర్ర ఊపింది. ఆమెని కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగించింది. కొంచెం సర్దుకున్నాక, తనకు పిల్లలు కలగలేదని సుజాత తన ప్రాబ్లం చెప్పసాగింది. అంతా శ్రద్ధగా విన్నాక, రిపోర్టులు చూసీ, ‘‘ఓస్‌ ఈ మాత్రం దానికి అంతలా ఏడవాలా? చూడు సుజా... మీ రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఓకె. నువ్వు, ఓ పనిచెయ్యి. నేను ఈ మధ్యే ఇక్కడ బంజారా హిల్స్‌లో ఒక మెటర్నిటీ అండ్‌ ఫెర్టిలిటీ నర్సింగ్‌ హోం తెరిచాను. రేపు ఆదివారం కదూ...ఊమ్‌! సోమవారం పదింటికి వచ్చెయ్యి. ఇదిగో నా కార్డు, అడ్రస్‌ చాలా ఈజీ. నువ్వు నిశ్చింతగా ఉండు. చూడు వచ్చే ఏడాదికి నీ వళ్ళో బేబీ ఉండక పోతే నా పేరు మాయే కాదు’’