నారాయణగారి తత్వం ఆయన బ్రతికినన్నాళ్లే కాకుండా చనిపోయాక కూడా ఆశ్చర్యకరమే అయింది ఆ గ్రామవాసులకు.ఇప్పటికి పదిహేనేళ్ల క్రిందట తనూ, భార్యా, యిద్దరు పిల్లలతో వచ్చాడు ఆ గ్రామం. ఆ సరికి పెద్ద కుర్రాడికి ఏడేళ్లూ, చిన్నవాడికి అయిదేళ్లూ వుంటాయి.సహజ కౌతుక స్వభావులయిన పల్లీయులు అతని చరిత్ర తెలుసుకోడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కాని విఫలులయ్యారు. భోగట్టాలు లాగడంలోనూ, ప్రచారం చేయడంలోనూ అసాధారణ ప్రజ్ఞగల స్ర్తీ జనమే - విఫలులయ్యారు.ఇందులో కిటుకేమంటే నారాయణగారుగాని, ఆయన భార్యగాని ఎన్నడూ ఉబుసుపోక కోసరం బయటకు వచ్చేవారు కారు. పోతే మిగిలిన మార్గం ఆ పిల్లలను కంగించటం. వాళ్లయినా అసాధ్యులుగా గోచరించేవారు. బాతాఖానీకి దించేసరికి ‘పనుందండీ’ అంటూ వెళ్లిపోయేవారు. సుమారు ఆరు మాసాలు యిలా గడిచేయి.విఫలులైన గ్రామీయులు యీలోగా ఆ కుటుంబపు బాహ్య గోచర ప్రమేయాల నుండీ, అతి ప్రయాసం పైన సాధించిన చిన్నచిన్న భోగట్టాలనుండీ, వాళ్ళ ఊహాగాన నైపుణ్యాన్నుపయోగించీ ఒక కథ అల్లుకుని చెప్పుకుంటూ సంతృప్తి పడి వూరుకున్నారు.ఆ కథ యిదీ -‘వాళ్ళు బ్రాహ్మణులు. కాస్త వున్నవాళ్ళేను. సుమారు ఎనభై తొంభై తులాల బంగారం బ్రాహ్మణి వంటి మీద వుంది. ఆయనేదో పెద్ద వుద్యోగమే చేసేవాడట. ఆ యజమానితో రగడ వచ్చి విడిచిపెట్టేసి యిలా వచ్చాడట-’యిక్కడ ఒక కథాంతరం ఉంది-‘యేదో పెద్ద వుద్యోగం చేసి వుండడం ఖాయమే! కాని ఆ ఉద్యోగం విడిచి పెట్టటానికి కారణం మాత్రం అదికాదు. 

లంచాలు బాగా తినేవాడట. ఏదో లంచం కేసులో పట్టుబడి జైలుకు వె ళ్లి- ఆ మచ్చ మాపుకోడానికి యిలా అజ్ఞాతవాసం చేస్తున్నాడట. ఆ నున్నని తలా, ఆ నున్నని మీసం వాటి చిహ్నాలేనట-’పై రెండు కథాంతరాలలోనూ రెండవదే ఎక్కువ ప్రచారంలో ఉండేది.‘- యేది యేమైనా మనుష్యులు చాలా మంచివారు. ఎదుటివారికి మర్యాద యిచ్చి మర్యాద పుచ్చుకుంటారు. వాళ్లు ఒకళ్ల జోలికి పోరు - యింకొకరిని తమ జోలికి రానీరు-’యిదీ కథ. తర్వాత కథ అందరికీ తెల్సు- తమ పొరుగు శ్రీరాములు నాయుడుతో చెయ్యి కలిపి వర్తకంలో వంతు తీసుకున్నాడు.శ్రీరాములు నాయుడుగారు ఆ ప్రాంతాల ప్రసిద్ధి కెక్కిన పొగాకు, వేరుశనగ వర్తకులు. చాలా మంచివాడు. మితభాషి. ఎవరితో జోక్యం కల్పించుకున్నా వ్యవహార రీత్యా ఎంతవరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతారు. బహు ఖచ్చితమైన వ్యక్తి. మంచి వ్యవహర్త.మూడేళ్లు కావోలు శ్రీరాములు నాయుడుగారితో కలిసి వర్తకం చేశాడు. మూడేళ్లలోనూ మూడువేలు సంపాయించేడు. ఆ తర్వాత విడిపోయి వేరే వర్తకం పెట్టాడు. మరి అప్పణ్ణుంచీ అతని ఆదాయం సంగతి ఎవరికీ తెలియదు. కాని మొత్తం ఆస్థంతా నేటికి యిరవై వేలకు తక్కువ వుండదని అంచనా.