‘‘ఎడమవైపుకు తిప’’ రిక్షా అతనితో అన్నాను.అమ్మవారి కోవెల నుంచి శ్రావ్యంగా కీర్తనలు వినపడుతున్నాయి. రిక్షా మునసబు గారిల్లు దాటింది. వాళ్ళ దొడ్లోనే నేనూ, వాళ్ళమ్మాయి లకి్క్ష ఎన్నో ఆటలు ఆడుకున్నాం. రెండిళ్ళ అవతలే దర్జీ మస్తాన్‌ మిషను కొట్టు. చిన్ననాటి జ్ఞాపకాలు నన్ను అలల్లా సృజిస్తుంటే మనస్సంతా ఆహ్లాదంగా అయింది. నాయుడి గారికి మూడో ఇల్లు మా ఇల్లు - పెంకుటిల్లు అయినా ముచ్చటగా పొందికగా ఉంటుంది. ముందు పెద్ద అరుగు. అదంటే నాకెంత ఇష్టమో! అరుగు మీద నాన్న, అమ్మ, అక్క, చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు అందరూ ఎదురుచూస్తూ వున్నారు నా రాకకోసం!రిక్షా ఆగగానే అందరి కళ్ళలో వేల మతాబులు!! ఆ వెలుగులోకి జాలువారుతున్న అభిమానానికి నేను పులకించిపోయాను.‘‘ఎన్నాళ్ళయింది సీతా నిన్ను చూసి!’’ నాన్న గొంతు వణికింది చిన్నగా.‘‘ఏవే అలా చిక్కిపోయావు!’’ అమ్మ కళ్ళలో సన్నటి తడి.సామాన్లు లోపలపెట్టి నన్ను మహరాణిలా లోపలికి తీసుకువెళ్ళారు అందరూ.‘‘అక్కా! కాఫీ!’’ చెల్లాయి ఇత్తడి గ్లాసులో తెచ్చిన కాఫీ ఒకరకమైన వింత వాసనతో రుచిగా ఉంది.‘‘ఏరా గోపీ! ఎలా చదువుతున్నావు!’’బదులుగా రిపోర్టు పట్టుకువచ్చాడు తమ్ముడు.‘‘వెరీగుడ్‌! టెన్తు ఫైనల్లో కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలి’’ అన్నాను మెచ్చుకోలుగా!‘‘ఏరా! రామూ! కాలేజీ ఎలా ఉంది!’’‘‘బాగానే వుంది అక్కా!’’‘‘లెక్కల్లో కష్టంగా ఉంటేను ట్యూషను పెట్టించాము!’’ అమ్మ అందుకుంది.‘‘ఎక్కడ?’’‘‘అంకమ్మ చెట్టు దగ్గర. సైకిలు అద్దెకు తీసుకుని వెళుతున్నాడు’’ అమ్మ వాడివంక ప్రేమగా చూస్తూ అంది.‘‘ఆ’’ అంటూ నవ్వేశాను.

అమ్మకు పెద్దకొడుకంటే వల్లమాలిన ఆపేక్ష!‘‘లేమ్మా! స్నానం చేద్దువుగాని’’ నాన్న మాటలకి,‘‘ఒక్క నిముషం నాన్నా!’’ అంటూ సూట్‌కేసు తెరిచి నాన్నకోసం కొన్న కొత్త బట్టలు తెసి ఇచ్చాను.ఆయన కళ్ళు చెమర్చాయి.‘‘నేను నీకు కొనిపెట్టవలసిందిపోయి, ఆడపిల్లవి నువ్వు సంపాదించి తెచ్చిపోస్తుంటే తీసుకునే దౌర్భాగ్యాన్ని కలిగించాడాదేముడు!’’ ఆవేదన సుళ్ళు తిరిగింది ఆయన కంఠంలో!‘‘అవేం మాటలు నాన్నా! అదే కొడుకిస్తుంటే తీసుకోరా!’’ అనునయంగా అన్నాను.అమ్మకి బట్టలు, తమ్ముడికి వాచీలు, చెల్లాయికి చిన్న గొలుసు, అక్కకి బావకి టేప్‌రికార్డర్‌ ఇచ్చాను. రాముకి వెయ్యి రూపాయలు ఇచ్చి సైకిల్‌ కొనుక్కోమన్నాను.అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. అక్క ముఖమే కొద్దిగా దిగులుగా అనిపించింది. ఎందుకనో! భోజనాలు అయ్యాక నెమ్మదిగా పక్కమీద వాలాను. కిటికీలోంచి నేను పెట్టిన మల్లెతీగ ఆప్యాయంగా నన్ను పలకరిస్తోంది. నా మనసు గతంలోకి పరుగుతీసింది.్‌్‌్‌‘‘హాస్పిటల్‌ పట్టుమని పది మైళ్ళు లేదు. ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది లేదు. అయినా ఈరోజుల్లో అందరు ఆడపిల్లలు నర్సు కోచింగ్‌లోకి చేరుతున్నారు! మీ కిష్టమైతే సీతను రేపు తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో చేర్చేస్తాను. ఆలోచించుకోండి!’’ నర్సు మరియమ్మ అరుగు మీద కూర్చున్న నాన్నతో చెప్పేసి వెళ్ళిపోయింది.