కాలదూరాలు గాలికి గడ్డిపరకల్లా కొట్టుకుపోయాయి కదా! అమెరికా అంతర్వేదిపాలేనికి శివారుపల్లె కన్న చేరువై పోయింది కదా! ఉదయం ఆరు గంటలవేళ - బంజారాహిల్స్‌లోని నా బంగళాలో సిస్టమ్‌ ముందు కూర్చుని అమెరికాలోని కొడుకూ కోడళ్ళను, మనవడిని మానిటర్లో చూస్తూ మాట్లాడుతున్నాను.‘‘ఎలా ఉన్నారు డాడీ? మమ్మీ ఎలా ఉంది?’’ సందీప్‌అడుగుతున్నాడు.‘‘బాగానే ఉన్నాంరా! మీరెలా ఉన్నారు?’’‘‘ఇదిగో ఇప్పుడే ఇద్దరం ఆఫీసుల నుంచొచ్చాం. సంజయ్‌ని క్రెష్‌ నుంచి తీసుకొచ్చాం’’‘‘ఏమ్మా దీప్తీ! చంటాడు నడక నేర్చాడా?’’‘‘ఇప్పుడిప్పుడే గోడలు, సోఫాలు పట్టుకుని నుంచుంటున్నాడు అంకుల్‌!’’‘‘వాడు పుట్టి ఏడాదవుతోంది. ఇంతవరకు ఒక్కసారి కూడా ఇండియా రాలేదు. వీలు చూసుకుని రారాదూ!’’‘‘నాట్‌ పాజిబుల్‌ డాడ్‌! మీకు తెలియందేముంది. క్రైసిస్‌ ప్రివైల్స్‌ ఎవ్‌రివేర్‌! జాబ్‌ మార్కెట్‌ ఈజ్‌ గెటింగ్‌ ఎరోడెడ్‌ డే బై డే. ఈ సిచ్యుయేషన్‌లో అన్నాళ్లు సెలవు పెట్టి అక్కడికొస్తే - వుయ్‌ విల్‌ ఫేస్‌ టఫ్‌ డేస్‌! మీరే వీలు చూసుకుని రావచ్చు కదా!’’నిట్టూర్చాను. ఇద్దరూ కలిసి నెలకు ఇరవైవేల డాలర్లు సంపాదిస్తున్నారు. ఇండియాలో అంతంత జీతాలు కళ్ళజూడగలరా! కళ్ళలో ఆనందం తొణుకుతుండగా పక్కనే నుంచున్న లక్ష్మిని మాట్లాడమన్నాను.‘‘దీప్తీ! వాడితో మాట్లాడించు వింటాను’’ కోడల్ని అడిగింది. తల్లి ఒడిలో గారాలు పోతున్న మనవడిని మానిటర్‌ మీద చూస్తూ మురిసిపోతోంది లక్ష్మి. సందీప్‌, దీప్తి మూడేళ్ళ క్రితం పెళ్ళి చేసుకున్న వెంటనే అమెరికా వెళ్ళి పోయారు.

ఇద్దరికీ ఉద్యోగాలే. ఏడాది క్రితం అక్కడే పుట్టాడు సంజయ్‌. వాడుపుట్టగానే అమెరికన్‌ పౌరసత్వం సంపాదించినందుకు ఇక్కడ పెద్ద పార్టీ కూడా ఇచ్చాను. ఇంతవరకు వాడిని ఫొటోల్లోనూ, వెబ్‌కామ్‌లోనూ చూడడమే. అక్కడికి వెళ్ళడానికి మాకూ, ఇక్కడికి రావడానికి వాళ్ళకూ తీరికే చిక్కలేదు.‘‘స్పీకవుట్‌ సంజూ! గ్రాన్‌ మా, గ్రాన్‌ మా! గ్రాన్‌ పా, గ్రాన్‌ పా!’’ కోడలు మనవడితో మాట్లాడించడానికి ప్రయత్నిస్తోంది. మంచు పోగులతో అల్లినట్టున్న తెల్లని స్వెట్టర్‌లో వాడు వెన్నముద్దలా ఉన్నాడు. వాడి బోసినవ్వు నాకున్న బ్లూ ప్‌ షేర్ల కన్న, బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాంటి ప్లాట్ల కన్న అందంగా, అపురూపంగా అనిపించింది.‘‘గామ్మా! గాప్పా!’’ ముద్ద ముద్దగా వాడి నోటినుంచి వస్తున్న పలుకులు వింటుంటే బుగ్గలు పుణకాలనిపించింది. నా చేతులు అప్రయత్నంగా మానిటర్‌ను తాకాయి. గాజుతెర మీద అతికించిన మందమైన పాలిథిన్‌ షీట్‌ గరగర లాడింది. ప్లాస్టిక్‌ పూలను ముక్కు దగ్గర పెట్టుకున్న పసివాడిని చూసినట్టు నా వంక చూస్తోంది లక్ష్మి.‘‘బై డాడ్‌! ఇట్స్‌ టైమ్‌ టు టేక్‌ అవర్‌ డిన్నర్‌!’’‘‘గుడ్‌నైట్‌రా! గుడ్‌నైట్‌ అమ్మా!’’ నెట్‌ డిస్కనెక్ట్‌ చేశాను. తినడం పూర్తికాకుండానే చాక్లెట్‌ చేజారి దుమ్ములో పడ్డప్పుడు పసిపాపలా లక్ష్మి బెంగగా ఖాళీ మానిటర్‌వైపు చూస్తోంది.