‘‘లావణ్యా!’’... అప్పటికి పదోసారి అమ్మ పిలవడం... నాకు లేవాలని అనిపించక పోవటం....‘‘ఏమిటీ? చివరికి ఇంకా... ఇలాగే ఉన్నావా? లే లేచి...తయారవ్‌.... ఆ జీన్స్‌ఫాంట్‌.. టి షర్ట్‌... మార్చి మొన్న పుట్టిన్రోజుకి కొన్న లేతాకుపచ్చ చీర కట్టుకో... చక్కగా తయారై రా! ముత్యాల జూకాలు, సెట్‌ పెట్టుకో...’’‘‘అబ్బ... నేను తయారవనే... నాకు విసుగ్గా వుంది... గంగిరెద్దులా అలంకరించుకుని ఎవరో తెలీని వాళ్లముందు.. కూచోవటం... చిరాకు...’’ అన్నాను...‘‘నా తల్లి కదా! ఆ అబ్బాయి... చాలా బుద్ధిమంతుడు.. ఎల్‌.ఐ.సిలో ఆఫీసర్‌ ఆయన లాయర్‌... పెద్ద కొడుకు కోడలు లాయర్లే మంచి కుటుంబం... వాళ్లంతట వాళ్లొస్తామని కబురుచేస్తే... మీరు రావద్దు అనటం ఏం మర్యాద? నా మాటవిను...’’ అమ్మ బ్రతిమాలుతోంది.

 ఇప్పటికి రెండుగంటలుగా... జరుగుతున్న వ్యవహారం ఇది..‘‘ఏంటమ్మా! ఇది? ఈ యుగంలోనూ ఆడపిల్లల్ని ఇలా పెళ్లి చూపులు పేరు చెప్పి... పరిశీలించటం.. ఎంతవరకు న్యాయం? ఆ చర్య ఆ ఆడ పిల్లలకి ఎంత ఇన్‌సల్టింగ్‌గా ఉంటుందో తెల్సా?‘‘..................................’’ అమ్మ ఏదో అనబోయేంతలో...‘‘మా కాలంలో అంటూ... రింగుల్లోకి వెళ్లి పోయి... ఫ్లాష్‌బ్యాక్‌లు.. చెప్పకు.. ప్లీజ్‌ తయారవుతాలే...’’ ఎంత చదివు చదివినా ఈ ఆచారాలు.. వ్యవహారాలు మారవు... అనుకున్నాను.. షోకేస్‌లో బొమ్మలా ‘నేను బాగున్నాను సుమీ!’ అంటూ కూచోవటానికి...ఛ... ఎప్పటికి మారతారో!‘‘లావణ్యా! అబ్బాయి నీకు నూటికి నూరుశాతం నచ్చితేనే... అతనితో నీ పెళ్లి జరుగుతుంది... గుర్తుంచుకో...’’ అని లోపలికి వెళ్లి పోయింది.

అన్నమాట ప్రకారం.. పరమేశంగారు.. భార్య ఇందిర, ఇద్దరు కొడుకులు శంకర్‌, శ్రవణ్‌ పెద్ద కోడలు శాంతి వచ్చారు...శారద, సత్యనారాయణ వారిని సాదరంగా ఆహ్వానించారు అంతా సోఫాల్లో ఆశీనులయ్యారు..నాన్నగారి కేదో ఆబ్లిగేషన్‌ వచ్చింది. లేకపోతే తనీ పెళ్లి చూపులకి అంగీకరించేదికాదు.. ఇంతకు ముందు మూడు నాలుగు సంబంధాలు... వద్దు అని చెప్పింది ఆఖరికి తమ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ లెక్చరర్‌ గారడిగినా తను ఒప్పుకోలేదు...నేను... ఐ.. లైనర్‌ పెట్టుకుంటున్నాను. అమ్మ చెప్పినట్టు లేత ఆకుపచ్చ జార్జెట్‌ మీద వర్క్‌ ఉన్నది కట్టుకుని మేచింగ్‌ బ్లవుజ్‌, మేచింగ్‌ గాజులు.. ముత్యాల సెట్‌... లతో సింపుల్‌గా తయారైంది.