ఈ కిటికీల గుండా ఆవల ఉన్న ఇంటి జీవితపు దృశ్యాలు చూడవచ్చు.వాటి చిత్రాలు కొన్ని స్పష్టమూ కొన్ని అస్పష్టమైన రేఖల్లో చిత్రించటం జరిగింది.ఒకరోజు చదువుతూ కూర్చున్నప్పుడు వనమాలి దృష్టి ఆ వైపు పోయింది.అప్పుడు ఆ ఇంటి కాన్వాస్‌ మీద ఇద్దరు అపరిచితులు కనిపించారు.ఒకరు కొంచెం వయస్సు దాటిన వితంతువు. మరొకరు పదహారో పదిహేడేళ్లో వయస్సున్నఅమ్మాయి.

ఆ వృద్ధురాలు కిటికీ దగ్గర కూర్చుని ఆ అమ్మాయి తల దువ్వి జడ వేస్తోంది.అమ్మాయి కళ్ళ వెంబడి నీళ్ళు ప్రవహిస్తున్నాయి.మరొకరోజు ఆ అమ్మాయికి జడవేసిన ఆ స్త్రీ అక్కడ లేదు.సూర్యాస్తమయ సమయంలో ఆ అమ్మాయి ఫ్రేము వేసిన ఒక పాత ఫొటో చూస్తూ కూర్చుంది.సూర్యుడి చివరి వెలుతురులో ఆ ఫ్రేమును తన చీర అంచుతో తుడుస్తోంది.అప్పుడు కిటికీల సందుల ద్వారా ఆమె దైనందిన కార్యకలాపాలను చూడవచ్చు. తన తొడ మీదున్న బుట్టలో ఆమె చిక్కుడు గింజల్ని వేరుచేయటం, వక్కలు ఒలవటం, స్నానం చేసిన తరువాత జుట్టును ఎడమ చేత్తో పట్టుకుని తడి ఆర్పుతుండటం, వరండా తీగల మీద తడి బట్టలు ఎండలో ఆరవేయటం మొదలైనవి గమనించవచ్చు.మధ్యాహ్నం పూట మగవాళ్ళు ఆఫీసులో ఉండేవారు. కొందరు స్ర్తీలు మధ్యాహ్నపు చిన్నకునుకులో ఉండే వారు. మరికొందరు పేకాట ఆడేవారు. మేడ మీద పావురాళ్ళ గూళ్ళలో గుటుర్‌ గుటుర్‌ అనే ధ్వనులు వినిపిస్తుండేవి.ఆ సమయంలో ఆ అమ్మాయి కాలు చాపుకుని మేడ మీది గదిలో చదువుతూ కూర్చునేది. కొన్నిసార్లు పుస్తకాన్ని ఒత్తుగా పెట్టుకుని ఉత్తరాలు రాస్తూ ఉండేది. చెదిరిన ఆమె వెంట్రుకలు నుదుటి మీదికి వచ్చి వాలేవి. ఇక రాసేటప్పుడు ఆమె వేళ్ళు ఉత్తరాలతో గుసగుసలాడేవి.ఒకరోజు ఏదో పొరబాటు జరిగింది.ఆ రోజు ఉత్తరాన్ని సగం సగానికే రాసి మౌనంగా కూర్చుంది. అప్పుడు గోడ మీద ఒక కాకి సగం తిని వదిలేసిన మామిడి పండు టెంకను పొడుస్తూ కూర్చుని ఉంది.అప్పుడే మెల్లగా మబ్బులు దట్టంగా కమ్ముకుని అన్యమనస్కుడైన అమావాస్య చంద్రుడి వెనుక నుంచున్నట్టుగా ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన స్ర్తీ ఒక మధ్య వయస్కురాలు. ఆమె లావాటి మణికట్టు మీద ఒక లావాటి కంకణం ఉంది. ఆమె పాపిట పెద్ద కుంకుమ బొట్టుంది.ఆమె ఆ అమ్మాయి తొడ మీదున్న పూర్తి కాని ఉత్తరాన్ని లాక్కుంది. సరిగ్గా అదే సమయానికి ఒక డేగ ఉన్నట్టుండి వచ్చి ఒక పావురం మీద దాడి చేసింది.మేడ మీద ఆ అమ్మాయి మళ్ళీ కని పించలేదు.కొన్ని రాత్రిళ్ళు, కొన్ని ఉదయాలు లేదా సాయం సమయాల్లో ఆ ఇంటి పునాదులు భూకంపం వల్ల వణుకుతున్నట్టు కనిపించేవి.