‘‘మనిషికి కడుపు నిండితే కదలబుద్ధి కాదు. కడుపు కరకరలాడుతుంటే ఆకలి తీర్చుకునేందుకు కష్టపడతాడు. పరిశ్రమలో వారైనా, ఆశ్రమంలో వారికైనా ఇదే మూల సిద్ధాంతం’’ అన్నపూర్ణా ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ ప్రొప్రైటర్‌ హరిశ్చంద్రప్రసాద్‌గారికి ఈ లౌకిక విషయాలను ఫోన్‌లో అలవోకగా వివరించాడు పరబ్రహ్మానందస్వామి.‘‘మేనేజ్‌మెంటు కార్మికులకు ఎన్ని సదుపాయాలు ఇచ్చినా తృప్తిలేదు. యూనియన్‌ లీడర్ల అండ చూసుకొని ఒక వర్గంవారు అస్సలు పని చేయటం లేదు. వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేశా. అంతకుముందే క్యాంటీన్‌ మూసేశా. ఆ తర్వాత నిత్యావసరాల స్టోర్స్‌కి తాళం వేసేశాం. విసుగొచ్చి ఫ్యాక్టరీ లాకౌట్‌ ప్రకటిద్దామనుకుంటున్నాను స్వామి’’‘‘కార్మికులకు కడుపు కాలితే కదం తొక్కుతారు. కొంత కడుపు నిండితే కొన్నాళ్ళు నిలదొక్కు కుని మళ్ళీ ఉద్యమిస్తారు. అందుకే కొన్ని కోరికలే తీరుస్తామనాలి. మిగతావి కష్టపడితే తీరుతాయన్న నమ్మకం కలిగించాలి. ఆశ చూపించాలి. హామీ ఇవ్వాలి...అంతే’’ అన్నారు స్వామీజీ.

‘‘మరి ఈ పరిస్థితుల్లో నన్నేం చెయ్యమంటారు స్వామీ?’’‘‘ప్రసాదం పెడతాననండి. మృష్టాన్న భోజనం మాత్రం పెట్టకండి. తృప్తి పడకపోతే మీ యూనియన్‌ లీడర్లని నా దగ్గరికి పంపండి. వాళ్ళకి ఎలా నచ్చజెప్పాలో నాకు తెల్సు’’‘‘వాళ్ళు మన మాటలు వినేస్థితిలో లేరు స్వామి. రోజూ పెన్‌డౌన్‌ స్ర్టైకులూ, నిరాహార దీక్షలూ. తెల్లారితే ఉద్యమం ఎటు దారితీస్తుందో తెలియని వాతావరణం ఇక్కడ’’‘‘పోనీ నేనే అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడనా?’’‘‘వద్దు స్వామీ, మీరు రావడం చాలా ప్రమాదం. మీరు చెప్పిన ఆ సామ,దాన, భేద, దండోపాయాలనే ఉపయోగిస్తా’’

‘‘సరే ఐతే. ఆ! అన్నట్టు చెప్పడం మరిచా. మన ఆశ్రమానికి ఆనుకునివున్న ఎకరం భూమి అమ్మకానికి వచ్చింది. వీలు చూసుకుని ఆ విషయం చూడండి ప్రసాదుగారూ’’‘‘అలాగే స్వామి. ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఒక లారీ లోడ్‌ పంపుతున్నా. సదా మీ ఆశీర్వాదం కావాలి స్వామీ’’‘‘శుభం’’ఫఫఫఅన్నపూర్ణా ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ యూనియన్‌ లీడర్ల రహస్య సమావేశం, చీకటిలో నల్లపిల్లిలా అప్పటికే నాలుగు చోట్లకు మారినట్టు కార్మికులకు ఎవరికీ తెలియదు. ప్రభుత్వ నిర్ణయంలానే ఆ సమావేశాల్లో ఏమీ తేలటం లేదు. దాంతో విసుగు చెందిన ఓ వర్గం, ఫ్యాక్టరీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కొండ దిగువన అడవికి దగ్గరగా ఉన్న బోసు పూరింట్లో పరమ రహస్యంగా కలి సింది.