‘ఊర్మిళా దేవి నిద్ర’ పాటని మా అమ్మమ్మ చాలా చక్కగా శ్రావ్యంగా పాడేది. పేరంటాని కెళ్ళినప్పుడు అమ్మలక్కలు అడగటం ఆలస్యం వెంటనే పాడేసేది. మా అమ్మ కూడా పాడేది గాని తనకాపాట పూర్తిగా రాదు. నాలుగైదు చరణాలు పాడేదంతే. నాకసలు పాడటమే రాదు. కానాపాటని చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా శ్రద్ధగా వినేదాన్ని. శార్వరితో నా పెళ్లి చాలా చిత్రంగా జరిగింది.మాది పల్లెటూరు అయినా సమీప పట్నంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూండే దాన్ని.ఒక పెళ్ళిలో శార్వరి నన్ను చూశారట. పట్టులంగా కట్టుకుని ఓణీ ధరించి కాళ్ళకు వెండి మువ్వల పట్టాలతో చెవులకి జూకాలతో ఎంతో చలాకీగా తిరుగుతూ కన్పించానుట.మా గురించి వాకబు చేయగా బీరకాయ పీచు బంధుత్వం ఉందని తెలిసిందట. వెంటనే ఒక బంధువు ద్వారా కబురంపారు.‘‘యుక్తా! నువ్వెంతో అదృష్టవంతురాలివే. నిన్ను వెదుక్కొంటూ గొప్ప సంబంధం వచ్చిందే’’ సంబరంగా చెప్పేవారు నాన్న. పెళ్ళైతే చదువుకి మంగళం పాడించేస్తారన్పించి ఏడ్చేశాను. ‘‘డిగ్రీ చెతికొచ్చేదాకా పెళ్ళి చేసుకోను’’ అంటూ గునిశాను.‘‘అల్లుడొచ్చే దాకా అమావాస్య ఆగుతుందా చెప్పు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్నారు పెద్దలు. పైగా కోరి వచ్చిన సంబంధం...’’‘‘అబ్బాయి ఏం చేస్తాడేవిటీ’’ ఆరా తీసింది అమ్మ.‘‘ఇంజినీరే. నెల తిరిగే సరికి పదివేలొచ్చి చేతిలో పడతాయి. కట్నపాశ మరీ ఎక్కువగా లేదు..’’‘‘నా కోసం మీరేమీ అప్పుల పాలవ్వొద్దు..?’’‘‘ఇవతల మాట్లాడుకొంటోంటే మధ్యన నీ సన్నాయి నొక్కుళ్ళేవిటే, దాని గోలకేం గాని మీరు చెప్పండి.

 మీకీ సంబంధం నచ్చిందా?’’‘‘అన్ని విధాలా బావుంది. ఒక్కడే కొడుకు. అమ్మాయి సుఖపడుతుంది.’’‘‘మరింక చూడటం ఎందుకూ. పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి కట్న కానుకలు మాట్లాడి ముహూర్తం పెట్టుకురండి. అబ్బాయి అమ్మాయిని చూసేశాడు గనుక ఇహ పెళ్ళి చూపులు అవసరమే లేదు...’’‘నేను చూళ్ళేదుగా’ అనాలనుకున్నాను. నోరు పెగలే ్లదు.‘‘చదువయ్యే దాకా పెళ్లివూసెత్తొద్దు నాన్నా’’ అర్థించాను.నాన్న నవ్వేరు. ‘‘నువ్వు బాగుండాలి. నీ కాపురం బాగుండాలి’’ నా తల నిమురుతూ అన్నారు.మరి వారం తిరక్కుండానే పెళ్ళి పనులు మొదలయ్యాయి.‘‘కాబోయే మీ ఆయనెలా ఉంటాడే? నీకు నచ్చాడా?’’ అని స్నేహితులు గుచ్చి గుచ్చి అడిగారు. అతగి ఫోటో కూడా చూడలేదని చెప్పలేక పొడిగా నవ్వి ఊరుకున్నాను.పెళ్ళిలో కూడా శార్వరిని సరిగ్గా చూడలేకపోయాను. ఎప్పుడైనా కాస్తంత తల పైకెత్తితే చాలు తోడి పెళ్ళి కూతురైనా మా పిన్ని నా తలని వంచేసేది.అక్కడికీ మెడలు నొప్పెడుతున్నాయని గొణిగాను. ‘‘ఆడపిల్ల అన్నాక అన్నీ ఓర్చుకోవడం నేర్చుకోవాలి’’ అంది.గదిలో పాలగ్లాసుతో అడుగుపెట్టిన అయిదు నిమిషాలకి సిగ్గు తెరల్ని తొలగించుకుని ఆయన్ని చూశాను. ఎంతో బాగా అన్పించారు. నాకు తెలీకుండానే నిట్టూర్చాను.