అతను కిటికీ తలుపులు తెరచి బయటకు చూశాడు. వర్షం జోరుగా కురుస్తూంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. వాటితో పాటు ఉరుములు... వీధి దీపాలు లేనందువల్ల చుట్టూ చీకటిగా ఉంది,అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల వెలుగులు తప్ప.అతను కిటికీ తలుపు మూసి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. టీపాయ్‌ మీదున్న రిమోట్‌ అందుకుని టీవీ ఆన్‌ చేశాడు. ఏదో సినిమా వస్తూంది. అతను ఛానల్‌ మారుస్తూ పోయాడు. ఓ న్యూస్‌ ఛానల్‌తగిలింది. వాల్యూమ్‌ కాస్త పెంచి, రిమోట్‌ టీపాయ్‌ మీద పెట్టి టీవీ చూడసాగాడు. ఇంతలో ఆ ఛానల్‌లో ప్రసారమవుతున్న ఓ వార్తఅతన్ని ఆసక్తి పరచింది.‘‘రాయలసీమలో గత ఆరునెలలుగా హత్యలు చేస్తూ ప్రజల్లో భయందోళనలు రేపుతున్న సైకోకిల్లర్‌ ప్రస్తుతం తిరుపతి పట్టణానికి దగ్గరలోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న రాత్రి రేణిగుంట సమీపంలో ఓ పాడుబడిన ఇంటివద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సైకోకిల్లర్‌ చేసిన హత్యల ఫక్కీలోనే ఈ హత్య కూడా జరిగిందని, అందువల్ల యీ హత్య కూడా సైకోకిల్లర్‌ చేసిన హత్యగానే తాము అనుమానిస్తున్నామని వారు చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పట్టణ శివార్లలో నివసించేవారు, ఒంటరిగా నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంతవరకూ అపరిచితులను ఇంట్లోకి రానివ్వరాదని, రాత్రుల్లో ఒంటరిగా బయట తిరగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ఇంతకూ ఆ సైకోకిల్లర్‌ పురుషుడా లేక స్త్రీయా అన్న ప్రశ్నకు మాత్రం వాళ్ళు జ బాబు చెప్పలేకపోయారు’’అతను టీవీ ఆఫ్‌ చేసి, లేచి మెయిన్‌ డోర్‌ దగ్గరకు వెళ్ళి తలుపు గొళ్ళెం ఓసారి పరిశీలించి, తర్వాత లోపలికి నడవబోయాడు.అప్పుడు వినిపించింది... శబ్దం.ఎవరో త లుపు తడుతున్న శబ్దం...అతను ఉలిక్కిపడి తలుపువైపు చూశాడు. పది క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. అతను తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు.ఈసారి మరింత గట్టిగా, విరామం లేకుండా వినిపించసాగింది శబ్దం. అతను అక్కడ్నుంచి కదల్లేదు.‘‘హలో. ఎవరిండీ లోపల? వర్షానికి తడిసిపోతున్నాను. కాస్త తలుపు తెరవరూ?’’ ఓ స్త్రీ కంఠం వినిపించిందీసారి.అతను కిటికీ తలుపు తెరచి చూశాడు. మెరుపు వెలుగులో భుజాన ఎయిర్‌బ్యాగ్‌తో కనిపించింది ఆమె.‘‘ఎవరండీ మీరు?’’ కిటికీలోంచే అడిగాడతను.మాది కాళహస్తండీ. బస్సు బ్రేక్‌డౌన్‌ అయితే దిగేశాను. ఇక్కడే ఎక్కడో మా స్నేహితురాలి ఇల్లుంది. ఇల్లు కనుక్కోగలననే ధైర్యంతో వచ్చాను. కాని వర్షం వల్ల, చీకటి వల్ల కనుక్కోలేకపోయాను. ప్లీజ్‌...నన్ను లోపలికి రానివ్వండి’’అతను కొంతసేపు ఆలోచించి తర్వాత తలుపు తెరిచాడు. ఆమె లోపలికి రాగానే తలుపు గడియపెట్టి ఆమెను పరిశీలనగా చూశాడు.