అతడు ఆమె ఒక స్వప్న లోకంమీరనుకున్నట్టు ఇది ప్రేమకథే! చాలా రోజుల్నుంచి ఆ మార్గాన అతడు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడే విప్పారిన పొద్దు తిరుగుడు పూల యవ్వన ఛాయతో మిలమిల మెరిసే వాడు. యంత్ర శక్తికి ధీటు దారుఢ్యాన్ని బాహుబలాల్లో పొదువు కుని నడిచేవాడు. వేళకాని వేళల్లో హడావుడిగా నడుచుకుంటూ శ్రమే సర్వస్వమని సాగిపోయే వాడు. ఒక శ్రమ జీవన పరిమళాన్నిదిక్కులన్నిటికీ పంచుతూ ఒక యోధుడిలా కదిలేవాడు.అతడు అటుగా వెడుతుంటే ఆమె ఆదే మార్గాన ఇటువైపుగా-వాన కురిసి వెలిశాక కర్రుతో కదిల్చిన నల్లరేగడి మన్నులా ఎంతో మృదువుగా, గొప్ప సారవంతంగా - తల నిండా తేనెటీగల గుంపును వలయాలు వలయాలుగా చుట్టుకొని నడుముదాకా తేనె ప్రవాహాన్ని హారంలా వేలాడేసుకుని కానరాని లోకాల చుట్టూ విహరించే కళ్ళతో గొప్ప అడవి పూల గుభాళింపును నడిచినంత మేరా వెదజల్లుతూ ఆమె-చాలా రోజులు అతడటూ, ఆమె ఇటూ నడవటం అయ్యాక - వాళ్ళిద్దరూ బహువచనం నుంచి ఏక వచనానికి మారటానికి ముందు - ఒకానొక పొద్దుటిపూట, మంచు కురవటం వెలిశాక ఒకే వైపు వాళ్ళిద్దరూ -పక్క పక్కనే గాని, దూరదూరంగా నడుస్తూ -గుంపుగా ఎగుర్తున్న సీతాకోక చిలుకలు రెక్కల సౌందర్యాన్ని లోకం ముందు వెదజల్లారు.సన్నటి చినుకులకు ముందు సాయం సమయాన నడుస్తూ తూనీగల సమూహాన్ని అట్లా ఆకాశంలోకి వాళ్ళిద్దరూ ఎగరేశారు. 

వాళ్ళిద్దరు నడిచినంతమేరా ఒక విరగబూచిన మోదుగుల వనాన్ని స్వప్నించుకుంటూ వెళ్ళారు. చివరకు వర్షంలో తడుచుకుంటూ ఒకరికొకరు సన్నిహితమై చేతులు చేతులు పట్టుకొని ఒక మహోజ్వల కాంతి తరంగ జలపాత హోరును వినిపిస్తూ వెళ్ళారు.అతడామెకు శ్రమను వాగ్దానం చేసేడు. ఒక భద్రతను, ఒక విశ్వాసాన్ని తన నుంచి ఆమెకు ప్రసారం చేసేడు. ఆమె అతడికి తన స్వప్నాల్ని పరిచయం చేసింది. ఒక ఉజ్వల సౌందర్య భరిత భవిష్యత్తుని అతడి దోసిలి నిండా నింపింది. ఆమె అతడికి ఒక సప్త వర్ణ ఇంద్ర ధనుస్సును కానుకగా ఇస్తానంది.ఒక సౌందర్యాన్ని, ఒక సంతోషాన్ని, ఒక ప్రవాహాన్ని, ఒక అనాది సంగీతాన్ని వాళ్ళిద్దరూ నడిచినంత మేరా లోకానికి పరిచయం చెయ్యాలను కున్నారు. మీరనుకున్నట్లు ఇది ప్రేమ కథే కదా! కొన్ని వేకువ సౌందర్య వసంతాల తర్వాత, మరికొన్ని నడిజాము ఉగ్ర గ్రీష్మాల తర్వాత, మరిన్ని అపరాహ్నపు వర్షగీతాలనంతరం, కొన్ని శీతల పవనాల నడిరేయిల తర్వాత,కొన్ని ఆశల తర్వాత, కొన్ని నిరాశల తర్వాత, కొన్ని నిరీక్షణల అనంతరం -అతడు ఆమెను మెల్లిగా నడిపిస్తుంటే, ఒక నిండు నదిలా, ఒక విరగబండిన వరిచేనులా ఆమె, అతడితో కల్సి నడుస్తూ ఒక సంతోషం - ఒక సాఫల్యం -