ఆ రోజు ఆదివారం కావటం వల్ల ‘ఓషన్‌పార్కు’చాలా సందడిగా వుంది...రంగురంగుల దుస్తుల్లో, రకరకాల ఆటలాడుతూ- తుళ్లింతలూ కేరింతలతో ఎటుచూసినా పిల్లలే!... వాళ్లలా నానా అల్లరీ చేస్తూంటే- వాళ్లను మందలిస్తూ, బుజ్జగిస్తూ,హెచ్చరిస్తూ- తెగ హైరానా పడిపోతున్నారుపెద్దవాళ్లు!-‘వేసవి శలవల్లో అక్కడికెడదాం, ఇక్కడికెడదాం అంటూ తులసికి ఆశపెట్టారు... ఇక వారంరోజుల్లో శలవలు అయిపోతున్నాయి... కనీసం ఇవాళైనా అలా ఓషన్‌పార్కుకో, మౌంట్‌ఓపెరాకో దాన్ని తీసుకెడదాం’- అంటూ పొద్దున్న బెడ్‌కాఫీ చే తికందించిన శారద సూచన లాంటి హెచ్చరిక చేయటంతో- మా తులసిని తీసుకుని పార్కుకొచ్చాం!ఓ గంటసేపు ఆటలాడింతర్వాత- ‘వాటర్‌గేమ్స్‌’ పుణ్యమా అని అది బట్టలు తడిపేసుకుని వచ్చింది... అలా జరుగుతుందని ముందే ఊహించింది కాబోలు- దాని కోసం శారద ఇంకో డ్రస్సు తెచ్చింది...అది వేసుకున్నాక పాప్‌కర్నూ, ఐస్‌క్రీమూ వగైరా చిరుతిళ్లులాగించి- అక్కడున్న ఓ ఉయ్యాల బల్ల ఎక్కింది తులసి...దానికాళ్లు నేలకు అందకపోవటంతో ఆ ఉయ్యాల ఊపే డ్యూటీ శారద తీసుకుంది...ఆ పరిసరాల్లోనే- నేను అటూ ఇటూ పచార్లు చేస్తూంటే- ‘హలో భాస్కరం’ అంటూ ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించి, వెనక్కి తిరిగి చూశాను... పరుగులాంటి నడకతో నావైపే వస్తున్న అతన్ని చూసి, వెంటనే పోల్చుకోలేకపోయాను...‘‘ఏమిట్రో అలా చూస్తున్నావ్‌?- గుర్తుపట్టలేదా?’’- నా దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని- చిరునవ్వుతో చూస్తూ అడిగాడు...

ఆమాత్రం ఓరనవ్వుకే దోరగా సొట్టలు పడిన అతని బుగ్గల్ని చూసి- వెంటనే గుర్తు పట్టేశాను!అతను...కాదు, వాడు రమణ!- ఒకప్పటి నా ప్రాణమిత్రుడు!... వాడన్నా, వాడి నవ్వన్నా, నవ్వినప్పుడు సొట్టలు పడేవాడి బుగ్గలన్నా, అప్పుడు వాడి క ళ్లల్లో కనిపించే మెరుపన్నా నాకు చాలా ఇష్టం...రమణా, నేనూ తణుకులో- ఆరో క్లాసునించీ ఇంటర్‌ వరకూ కలిసే చదువుకున్నాం... అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగాం... వాళ్లు మా ఇంట్లోని పెరటివాటాలో అద్దెకుండేవారు... రమణ వాళ్ల నాన్నగారు షుగర్‌ ఫ్యాకర్టీలో ఉద్యోగం చేసేవారు... అందుకని వాళ్లకి పంచదార ‘ఫ్రీ’గా వచ్చేది కాబోలు- తరచుగా వాళ్లింటో స్వీట్లు తయారవుతూండేవి... అస్తమానూ ఆ స్వీట్లు తినటం వల్ల కావచ్చు- వాళ్లింట్లో అందరూ తియ్యగా మాట్లాడేవారు!ఇంటర్‌ ప్యాసయ్యాక, నేను భీమవరం కాలేజీలో డిగ్రీ చదివాను. రమణ రాజమండ్రీ వెళ్ళి పాలిటెక్నిక్‌లో చేరాడు. అప్పట్నించీ వేసవి శలవల్లో మాత్రమే కలుసుకుంటూండేవాళ్లం... డిగ్రీ అయ్యాక, నేను సర్వీసు కమీషన్‌ పరీక్ష రాసి హైదరాబాద్‌లో ఉద్యోగానికి వచ్చేశాను...తర్వాత రెండేళ్లకి- రమణ వాళ్ల నాన్నగారికి వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ కావటంతో- వాళ్లంతా అక్కడకు ‘షిప్ట్‌’ అయిపోయారు...అంతే...! అప్పట్నించీ రమణకీ నాకూ మధ్య దూరం క్రమేపీ పెరిగిపోయింది...మాస్నేహం కేవలం జ్ఞాపకాలకే మిగిలిపోయింది...!