గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ బయలు దేరాడు అప్పారావు. అతనిప్పుడు వెళ్ళేది పెళ్లి చూపులకు. అతని స్కోరు బోర్డులో యిది పదహారోది. ‘‘ఇకపైన ఎవరినీ చూడకూడదు. స్కోరు పెంచదలచుకో లేదు. ఈ అమ్మాయిని ఓ.కే. చేసేస్తాను’’ అని ఎనిమిదో చూపుల నాడు నిర్ణయించుకున్నాడు అప్పారావు.బోగీలో సీట్లు నిండుతున్నాయి క్రమంగా. తను చూడబోయే అమ్మాయి ఫొటో ఒకసారి పర్సులో నుంచి తీసి గర్వంగా ఫీలయ్యేడు. ‘‘ఇంకెవరినీ చూడను’’ అనుకున్నాడు మనసులోనే. చటుక్కున అతని ఆలోచనలు ఆగిపోయాయి. కారణం - ఎదురుసీట్లోకి ఓ అందమైన అమ్మాయి ఎయిర్‌ బ్యాగుతో వచ్చి కూర్చుంది. ఆమె రాక తనకు తెలియలేదు. ఆమెనే చూస్తుండిపోయాడు అప్పారావు. ఆమెలో పూర్తి విదేశీ నాగరికత టాప్‌ టు బాటమ్‌లో కనిపించలేదు. సంసార పక్షానికి కొంచెం అటుయిటుగా వుండి చూపు మరల్చని వాతావరణం కలిగిస్తోంది. అంతలో ఓ యువకుడు ఆమె పక్కగా వచ్చి కూర్చున్నాడు. అప్పారావు ఖంగుతిన్నాడు. మధ్యలో వీడెవడు అనుకున్నాడు కసిగా. వాళ్ళిద్దరి దగ్గర సెల్‌ఫోన్లున్నాయి.

 ఎవరికి వారు ఫోనులో మాట్లాడుకుంటున్నారు. పావు గంట గడిచింది.అప్పారావు అతన్ని గమనిస్తున్నాడు. మంచి పర్సనాలిటీ... రంగు... చక్కని పలు వరుస... ఇంచక్కని మీసం... అందంగా మోడ్రన్‌ డ్రెస్సింగు... ముఖంపైన చెరగని నవ్వు.ఇక ఆమె! అందంతో పోటీపడుతున్న సొగసులు, కొలతలు... పూతరేకులో... పాల కోవాలో... పెరుగు తోటకూరలా ఏపుగా, నాజూగ్గా... గుండెలను లయబద్దంగా కదిలించే తీరు కళ్ళను కట్టి పడేస్తున్నాయి. అప్పారావు కూర్చోలేక అవస్థ పడుతున్నాడు.అప్పారావు ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాడు. పక్కనున్నది ఎవరో! మొగుడా! ఏమో! ఆమె మెడలో సింపుల్‌గా చైనుమాత్రమే ఉంది. రైళ్ళలో దొంగతనాలు జరుగుతున్నాయనే భయంతో మంగళసూత్రాలు బ్యాగులో పెట్టుకుందేమో! లేక ప్రేమికులా! ఏదైతేనేం!అప్పారావు ఆమె ‘‘పక్కనున్న వానిని’’ లేనట్టుగానే వూహించ సాగాడు. తనకు మతి గతి తప్పుతుందేమోననిపిస్తోంది.

నిలువెత్తు సౌందర్యం ఆమె ధరించిన చుడీదారుతో పోటీ పడుతోంది. కొంత అలజడిని, మరికొంత హాయిని కూడా కలిగిస్తోంది.వారిద్దరూ సెల్‌ఫోనులు ఆఫ్‌ చేసేసారు. అంతలో కాఫీ వచ్చింది. ఒక టి తీసుకున్నారు. ఇద్దరూ ఎంగిలిపడుతూ తాగసాగారు. ఇద్దరూ మరికొంచెం వేగాన్ని ఆహ్వానించారు. ఆమె చున్నీని సరిగా సవరించాడు. అలాగే ఆమె కూడా ‘‘గెడ్డాన్ని’’ చిటికేసినట్లుగా చేసింది. ‘‘ఒకే ఒక’’ చిప్స్‌ ప్యాకెట్టు కొన్నాడతను. కట్‌ చేయమని ఆమెకిస్తే - ముని పంటితో ప్రయత్నించి అతనికిచ్చేసేంది ‘‘నువ్వే ఓపెన్‌ చేయ్‌’’ అన్నట్టుగా.చిప్సుపీసులు తీసి ఆమె నోటి కందించసాగాడు. అలాగే ఆమె కూడా ...‘‘గొలుసు మార్చేవా’’ అడిగాడు అతను. ‘‘లేదు అదే’’ అందామె.