‘‘సార్‌...టీ’’ అన్న పిలుపుతో ఫైల్‌ మూసి, టీ అందుకుని సిప్‌ చేసి ప్రక్కకు తిరిగి విశ్వనాధం సీటువైపు చూసాను. ఇంకా ఆ వృద్ధుడు విశ్వనాధాన్ని బ్రతిమాలుతూనే ఉన్నాడు. నెల రోజులుగా తనపెన్షన్‌ ఫైల్‌ విషయంలో పరిష్కారం కోసం పట్టువదలని విక్కమార్కుడిలా చుట్టూ తిరుగుతూనేఉన్నా విశ్వనాధం మాత్రం కరగడం లేదు. నాకు తెలుసు! కాసులు పడేవరకు... కరగడని.ఆ వృద్ధుడ్ని చూస్తుంటే జాలి కలిగింది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇటువంటివిషయాల్లో విశ్వనాధం ఎవరిమాటా వినడని నాకు అనుభవపూర్వకంగా తెలుసు. టీ త్రాగడంపూర్తి కావడంతో గ్లాసు పక్కన బెట్టి, సిగరెట్‌ కోసం బయటకు నడిచాను.క్యాంటీన్‌ దగ్గరకు వెళ్ళి సిగరెట్‌ కాలుస్తూ నిల్చున్నాను. ఆ వృద్ధుడే గుర్తొచ్చాడు. డెబ్భై ఏళ్ళుంటాయేమో అతనికి.. సన్నగా, పొట్టిగా, లోపలకు పోయిన కళ్ళతో... కష్టం అనే మాటకు పర్యాయపదంలా ఉన్న అతన్ని చూస్తే ఎవరి కైనా జాలి కలుగుతుంది. విశ్వనాధంకు మాత్రం ఇవేమీ పట్టవు., ఎలాంటి వాళ్ళయినా పనుందంటూ తన దగ్గరకు వస్తే వాళ్ళను జలగలా పీల్చేంతవరకు వదలడు. అతని సంగతి ఆఫీస్‌లో అందరకీ తెలిసినా పై స్థాయిలో అతనికున్న పలుకుబడిని చూసి భయంతో కొందరు, మనకెందుకులే అనే నిర్లిప్తతతో మరికొందరు అతని గురించి పట్టించుకోరు... 

నాలాగే!కాల్చిన సిగరెట్‌ క్రిందపడేసి, ఆఫీస్‌ లోపలకు కదులుతుండగా.. టీ త్రాగ డానికి వచ్చాడేమో.! ఆ ముసలాయన. ఇంకో కుర్రవాడితో కలసి నా ముందు నుండే లోనికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి నా సీటులో కూర్చున్నాను. విచిత్రం.. విశ్వనాధం ఆ కుర్రవాడితో ‘‘పది నిమిషాలలో చే సేస్తాను... మీరేం వర్రీ కాకుండా కూర్చోండి’’ అంటూ అతన్ని తన ప్రక్కనే ఉన్న స్టూల్‌పై కూర్చోబెట్టాడు. ఆముసలాయన మాత్రం యధా విధిగా ‘‘బాబూ... నీకు పుణ్యముంటుంది’’ అంటూ బ్రతిమా లుతున్నాడు. ఇదేమీ పట్టనట్టుగా తన ముందరున్న ఫైల్స్‌లో దేని కోసమో తెగవెతుకుతున్నాడు విశ్వనాధం. నాకతన్ని చూస్తుంటే అసహ్యం కలిగింది. నెలరోజులుగా తన చుట్టూ తిరుగుతున్న ఆ వృద్ధుడి గురించి కనీసం పట్టించుకోకుండా, ఇపుడే వచ్చిన ఆ కుర్రవాడిచ్చే డబ్బులు కోసం కక్కుర్తి పడుతున్న అతన్ని చూసి. ఇంతలో ఆ ముసలాయన ఒక నిశ్చయానికొచ్చినట్టుగా ‘‘బాబూ... ఆఖరుమాట. మూడొం దలు ఇస్తాను.. నాపనిచేసెయ్‌’’ ఆశగా అన్నాడు. ఆమాట విని తలెత్తి ‘‘ఇదేం కూరగాయల బేరమా? వెయ్యికి ఒక్కపైసా తగ్గినా, నీ పని పూర్తికాదు. ఇవ్వాళ తప్పితే.. మళ్ళీ పదిరోజుల వరకు నేనుండను.., చూసుకో!’’ అన్నాడు విశ్వనాధం. ‘‘వెయ్యి రూపాయిలిస్తేగాని.. నా పని చేయనంటావు. అంతేనా?’’ కోపంగా అడిగాడా ముసలాయన. ‘‘ఏంటి అరుస్తున్నావు. ఒక్కసారి కాదు.. వందసార్లు చెబుతా, వెయ్యి రూపాయలు ఇస్తేనే చేస్తాను. లేకపోతే చేయను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో..’’ అంటూ కసిరిన విశ్వనాధాన్ని చూస్తూ ‘‘ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెబుతా, నీపై ఆఫీసర్‌కు నీమీద ఫిర్యాదు చేస్తా. ఎలా నా పని కాదో నేనూ చూస్తా’’ అంటున్నాడా ముసలాయన.