‘శతమానం భవతి శతాయుః పురుషః’

శతేంద్రియే ఆయుక్షేమేంద్రియే ప్రతి తిష్ఠతి!

అందరం శతవత్సరాలు జీవించాలి! శత వసంతాలను తిలకించాలి! పరిపూర్ణ ఆయుష్షుతో, ఆరోగ్యంతో శతవత్సరాలు వర్థిల్లాలి. అందరం ఇంద్రియ క్షేమ సౌభాగ్యాలతో చిరస్థాయిగా జీవించాలి! భారతీయ సినీ పరిశ్రమ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో... ఈ శుభాకాంక్షలతో... శుభాశీస్సులతో..... శుభకామనలతో... ఈ మహోత్సవానికి విచ్చేసిన

కళాభిమానులకు...కళాకారులకూ... కళాపోషకులకు స్వాగతం! సుస్వాగతం!!’’కార్యక్రమ సమన్వయ కర్తలైన మాటకారులైన, పాటకారులైన ఓ యువతి, ఓ యువకుడు స్టేజీ పైకి వచ్చేశారు.‘‘సరిగ్గా సమయానికి వచ్చేశామండి! మన సీట్లు ఎక్కడ ఉన్నాయో... ఎక్కడ కేటాయించబడ్డాయో...’’ఆడిటోరియంలోకి వచ్చిన తరువాత సందేహంగా నీరజ అనే లోపే...టార్చిలైట్‌ వెలుగులో ఓ యువకుడు మా సీట్ల వైపు మమ్మల్ని నడిపించాడు.‘‘శతవత్సరాల సమయంలో ప్రదర్శించబడిన భారతీయ సినిమాలన్నింటిలో అగ్రగామిగా నిలబడ్డది... ఒకే ఒక తెలుగుసినిమా! అదే.. మన మహత్తర పౌరాణిక చిత్రరాజం మాయాబజార్‌, మనం గర్వించదగ్గ తెలుగుసినిమా పుట్టి ఎనభై సంవత్సరాలైన శుభ సందర్భంలో... ఇది అష్టపదుల పండుగ! అన్నీ ఎనిమిది సంఖ్యలున్న ఎనిమిది అంశాల ఆనందాల హరివిల్లులు విరియించే పండుగ!’’భావస్ఫోరకంగా... చక్కగా.... హాయిగా... సందర్భోచితంగా యాంకరింగ్‌ చేసే ఆ ఇద్దరు సీనియర్‌ యాంకర్లు... అందంగా... ఆనందం కలిగిస్తున్నారు.చప్పుడు చేయని ఆ ఎ.సి. ఆడిటోరియంలో... డిజిటల్‌ సౌండ్‌ సిస్టమ్‌తో విశాలమైన స్టేజీని, జరుగుతున్న తెలుగు సినిమా పండుగను స్పష్టంగా, సుస్పష్టంగా కనిపించేవిధంగా ఏర్పాటుచేసిన అతిపెద్ద ఎల్‌డి టీవీలుప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి.నాటి నేటి అందాల తారలంతా... ఓవైపు... గాయక సంగీత బృందం ఒకవైపు... టీవీ తారలంతా మరోవైపు.. సాంకేతిక నిపుణులంతా మరోవైపు కదులుతూ.. కనువిందు చేస్తున్నారు.‘‘అబ్బ! ఎంతకాలమైందండీ! ఈ తారలందరినీ ప్రత్యక్షంగా చూచి! పాటకారులనూ, మాటకారులను చూసే అవకాశం కోసమేగా... నేను తహతహలాడింది...’’ నీరజ సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే...‘‘అందుకే గదా! భగీరథ ప్రయత్నం చేసి ఈ పాసుల్ని సంపాదించింది’’ కించిత్తు గర్వం నా గొంతులో తొంగి చూసింది.‘‘అందుకేనండోయ్‌! శ్రీవారూ! ఈ నాలుగైదు గంటల ప్రోగ్రాం కోసం రెండు బిస్కెట్‌ పాకెట్లు... వాటర్‌ బాటిల్స్‌ కూడా తెచ్చాను.

అవసరమైనప్పుడు అడిగి మరీ తీసుకోండి!’’ అని వివరించింది.‘‘ఇది అష్టపదుల పండుగ! అష్టలక్షణాలున్న అనేక అంశాలు మన సంప్రదాయంలో ఇమిడిపోయాయి. వాటినే అష్టఐశ్వర్యాలని, అష్టభోగాలని, అష్టమహిషులని, అష్టాభరణములని పిలుస్తారు!’’ పురుష యాంకర్‌ అనగానే..‘‘అష్టలక్ష్ముల గురించి విన్నాముగానీ... అష్టమహిషుల పేర్లు నాకు తెలియవే!’’‘‘నేను చెబుతాగా! రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్ష్మణలు అష్టమహిషలు. వీరందరూ శ్రీకృష్ణుని భార్యలు!’’‘‘మరి అష్ట ఐశ్వర్యాలంటేనో...’’ మహిళా యాంకర్‌ ప్రశ్నించింది.