ఏమండీ.. లేవండి’’ నిద్రపోతున్న భర్త కాలిపై అరచేతితో బలంగా కొట్టింది స్వరాజ్యం.సైరన్‌ లాంటి కేకతోపాటూ, దూలం విరిగి కాలిపై పడ్డట్టూ అనిపించడంతో, మాణిక్యం ఉలిక్కిపడి లేచి బాధతో కాలిని నిమురుకోసాగాడు. ప్రక్కనే భార్య కనిపించేసరికి బాధ మరిచాడు.‘‘ఏమిటే అలా కేక పెట్టావ్‌’’ కంగారుగా అడిగాడు.‘‘మామూలుగా పిలిస్తే కేకలా వినిపిస్తుందా’’ ప్రక్కనే కూర్చుంటూ అంది.‘‘నీ మామూలు పిలుపు ఇలా వుంటే కేక ఎలా వుంటుందో’’ గత్యంతరం లేక నవ్వుతూ అన్నాడు.‘‘వేళాకోళమాపి ఇది చూడండి’’ అంటూ ఆరోజు దినపత్రిక అతని చేతిలో పెట్టింది.‘‘ఏముందేఇందులో’’ అని పేపర్‌ చూశాడు. చివరి పేజీలో ఓ ఫోటో కనిపించింది.‘‘అరే మొన్నటి పెళ్ళి ఫోటోనే’’ ఆనందంగా అన్నాడు.‘‘సంతోషపడమని కాదిచ్చింది... మీరు కూడా ఓ నిర్ణయానికి రండి’’నిర్ణయమనే పదం రాబోయే తుఫాన్‌కు సంకేతంలా వినిపించి ఈసారీ భయంగా మళ్ళీ ఫోటోను చూశాడు.రెండు రోజుల క్రితం అతని సోదరుడి సుపుత్రుని పెళ్ళి జరిగింది. రాష్ట్ర మంత్రిగారొకరు పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

 ఆ దృశ్యమున్న ఫోటో పేపర్‌లో వేయించారు. అందులో అతనికి ఏ ప్రత్యేకతా కనిపించలేదు. ఆ ఫోటో చూసి నిర్ణయించుకోవడానికి ఏముందో అతనికి అర్ధం కాలేదు.‘‘నిర్ణయించుకోవడానికి ఏముందే’’ మనసులోని మాటను పైకి చెప్పాడు దీనంగా.‘‘తప నాదండి. అసలు నిర్ణయించాల్సింది నేను. అనవసరంగా మీరు నిర్ణయించుకోండి అన్నాను.’’‘‘ఏదోలేవే నువ్వూ మరీనూ... అసలు విషయం చెప్పూ’’ రాబోయే పరిస్థితులకు సిద్ధపడుతూ అన్నాడు.స్వరాజ్యం అతనికి దగ్గరగా జరిగింది.‘‘వద్దులేవే అమ్మాయి నిద్రలేచి వుంటుంది’’ అటూయిటూ చూస్తూ మొహమాటంగా అన్నాడు.‘‘మీ మొఖానికి ఇదొక్కటే తక్కువ’’ కోపంగా అంది.‘‘నాదేం తప! నువ్వే దగ్గరికి వచ్చావ్‌’’ రుసరుసలాడుతూ అన్నాడు.‘‘అసలు విషయం వినండెహే...’’ చిరాగ్గా అరిచింది.‘‘ఆ! చెప’’‘‘వచ్చేనెల మనమ్మాయి పెళ్ళి వుంది. మనం కూడా ఓ మంత్రిగారిని పెళ్ళికి పిలవాలి. ఆ ఫోటో కూడా పేపర్‌లో రావాలి’’ అంది ఏం చేస్తావో నీదే భారం అన్నట్టు.మాణిక్యం అదిరిపడ్డాడు. నీకేమైనా పిచ్చా అందామనుకుని ధైర్యం చాలక దిక్కులు చూడసాగాడు.‘‘ఏయ్‌ అర్ధం అయిందా?’’ గట్టిగా అడిగింది.‘‘అది కాదే! అన్నయ్యగారేమో సెక్రటేరియట్‌లో పని చేస్తారు. ఆయనకు మంత్రులతో లావాదేవీలుంటాయి. అందువల్ల మంత్రిగారు పెళ్ళికి వచ్చి వుంటారు. మనకంత సీన్‌ లేదు’’ నిస్సహాయంగా అన్నాడు.‘‘ఇవన్నీ నాకు చెప్పవద్దు. నా కూతురి పెళ్ళికి మంత్రిగారు రావలసిందే’’ క్రికెట్‌లో థర్డ్‌ ఎంపయిర్‌ డెసిషన్‌లా చెప్పేసి కోపంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.మాణిక్యం తల పట్టుకుని కూర్చున్నాడు.అతనికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. మంత్రులెవరో సరిగ్గా తెలియదు. కౌన్సిలర్‌ కాదుగదా కనీసం బస్తీ లీడర్‌తో కూడా పరిచయం లేదు.