లావెండర్‌ మేఘం చిలకరించిన జల్లేదో హఠాత్తుగా మనసులోకి జారినట్టనిపించి నోట్‌బుక్‌పై నిమగ్నమై వున్న చూపులని వెనక్కి తిప్పి చూశాడు సత్యదేవ్‌.ముదురాకు పచ్చ మెత్తని నూలు చున్నీని కప్పుకున్న భుజాలు ... చిన్ని రవ్వ ముక్కుపుడక ... దాన్నించి ఎగిసిపడుతోన్న సప్తవర్ణాల చుక్కలు ... ఆ చుక్కల్ని అద్దుకుని మెరుస్తున్న పెదవులు .. ఆమె మొహంలోకి చూస్తూ అప్రయత్నంగా ‘‘హలో’’ అన్నాడు.ఆమె తన వైపు చూడగానే ‘ఐ యామ్‌ సత్యదేవ్‌’ అన్నాడు.బంతిపువ్వు రంగు కాటన్‌వరల్డ్‌ స్లిమ్‌ ఫిట్‌ కుర్తా, లేయర్స్‌ లేయర్స్‌గా పెరిగిన నల్లని వొత్తయిన జుట్టు ... దాన్ని చూడగానే ‘యేం షాంపూ వాడతారో భలే సిల్కీగా మెరుస్తోంది’ అనుకొంది అతుల్య. యెవరో ఈ కొత్త కుర్రాడు? బిల్లింగ్‌ కౌంటర్‌ పక్కనే కూర్చుని పని చేసుకుంటున్నాడంటే షాప్‌ మేనేజర్‌ అయి ఉంటాడు. మంచి హాండ్‌సమ్‌ ఫ్రెండ్లీ మేనేజర్‌ని అపాయింట్‌ చేసుకొన్నట్టున్నారు. పాత మేనేజర్‌ కాస్త రిజర్వ్‌డ్‌. యితనికి చొరవ బాగానే వున్నట్టుంది. ఆ మాత్రం చొరవ లేకపోతే ఆల్టర్నేటివ్‌ ఆలోచనలతో పెట్టిన యిలాంటి ఆర్గానిక్‌ స్టోర్స్‌ని నడపటం కష్టమే అనుకొంటూ ‘‘హాయ్‌, ఐ యామ్‌ అతుల్య... నైస్‌ మీటింగ్‌ యు’’ అంది.కందిపప్పు, వేరుశెనగ, బ్రౌన్‌ షుగర్‌, కొర్రలు, బ్రౌన్‌ రైస్‌ యిలా చకచకా తనకి కావల్సినవి వొక్కో రేక్‌ నుంచి తీసుకొంటుంటే ‘సో... యీమెకి యీ స్టోర్స్‌ పరిచయమేనన్నమాట...’ అనుకొన్నాడు సత్యదేవ్‌. 

ఆమె సరుకుల్ని బిల్లింగ్‌ టేబుల్‌పై వుంచి, సోప్స్‌ వున్న ర్యాక్‌ వైపు వెళుతుంటే అతనూ ఆమె వెనకే వెళ్ళాడు.వొక్కో సోప్‌ని వాసన చూస్తూ తిరిగి తీసిన చోటే పెట్టేస్తుంటే ‘‘మీకు ఎలాంటి సోప్‌ బాగుంటుందో నేను చెప్పనా’’ అంటూ వొక సోప్‌ తీసి ఇచ్చాడు.ఆ సోప్‌ వాసన చూస్తూ భలే వుందంటూ కనురెప్పలు ఎగరేసింది.‘‘యీ యెసెన్షియల్‌ ఆయిల్స్‌ కూడా చూడండి. యిది ప్యూర్‌ లావెండర్‌ ఆయిల్‌. ఆలివ్‌ ఆయిల్లో వొకటో రెండో డ్రాప్స్‌ వేసుకుని వాడితే చాలా బాగుంటుంది’’ అన్నాడు.‘‘దేనికి వాడితే?’’‘‘బాడీ మసాజ్‌కి... స్కిన్‌తో పాటు మూడ్‌ కూడా రిజువెనేట్‌ అవుతుంది’’ అన్నాడు.తను వాడుతూ కూడా యింత స్టుపిడ్‌ క్వశ్చన్‌ వేసానేంటి అనుకొంటుండగా ‘‘ఈ షాంపూ కూడా చాలా బాగుంటుంది’’ అన్నాడు.అది తను వాడే షాంపూనే. అతను వాడే షాంపూ యేమిటో... కానీ అడగటం మర్యాదగుండదేమో... అనుకుంటుండగా అతను మట్టితో చేసిన దీపపు లాంతర్ని చూపిస్తూ ‘‘యిందులో నీళ్ళు పోసి మీకు నచ్చిన యెసెన్షియల్‌ ఆయిల్‌ రెండు చుక్కలు వేసి, కింద నున్న యీ చిన్న కొవ్వొత్తిని వెలిగించితే రూమంతా ఫ్రాగ్నెన్స్‌ స్ర్పెడ్‌ అయి, మీ మూడ్‌ని చాలా యెలివేట్‌ చేస్తుంది’’ అన్నాడు.