సాయంత్రం ఐదూ, ఆరు మధ్య.పాప ఉమను ఎత్తుకొని బయటి వరండాలోకి వచ్చాను. రోజంతా లోపలే వుంటే ఉమకి మహ బోర్‌. తలుపులు తీసి బైటికి వెళ్దాం అన్న భావం వెలిబుచ్చుతుంది. ఔటింగ్‌ మహా యిష్టం. ఎదురుగా పార్కింగ్‌ లాట్‌లో కార్లు ఆపి, ఆఫీసుల నుండి తిరిగి వస్తున్నవారు యిళ్ళల్లోకి వెళుతూ కనిపిస్తున్నారు. కొన్ని వందల ఎపార్ట్‌మెంట్ల సముదాయం వున్న ఆవరణ అది. పగలంతా దాదాపు నిర్మానుష్యంగా వుంటుంది. సాయంత్రం అవుతూనే సందడి ప్రారంభమౌతుంది.ప్రక్కనే ఎవరో వెళ్తుంటే ‘హాయ్‌’ అంటూ చెయ్యి చాపింది ఉమ. తిరిగి చూశాను. ‘హాయ్‌’ అంటూ పైన అపార్ట్‌మెంట్‌ మెట్లపైకి వెళ్తున్న ఒక అమెరికన్‌ ఉమకి షేక్‌హాండిచ్చి నవ్వుతూ వెళ్ళిపోయాడు.మావాళ్ళ కారు వచ్చి ఆగింది. అమ్మాయి దిగింది ముందు. ‘హాయ్‌ ఉమా?’ అంటూ పలకరించింది చెయ్యి వూపుతూ.ఉమ నవ్వుతూనే వాళ్ళ నాన్నకోసం చూసి ఆయన కార్లోంచి దిగగానే ఒకటే తుళ్ళింతలు మొదలుపెట్టింది. నా దగ్గర ఆగలేదు. అమ్మ దగ్గరవగానే తనకో ముద్దిచ్చి నాన్నమీదికి దూకింది. ‘‘ఇది నాన్న బిడ్డరా! చూడు దాని వేషాలు!’’ అన్నాను నవ్వుతూ.రాత్రి భోజనాల దగ్గర మా అమ్మాయితో అన్నాను. ‘రేపు వినాయకచవితి’ అని.‘అలాగే’ అమ్మా! అయితే గుడికి వెళ్దాం. రేపు గుళ్ళో పూజ ఎన్ని గంటలకు మొదలుపెడ్తారో కనుక్కోండి?’ అంది మా అల్లుడితో.ఉదయాన్నే కాఫీలు తాగి లంచ్‌బాక్స్‌లు రెడీ చేసుకుని అమ్మాయీ, అల్లుడూ వెళ్ళిపోయారు ఆఫీసులకి.చిన్నారి ఉమ నిద్రపోతోంది మంచంమీద నా ప్రక్కన.నిద్రలో నవ్వుకుంటోంది. 

అపడే కొమ్మల చివరన రేకు విచ్చిన గులాబీలా అది అందమైన మందహాసం. అపురూపమైన అనుభూతి నాకు ఆ నవ్వు చూస్తుంటే.ఉమ నిద్రలేచేదాకా నాకేమీ పని వుండదు.ఇవ్వాళ పండగ కదా? ఇదే మనదేశంలో అయితే ప్రొద్దున్నే ఎంత హడావుడి! మరెన్నో పనులు!! ఇంటిముందు రంగవల్లికలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, పూల దండలు, వినాయకుడి మట్టి విగ్రహం, పత్రీ, పూలూ, పళ్ళూ తెచ్చుకోవటం, యింట్లో పనులు, దేవుని దగ్గర అలంకరణ, ఇంటిల్లిపాదీ స్నానాలు, కొత్తబట్టలు, కుడుములు, వుండ్రాళ్ళు, నైవేద్యాలు, వంటావార్పూ, పిల్లల పుస్తకాలకు పసుపూ, కుంకుమా అద్ది పూజ దగ్గర పెట్టడం, పూజ, వినాయక వ్రతకల్పం... వచ్చేపోయే అతిథులు.. అబ్బ! ఎంత సంరంభం! మరెంత పండుగ వాతావరణం.ఈ అమెరికాలో రోజూ వాకిలి శుభ్రంచేసే పనేమీ వుండదు. శని, ఆదివారాల్లోనే అన్ని పనులూ. ఇంట్లో కార్పెట్‌నంతా వాక్యూమ్‌ చేసుకోవటం, బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేసుకోవటం, బయట లాన్‌ కట్‌ చేయటం, వారమంతా వాడిన బట్టలన్నీ వాషింగ్‌ మిషన్‌లో వేసి, ఆ తర్వాత డ్రయ్యర్‌లో వేసి, ఆ తర్వాత అన్నీ మడతలు పెట్టేసుకోవటం, వీలునుబట్టి నాలుగైదు రకాల కూరల్నీ, సాంబారునీ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవటం... యిలాంటివన్నీ శని, ఆదివారాల్లో చేసుకుంటారు, ఏ ఫంక్షన్‌ చేసుకోవాలన్నా, ఎవరైనా శని, ఆదివారాల్లో చేసుకోవలసిందే. వీక్‌డేస్‌లో చేసుకుందామన్నా ఫంక్షన్‌కి రావటానికి బంధుమిత్రులెవ్వరూ అందుబాటులో వుండరు.