‘‘సార్‌!’’ అరిచినట్టున్న ఆ పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు వామనరావు.అప్పటికింకా వెలుతురు రాలేదు. సమయం సుమారు అయిదు గంటలు కావచ్చు.‘‘సార్‌, సార్‌!’’ మళ్ళీ అదే కేక!ఆ గొంతు గెస్ట్‌ హౌస్‌ వాచ్‌మన్‌ అబ్బులుది. వామనరావు ఆ గెస్ట్‌హౌస్‌కి మేనేజర్‌.‘‘ఏమయింది అబ్బులూ?’’ రొటీన్‌గా ప్రశ్నించాడు కానీ అతనికింకా నిద్రమత్తు దిగినట్లు లేదు.‘‘సార్‌ నిన్న మన గెస్ట్‌ హౌస్‌లో దిగినారు కదా, రమణరావు బాబు..’’‘‘అవును.’’‘‘ఆయనెంత కొట్టినా తలుపు తీయట్లేదు సార్‌!’’‘‘ఆయన్ను కొడితే తలుపెందుకు తీస్తాడు- తలుపుని కొట్టాలి గానీ..’’‘‘అదికాదు సార్‌, ఆయన గదిలో తలుపేసుకుని పడుకున్నారు..తలుపు కొడితే తీయట్లేదు..’’‘‘రాత్రి బాగా తాగాడుగా - మాంచి నిద్దట్లో వుండుంటాడులే! ఓ రెండు గంటల తర్వాత అయితే లేవచ్చు. అయినా ఇపడు ఆయనతో నీకేం పని?’’రమణరావు హెడ్డాఫీసునుంచి అపడపడు తనిఖీకి వస్తుంటాడు. అతనికి పెద్దగా చదువు లేకపోయినా, వాళ్ళనీ వీళ్ళనీ- అందితే జుట్టు, అందకపోతే కాళ్ళూ పట్టుకుని- ఉద్యోగం సంపాదించుకున్నాడని టాక్‌. తమకంటే చిన్న వయసులో, తమకంటే తక్కువ చదువుతో, తమకంటే పెద్దపోస్టులో వున్న రమణరావంటే, వామనరావులాంటి వాళ్ళ కంటగింపును ఈ టాక్‌ ఊరట పరుస్తూంటుంది. 

వాళ్ళు దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ప్రచారం చేస్తూంటారు.ఆ టాక్‌లో ఎంతోకొంత నిజం లేకపోలేదు! రమణరావు తల్లి రాజమ్మకామాత్రం లింకు చాలు కొడుక్కుద్యోగం సంపాదించి పెట్టడానికి!!‘‘సార్‌’’ ఆలోచనల్లోంచి బయటపడేశాడు అబ్బులు వామనరావుని, ‘‘నిన్న రాత్రి అంతా వెళ్ళిపోయాకా కూడా రమణరావు బాబుగారు తాగుతూనే వున్నారు సార్‌’’మేనేజర్‌ శ్రద్ధగా విన్నా వినకపోయినా చెప్పడం తన డ్యూటీ కాబట్టి చెపకుంటూ పోతున్నాడు అబ్బులు.‘‘ఆ తాగుడు మత్తులో ఏమేమో మాట్లాడారట సార్‌!’’‘‘ఇందులో కొత్తేముంది?’’‘‘మాట్లాడిన విషయం కొత్తదే సార్‌’’‘‘ఏమిటది?’’ అని అడుగుతాడేమోనని ఆగి, అడగకపోయినా కంటిన్యూ అయిపోయాడు.‘‘ఆయన అసిస్టెంట్‌ చెప్పాడు, ఆయన ఈరోజు పొద్దున్నే విషం తాగి చచ్చిపోతారట సార్‌! నన్నెవ్వరూ ఆపద్దు అని కూడా చెప్పారట సార్‌!’’‘‘ఆహాఁ! మరింకా ఆ శుభవార్త ఎవరి చెవినా పడలేదేమిటి, తెల్లారింది కదా!’’‘‘నేనది చెబుదామనే వచ్చాను సార్‌!’’ అన్నాడు అబ్బులు ‘శుభవార్త’ అన్న పదాన్ని అవాయిడ్‌ చేస్తూ.‘‘రాత్రి నాతో ఈ విషయం చెప్పి నన్ను చూస్తుండమని అసిస్టెంటుగారు పడుకున్నారు సార్‌. రమణరావు బాబుగారు కిటికీ తలుపు తీసే పడుకున్నారు. నేను గంటగంటకీ ఆయన్ను చూస్తూనే వున్నాను. నాలుగు దాటాక చిన్న కునుకుపట్టేసింది. పది నిమిషాల క్రితం పెద్ద చపడయింది. బాబుగారి కిటికీ తలుపు మూసుంది. తలుపు కొట్టాను కానీ జవాబులేదు.’’ ఊపిరి పీల్చుకున్నాడు అబ్బులు.అతడు చెప్పవలసిందింకా వుందేమోనని భయపడుతూ, ‘‘మరా అసిస్టెంటుని లేపకపోయావ్‌..’’ అన్న వామనరావు మాట పూర్తికాకుండానే అసిస్టెంటు పరుగున వచ్చాడు. అతడి చేతిలో ఒక కాగితం వుంది.