‘ఆషాఢ మాస తగ్గింపు ధరలు...శ్రావణం మాసం వరకూ పొడిగింపు... మీ ఎన్నిక ఏదైనా. అదే మన్నిక, అదే నాణ్యత... ఆషాఢ, శ్రావణ మాసాల వస్త్ర సంగమం...మా వస్త్ర సంగమం’ ప్రతి రేడియో, టీవి కార్యక్రమంలో ప్రకటనల రెప రెపలు, చిటపటలు,‘ఏమండీ.... ఒక్క చీరకి మీరు డబ్బిస్తే...మరో చీర నే తెచ్చుకుంటానండీ...’ గోముగా అడిగే పెళ్లాం. ఆ లాజిక్‌ ఏంటో అర్ధం కాని మొగుడు ప్రశ్నకి సమాధానంగా ఫలానా షాపులో ఒక చీర కొంటే మరో చీర ఉచితం అంటండీ...’ అంటూదీర్ఘం తీసి చెప్పే పెళ్లాం సమాధానంతో మరి కొన్ని వ్యాపార ప్రకటనలు, ‘ధమాకా సేల్‌’ అంటూ దమాక్‌ ఖరాబు చేసే మరి కొన్ని ప్రకటనలు కలిపి టోటల్‌గా స్త్రీజాతి అయోమయంలో పడిపోయేటట్లు చేసి కొనుగోలుదారు ఏ షాపులో కొనాలో తెలీని పరిస్థితిలో ‘హ్యాంగ్‌’ అవుతుంటాడు.‘నా పేరు వందన కదండీ... మనం ఈరోజు ‘వందన సిస్టర్స్‌’షోరూంలో పర్చేజ్‌ చేద్దాం’ అంది వందన కొత్తగా పెళ్లయిన మొగుడు చంద్రంతో‘వద్దు...నాపేరు చంద్రం కదా... అందుకే మనం కుందన బ్రదర్స్‌కి పోదాం’ సవాల్‌ విసిరాడు చంద్రం.‘అబ్బ...బట్టలు కొనిపిస్తున్నది నాకోసం కదండీ...?’ కళ్లు తిపతూ వెక్కిరింతగా నోరు తిప్పి అంది ఆమె.‘మరి నాక్కూడా ఒన్‌ ప్లస్‌ టు ఫ్రీగా ఇస్తేనే’ ఆమె కొంగుపట్టిలాగాడు.‘ఇదిగో రెండు నెలల క్రితం ఈ తాళి కట్టి టోటల్‌ ఫ్రీగానే పొందుతున్నారు కదా’ అంది ఆమె మరింత కరుకుగా‘అమ్మో! ఇపడు వద్దంటే మరో సీన్‌కి దూరమై పోద్దని’ మనసులోనే అనుకుని, ఆమె మాటలకి విలువ ఇస్తున్నట్లుగా... ‘సరే నీ మాట ఎపడు కాదన్నాను’ అన్నాడు.

 అక్కడకి వాళ్ల పెళ్లయి రెండు నెల్లే అయింది. ఆమెకేదో రెండు పదుల సంసారం గడిపిన విలువ ఇస్తున్నట్లు ఫీలై పోయింది వందన.‘శ్రావణ మాసంలో మా అమ్మ ఎట్టాగు కొనిస్తుంది కదోయి. ఇపడెందుకోయ్‌!’ నెక్ట్స్‌ ఛాన్స్‌ చూద్దాం. అన్నట్లు మరో మాట కదిపాడు చంద్రం.‘ఆఁ...కొంటుంది లేవోయ్‌! ధర ఎక్కువైంది అత్తయ్యా అంటే కోపం. ధరకి తగ్గ లుక్‌ లేదంటే నా మీదకే మరో లుక్‌ పడుతుందని నా భయం. ఏమన్నా లుక్కులతోనే చంపేస్తాది మీ అమ్మ. ఈసారి బజారెళ్లినపడు అత్తయ్యని ఫట్‌ కొట్టండి. పెళ్లయినా ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతారేంటి...హైటెస్‌ సిటీలో పనిచేస్తున్నారు. అన్నీ హైటెక్‌ బుద్ధులే వుండాలి’ చిన్న క్లాసు పీకింది వందన‘నువ్వెంత బడిబాట పంతులమ్మయితే మాత్రం నాకు ప్రతి పనిలో క్లాసు పీకనవసరంలేదు మేడమ్‌.’ కాస్త స్టూడెంట్‌లా చేతులు కట్టుకుని అని, ‘పాపం! మా అమ్మకు చికెన్‌ గునియా వచ్చిందిగా. ఎట్టాగూ మనతో రాలేదు. వచ్చేవారం షాపింగ్‌కి పోదాం. అప్పటికీ ఆషాఢం చివరి రోజు సేల్స్‌ మరీ బంపర్‌గా వుంటాది’ నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు చంద్రం.