అవనిజను చూడాలి!పరామర్శతో దగ్గరకు చేరాలి!తనే మగ దిక్కు కావాలి!గతి తప్పిన ఆలోచనలు మదిని తొలిచేస్తున్నాయి. తడబడుతున్న పాణి నీడ అవనిజకు సమీపంలో నిలిచింది. తను వచ్చిన అలికిడికి కూడా ఏ మాత్రం స్పందించలేదు అవనిజ. తనతో మాటేం కలుపుతుందని! అక్కడే వున్న అవనిజ కూతురు ఏదో పుస్తకంలో పేజీ తిప్పింది కాని తన ఉనికిని గమనించినట్లు లేదు. తల్లికి ప్రతి బింబంలా వుంది!‘‘ప్రమాదం ఎలా జరిగిందట’’ ఎండిపోయిన పాణి గొంతు అసంకల్పితంగా శబ్దం చేసింది.అసందర్భంగా వుంది తన ప్రశ్న.కనురెప్ప వాల్చకుండా శూన్యానికి అంకితమైన అవనిజ లిప్తపాటు పాణిని చూసి లేచి లోపలికి వెళ్లింది. ముక్కంటి మూడోకంటి వెలుగు ఆ చూపులో వుంది. ఇక అక్కడ వుండడంలో వ్యర్థం అర్థమయింది పాణికి.చేతులు వెనక కట్టుకుని అడుగులు బయటికి వేస్తున్నాడు పాణి.‘‘మీ కళ్లజోడు’’ - తీసికెళ్లి యిచ్చింది అవనిజ కూతురు.ఆ వంకతో అతను మళ్లీ రాకుండా ఆ పని చేశానని తల్లితో చెప్పింది తర్వాత.్‌్‌్‌అందమైన శిల్పానికి సజీవ రూపం అవనిజ. మంచి మనసనే సాహిత్యానికి తీయని గొంతు అవనిజ! ఆ గానాన్ని ఆస్వాదించే అవనిజ భర్త సుప్రజారామ్‌ని కురూపి అనలేం గాని తెలివితో అందంగా కనిపించే వాళ్లలో ఒకడని చెప్పగలం!బాహ్యానికి ప్రాధాన్యం యిచ్చే కళ్లు సంస్కారాన్ని నటించడం కూడా మరచిపోయాయి.

ఉమ్మెత్త చెట్టు మీద సీతాకోక చిలుక వాలినట్లుంది!ఎక్కడో ఏదో పొరపాటు జరిగి నీకీ అదృష్టం పట్టింది!అసలామె భర్తగా నీవు తగవు!ఎన్నో అసూయలు పదాలై పెదాలు దాటి సుప్రజారామ్‌ హృదయాన్ని తాకాయి!మనసుకి ఏ గాయం తగిలినా చిరునవ్వుతో నయం చేసుకోవడం చిన్నప్పుడే అలవాటు చేసు కున్నాడు - సుప్రజారామ్‌.పరిపక్వమైన ఆలోచన పెరిగి ఆ అవసరం కూడా లేకుండా చేసింది. మొహం మీద ఆభరణం గానే మిగిలింది సుప్రజారామ్‌ చిరునవ్వు!అయితే అవనిజ అనుభవం అందుకు భిన్నంగా వుంది-‘‘నీ అంతంత మాత్రపు చదువుకు అంత హోదా డబ్బు వున్నవాడు దొరకడని అందాన్ని ఎరవేసి లాక్కున్నావు’’ అంది గుర్తుకురాని పరిచయంతో వచ్చిన ధవళ అనే అవిడ - అని ఊరుకుంటే సరి పోయేది. అవనిజ ఏదోలే అని సర్దుకుపోయి వుండేది. ‘‘అయినా నువ్వే తెలివగల దానివిలే - మొగుడి చాటుగా అందాల్ని ఆనందించడం పెద్ద పనేం కాదనుకో’’ అంది ధవళ. ఖంగుతిన్న అవనిజ ఆవిడ చెంప ఛెళ్లు మనిపించింది. ‘‘నీ జీవితంలో నా యింటి గడప తొక్కకు’’ అని చెప్పి పంపించింది. ఆ ప్రస్తావన భర్త దగ్గర వచ్చినప్పుడు - ‘‘చేయెందుకు చేసుకున్నావు’’ సౌమ్యంగా అడిగాడు సుప్రజారామ్‌.