‘‘ఆంటీ! ఆంటీ గారండీ!’’అరుపు విని సుభద్రమ్మ చేతులు చెంగుతో తుడుచుకొని కిచెన్‌లోంచి బయటకొచ్చి వీధి గుమ్మంవైపు చూసింది.చేతిలో సూట్‌కేసుతో ఎవరో అమ్మాయి. అందంగానే ఉంది. వయసు ఇరవై రెండుకి అటోయిటో. ఆమెను ఇంతకుముందెన్నడూ చూసినట్టు లేదు.‘‘ఎవరూ?’’ సమీపంగా వచ్చి అడిగింది సుభద్రమ్మ.అమ్మాయి సూట్‌కేసు వదిలేసి చటుక్కున ఆమెకు మోకరిల్లి - ఆంటీ! ఆంటీ! మీరే నన్ను రక్షించాలి - అంటూ ఏడుస్తోంటే సుభద్రమ్మ నిర్ఘాంతపోయింది. బెడ్‌రూంలో పేపర్‌ చదువుకుంటున్న శాంతారావు ఏడుపు విని ఆదరాబాదరా అక్కడికొచ్చాడు. చటుక్కున ఆ అమ్మాయి ఆంటీని ఒదిలేసి ఆయనకు మోకరిల్లి ‘‘అంకుల్‌! అంకుల్‌’’ అంది ఎక్కిళ్లు పడుతూ ఏమీ చెప్పలేకపోయింది.ఆమెను ఓదార్చి, కుర్చీలో కూర్చోబెట్టి, టీ యిచ్చి అడగ్గా, అడగ్గా ఎక్కిళ్లు పడుతూ, ఏడుస్తూ, తడబడుతూ ఆమె చెప్పిన విషయం వారికి షాక్‌ యిచ్చింది.ఆమె కల్పన. బెంగుళూరులో వారబ్బాయి సమీర్‌ పనిచేస్తున్న ఆఫీస్‌లోనే తనూ పనిచేస్తోంది.

మొ దటి చూపులో కాకపోయినా సంవత్సరం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. అచంచల విశ్వాసంతో హద్దుమీరారు.ఇపడు కల్పన నెల తప్పింది. ఆమె తల్లిదండ్రులు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తున్నారు. సమీర్‌కి చెబుదామంటే అతడు నెలరోజులు ట్రయినింగ్‌కోసం అమెరికా వెళ్ళాడు. ఫోన్‌లో దొరకడం లేదు. ట్రయినింగ్‌ పూర్తయింది. 

ఒకటి రెండు రోజుల్లో సమీర్‌ యిక్కడికి వచ్చాకనే బెంగుళూరు వెళ్తాడని ఊహించి, పెళ్లిచూపులు తప్పించుకోడానికి ఏం చేయాలో తోచక తల్లిదండ్రులకు చెప్పకుండా యిలా వచ్చేసింది.‘‘నన్నేం చెయ్యమంటారో చెప్పండి అంకుల్‌! చెప్పండి ఆంటీ!’’ అని రోదిస్తోందామె.కల్పన చెప్పిందెంతవరకు నమ్మాలో అర్థంకాలేదు శాంతారావు దంపతులకు. సమీర్‌ యిష్టానికి వ్యతిరేకంగా ఆ యింట్లో ఏమీ జరగదు. వాడు ప్రేమిస్తే తప్పకుండా తమకి చెప్పేవాడే. అదీకాక అమెరికా వెళ్లేముందు పెళ్లి చూపులకు వచ్చాడు. అమ్మాయి నచ్చిందని చెప్పాడు. వాడు అమెరికా నుంచి రాగానే పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించుకున్నారు కూడా. ప్రేమిస్తే వాడెందుకా విషయం తమతో చెప్పలేదు?అలాఅని కల్పనని అనుమానించడానికీ లేదు. ఆమె మాటల్లో, చేష్టల్లో నిజాయితీ కనిపిస్తోంది. సమీర్‌ పనిచేస్తున్న కంపెనీ పేరు, అతడు అమెరికా వెళ్లడం, ఒకటి రెండు రోజుల్లో రానుండడం, ఫోన్‌లో దొరక్కపోవడం - అన్నీ నిజమే.‘‘నన్నేం చేయమంటారు అంకుల్‌! సమీర్‌ వచ్చేవరకూ ఏదైనా హోటల్‌లో ఉండమంటారా?’’ దీనంగా అడిగింది కల్పన.భార్యవైపు చూశాడు శాంతారావు.‘‘ఆడవాళ్లు హోటల్లో ఒంటరిగా ఉండడం మంచిదికాదు. సమీర్‌ వచ్చేవరకూ నువ్వు యిక్కడే ఉండొచ్చు’’ హఠాత్తుగా ఒక నిర్ణయానికొచ్చిన దానిలా అంది సుభద్రమ్మ. కల్పన ముఖం వెలిగిపోయింది. చివ్వున కన్నీళ్లు తిరిగాయి.‘‘మీరెంత మంచివారు ఆంటీ! నేనెంత అదృష్టవంతురాల్ని!’’ అంది, అపడే తానా యింటి కోడలైపోయినంత సంబరంగా.