చాలా రోజుల తరువాత తమ ఇంటికి వచ్చిన శ్రావ్యను చూసి చంద్రిక మొహం వికసించింది.‘‘ఏమిటే, బొత్తిగా నల్లపూస అయిపోయావు..’’ అన్నది చంద్రిక నవ్వుతూ.‘‘నల్లపూసా లేదు, తెల్లపూసా లేదు. ఈతిబాధలు... పురుళ్ళూ... హాస్పటళ్ళూ...’’‘‘ఏమిటి? పురుడు నీకే?’’‘‘నాక్కాదే బాబూ! మా మేనత్త పురిటికొచ్చింది. కొడుకు పుట్టాడు..’’‘‘ఓహో, మొగుడు పుట్టాడన్నమాట! మొగుడితో ముద్దులూ, మురిపాలూ..’’‘‘ముద్దులూ, మొద్దులూ ఏం లేవుగానీ, రేపు బాలసారె. సకుటుంబ సపరివార సమేతంగా రావాలి..’’ అని పిలిచింది శ్రావ్య.‘‘కాఫీ పట్టుకొస్తాను. ఈలోగా ఈ ఆర్టికల్‌ చదువు..’’ అని చంద్రిక లోపలికి వెళ్ళింది.ఆ ఆర్టికల్‌లోని సారాంశం ఏమిటంటే, అమెరికాలో ఓ అందాలభామ కోటీశ్వరుడికి వల విసిరి పెళ్ళి చేసుకుంది. ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకుంది. మనోవర్తి కింద నెలనెలా వచ్చేదాంతో దిగులు లేకుండా గడిచిపోతోంది. 

ఇక అడిగేవాడు లేడు. స్వేచ్ఛా జీవితం గడిపేస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయని వ్యాసరచయిత ముక్తాయింపు ఇచ్చాడు.చంద్రిక కాఫీ అందిస్తూ ‘‘ఇదేదో బానే ఉందే?’’ అన్నది.‘‘అమెరికాలో ఏం చేసినా చెల్లుతుందేమో కానీ, ఇక్కడ ఆ పప్పులు ఉడకవు’’ అన్నది శ్రావ్య.‘‘కాలంతోపాటు ఆలోచనా ధోరణులూ మారుతున్నాయి’’ అన్నది చంద్రిక.‘‘విడిపోవాలన్న ఆలోచనతో పెళ్ళి చేసుకోవటం మోసమే గదా!’’‘‘కట్నాలు గుంజటం, కిరసనాయిలు పోసి తగలబెట్టటం, చిన్నిల్లు, పెద్దిల్లు అంటూ మానసికంగా హింసించటం... వీటన్నింటినీ మన సమాజం మౌనంగా భరిస్తోందా లేదా? అలాంటప్పుడు ఆ అమెరికా అమ్మాయి ఆలోచన తప్పు ఎలా అవుతుంది?...’’ఇద్దరి మధ్య చాలాసేపు ఘాటుగా చర్చ జరిగింది. చివరకు శ్రావ్య విసిగిపోయి అన్నది.

‘‘సరేలే... నువ్వూ ఇలాగే ఎవడినన్నా కట్టుకుని, విడాకులు తీసుకుని స్వేచ్ఛగా జీవించు. నిన్ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది తయారవుతారు’’.‘‘వైనాట్‌? నలుగురు నడిస్తే... దారి ఏర్పడుతుంది’’‘‘సర్లేవే... నేనూ చూస్తాగా... నీ ఆదర్శాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటావో?’’నవ్వుతూ చెయ్యి కలిపింది చంద్రిక.చంద్రిక అందంగా ముస్తాబై, బాలసారె ఫంక్షన్‌కి వెళ్ళింది.‘‘ఎవరైనా ప్రొడ్యూసర్‌ చూస్తే నిన్ను హీరోయిన్‌గా బుక్‌ చేసేస్తాడు..’’ అన్నది శ్రావ్య.‘‘నిజంగా అంత బావున్నానా?’’ అని నవ్వింది చంద్రిక.‘‘చట్టం చట్టుబండలూ అడ్డొస్తున్నాయిగానీ, నేనే నిన్ను చేసుకునేదాన్ని..’’