‘‘మమ్మీ, ఈ కూర వాసనేస్తోంది. పారెయ్‌’’ డైనింగ్‌ టేబుల్‌పై ఉన్న గిన్నెలోని కూర వాసన చూస్తూ అన్నాడు చంటి. రజని కూడా దాన్ని వాసన చూసింది.‘‘పారెయ్యటమెందుకురా? వే డి చేసిస్తే మీ తాతయ్య తినేస్తాడు’’ అంది.‘‘పాచిపోయిన కూరని తాతయ్య ఎలా తింటాడు మమ్మీ?’’‘‘ఆయనకి మిగిలిపోయిన కూరలు తినటం అలవాటే లేరా. అయినా పూట పూటకీ తాజాగా వండిపెట్టడానికి ఇదేం హోటల్‌ కాదు. పైగా పనీపాట లేని మనిషికి మనం ఈ మాత్రం తిండి పెట్టడమే ఎక్కువ’’ నిష్ఠూరంగా అంటూ ఆ గిన్నె తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది రజని. అక్కడే భోంచేస్తున్న రమేష్‌ తన తండ్రి గురించి భార్య అన్న మాటలకు ఏమాత్రం చలించలేదు.సరిగ్గా అప్పుడే బయటినుంచి ఇంట్లోకి రాబోయిన రాజయ్య కోడలి మాటలు విని గుమ్మంలోనే ఆగిపోయాడు. ఆ మాటలు ఆయన గుండెలో శూలాల్లా గుచ్చుకున్నాయి. ఆ ఇంట్లో తనకున్న విలువేమిటో ఆయనకు మరోసారి బోధపడింది. అంతవరకు ఆకలితో ఉన్న ఆయనకి ఉన్నట్టుండి ఆకలి చచ్చిపోయింది.ఇంట్లోకి వెళ్ళటం ఇష్టంలేక పెరట్లోంచి ఇంటి వెనకవైపున్న తన గదికి చేరుకున్నాడు. నిజానికి ఆ గది నివాస స్థలం కాదు. పాత సామాన్లు పారేసిన స్టోర్‌రూం. ఆ ఇంట్లో ఉండటానికి తనకుఎక్కడా చోటు లేకపోవటంతో ఆ సామాన్ల గదిలో ఓ పాత సామాను మాదిరి ఉండిపోయాడు. ప్రతి రాత్రి ఎలుకలు, దోమలతో సహవాసం చేస్తున్నాడు. కోడలి బాధ కన్నా ఆ ఎలుకలు, దోమల బాధే ఆయనకి నయమనిపించింది.అయితే రెండేళ్ళ క్రితం వరకు రాజయ్య రాజాలా బతికినవాడే. హైదరాబాద్‌కి రాకముందు తన ఊర్లో ఓ హోటల్‌ నడిపేవాడు. 

అది నిత్యం కస్టమర్లతో కళకళలాడుతూ ఉండేది. హోటల్లో ఎంతోమంది పనిచేసేవారు. రాజయ్య వాళ్ళకి తిండితోపాటు మంచి జీతాలిచ్చేవాడు. కస్టమర్లకి కూడా సరసమైన ధరలకే రుచికరమైన పదార్థాలు అందించేవాడు. భిక్షగాళ్ళకు ఉచితంగా తిండి పెట్టేవాడు.మితిమీరిన మంచితనం, దయాగుణం వల్ల రాజయ్యకి హోటల్‌ వ్యాపారంలో పెద్దగా లాభాలువచ్చేవి కావు. కాకపోతే భార్య, ఇద్దరు పిల్లల్ని పోషించటానికి ఆ ఆదాయం సరిపోయేది. బ్యాంకులో లోన్లు తీసి పిల్లల్ని చదివించాడు. ఇద్దరూ మగపిల్లలే. పెద్ద చదువులు చదివాక వారికి హైదరాబాద్‌లో ఉద్యోగాలొచ్చాయి. స్వతహాగా ఆదర్శవాది అయిన రాజయ్య కట్నం తీసుకోకుండా కొడుకుల పెళ్ళిళ్ళు చేశాడు. కొడుకుల నుంచి ఎన్నడూ డబ్బు ఆశించలేదు. హోటల్‌ ఆదాయంతోనే నిరాడంబరంగా జీవించే వాడు. భార్య సావిత్రి అనుకూలవతి. డబ్బు కోసం ఎన్నడూ భర్తను వేధించలేదు.అయితే రెండేళ్ళ క్రితం జరిగిన ఓ దుర్ఘటన రాజయ్యను పూర్తిగా కొడుకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేసింది. ఓరోజు హోటల్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు వంటవాళ్ళు చనిపోయారు. ఇంకొందరు గాయపడ్డారు. కలపతో కట్టిన హోటల్‌ కావటంతో మొత్తం కాలిపోయింది. స్టోర్‌ రూంలో నిల్వ ఉంచిన ధాన్యం సంచులు కూడా కాలి బూడిదైపోయాయి.