‘‘గుడ్‌మార్నింగ్‌ మేడమ్‌’’ అంటూ కాఫీ తెచ్చాడు శివరాం. తీసుకుంది గౌరి. మంచం పక్కన స్టూలు మీద కూచున్నాడు.ఉదయం ఐదు గంటలకి పక్కనుంచి దిగుతూండగానేభార్య గౌరి చెవిలో మధురంగాఊసులాడి, శుభోదయం చెప్పి,ఏదో ఓ చిలిపి పని చేసిన తర్వాతనే మంచం దిగుతాడు శివరాం.ఆ కార్యక్రమం ఈ రోజూయధావిధిగా జరిగింది. అదనంగా ఈరోజు భార్యకి జన్మదినశుభాకాంక్షలు కూడా చెప్పి,సుతారంగా కరచాలనం చేసి తర్వాతే కాలు కిందపెట్టాడు.‘ఇది రెండో రౌండు, కాఫీకీ, మురిపెంకీ కూడా’ అని మనసులో అనుకొని భర్త వైపుఅమృతపాయమైన చూపులు చూసింది గౌరి. తానూ‘గుడ్‌ మాణింగ్‌’ చెప్పింది.కాఫీ పూర్తి చేసింది గౌరి. కపని అందుకొని భార్య కళ్లల్లోకి చూస్తూ సన్నగా ఈల వేశాడు శివరాం. ఉషోదయంలో విరిసిన ముగ్దమందారంలా వుంది గౌరి. భార్యని తమకంగా చూస్తూ.‘‘నీల వస్తూ వుంటుంది. ఆమె రాగానే నీ స్నాన కార్యక్రమం. నా అదృష్టం బాగుండి ఆమె డుమ్మా కొట్టిందంటే, నాకు నీ పుట్టినరోజు బహుమానం. 

అభ్యంగస్నానం ఈ అబ్బాయి గారు చేయించే అదృష్టం లభిస్తుంది’’ అన్నాడు.గౌరి సిగ్గుపడింది. క్షణంలో ఆమె మొహాన్ని విషాదరేఖ విరిసింది. కమ్మ తెమ్మెరకి పులకించి అలతిగా వూగిన పూరెమ్మ, అంతలోనే ఎండవేడిమికి కమలినట్లయింది.తన పట్ల భర్త శ్రద్ధకి అవ్యక్తమైన కృతజ్ఞతాభావం గౌరిది.అల్లరి చిరునవ్వుతో ‘‘అమ్మాయి గారికి ఇవ్వాళ్టికి నలభై ఎనిమిది’’ అన్నాడు. ఆమె మూడ్‌ని సరళం చేయడానికి.‘‘అబ్బాయి గారికి ఏభై ఏడు’’ అంది గౌరి.‘‘అయితే రెండూ కలిపి శతమానం భవతి అన్నమాట’’ అంటూ నవ్వేశాడు. గౌరి కూడా శృతి కలిపింది.‘‘అవును గౌరి... ఇవ్వాళ బర్త్‌డే స్పెషల్‌ ఏమిటి?’’ అడిగాడు. ‘స్పెషల్‌’ పదంలో అర్థాంతరాన్ని మిళితం చేసి, ఒకింత కవ్వింపు కూడా ధ్వనించేటట్లు మాట విరుపుకి లోనయింది. గౌరి మొహం వివర్ణమైంది.గౌరి దగ్గరగా కదిలి మంచం మీద కూర్చున్నాడు శివరాం. ఆమె చెక్కిలి మీద చేయి వేసి ‘నో... నో... నో...’ అంటూ ‘‘సారీ’’ అంటూ మరుక్షణం ఆమె మొహాన్ని తన దోసిటితో స్పృశిస్తూ అనునయంగా, ‘ప్లీజ్‌... ఏమనుకోకు’ అన్నాడు. తనను తాను కూడా సంబాళించుకున్నాడు.