అయినా లచ్చిందేవీ.. ఈనికి ఎంతజెప్పినా సిగ్గురాదుమ్మే. భుజాల కాడికి జుట్టు పెంచినాడు గానీ, బుద్ధి మాత్రం పెరగలేదు నాబట్టకొడుక్కి’’ అంటూ వెల్డింగు శివయ్య కొడుకు నారాయణగాని మీద వీరకోపంతో చెబుతాంది సావిత్రి.వెల్డింగు నారాయణ కొడుకంటే పెద్ద ఫేమసు. బాతురూముల మీద బండల్లేకపోయినా.. నెర్రెలు కనపన్నా సందుల్లో ఒంటికన్నుతో బలే చూస్తాడు.. ఆడోల్లు నీళ్లుపోసుకుండేటపడు.ఓయమ్మా అదే అయితే రాత్తిర్లన్నా పోసుకుండేటోల్లు. నల్లగీతల చొక్కా ఇస్రీ చేయించుకుని వీధిలో కోంటోల్ల పుల్లన్న కొట్టుకాడ కూచ్చున్నాడంటే వద్దంటే లేవడు.. వీధిలో ఆడోళ్లను ఒకటేమైన ఏదో ఒకటి అంటానే వుంటాడు. యీనికి తోడు సుధాకరు, బాయికాడ కిట్టిగాడు దోస్తానా. ముగ్గురూ జతకూన్నారంటే కాలోజీకి పోయేవాళ్లు కూడా రోంచేపు ఇంట్లో కూచ్చోని పొదాం అనుకుంటాంటారు.పజ్జెనిమిదేండ్లొచ్చిన పన్జెయ్యమంటే ఎపడూ మూలగడే. దుప్పటెగదన్ని పండుకున్నాడంటే పొద్దెక్కి జాము గడిచినా వళ్ళిరుసుకోడమేగాని లేచి పంజేచ్చామని సింత లేదు.ఒకరోజు జెండామాను పీరయ్య పెళ్ళాము వుశానమ్మ ఉరుసుకు పోవాలని పొద్దన్నుంచీ ఇండ్లు కడిగి బట్టలుతుక్కోని నీళ్లుబోసుకుందామని జాలాట్లోకి పోయింది. ఎవరెపడు నీళ్ళు పోసుకునేది నారిగాడికి అన్నీ తెలుసు. వుశానమ్మ నీళ్లుబోసుకుందామని గుడ్డలిప్పి ఒక్క చెంబు నీళ్ళు బోసుకుని నెత్తి పైకెత్తి వెంటికలు వెనక్కు అందామని కపలేని జాలాట్లో ఆకాశం దిక్కు చూసింది.అంతే నారిగాడు ఓబులేసు మిద్దెమీదనుంచి తొంగి తొంగి చూస్తాన్నాడు. 

వుశానమ్మ సావుకేక వేసి కోక వీపుకు కపకుని బైటికొచ్చింది. వడ్డెవాళ్ల రామయ్య కేక వినంగానే జెండామాను పీరయ్య ఇంటికి గసపెడ్తా పరిగెత్తి ‘‘ఏం వుశానమ్మా ఏమైంది’’ అని అడిగేసరికే...‘‘వెల్డింగు శివయ్య కొడుకు నారిగాడు నన్నంతా జూసినాడు నాయనా. నాబట్టకొడుకు ఉరుసుకు పోయింటాడని పగులే జాలాట్లేకి పోయినా. లేకుంటే పోను’’ అని ఏడ్చింది.వాళ్లు యీళ్ళు గుమికూడి రాముల్దేలం కాడ ఏమీ తెలియనట్టు గోలీకాయలాటజూస్తున్న నారిగాడ్ని పట్టుకుని చితకదన్నినారు. విఏఓ వెంకటసుబ్బాడ్డయితే ‘‘నాకొడక ఇసారి ఇట్టాటి పనిజేస్తే నిన్ను ఊరెల్లగొడతా. బద్రంగా వుండు’’ అంటూ భయం జెప్పి వదిలేసినాడు.

వుశానమ్మ మాత్రం సాయంత్రం వెల్డింగు శివయ్య ఇంటికొచ్చేదాకా కాసుక్కూచ్చోని.. సాయంత్రం శివయ్యను కడమ్మాను పట్టెకాన్నే అడ్డగిచ్చింది. ‘‘ఏం శివయ్యా! నేను నీల్లుబొసుకుంటాంటే నీ కొడుకును చూడమని జెప్పినావా? ఓబులేసు మిద్దెక్కి జాలాట్లోకి తొంగి జూసినాడు నీకొడుకు. నీ కొడుక్కున్నంత కొవ్వు వూల్లో ఏ నాబట్టకొడుక్కూ లేదు. వానికి కొవ్వు అనగాలంటే యాన్నన్న పిల్లను జూసి పెల్లిజెయ్యి. అపడనుగుతాది వానికి రంది’’ అంటూ నారిగానిమీద కోపమంతా శివయ్యమీద జూపాలకే.. శివయ్య పాణం పైలోకాల్లోనే పోయింది.