రెపరెపలాడింది యెలట్రీ దీపం. స్పందనాస్పదమైన ప్రాణం దాని నాడిలో గిలగిల తన్నుకుంది.గది నిశ్శబ్దంగా వుంది. నిష్క్రమించబోయే ప్రాణం యెలట్రీ దీపం లాగే గిజగిజమంటుంది. తరువాత అంతా చీకటి! చీకటిలో నిశ్శబ్దం!ఆమె కళ్ళు మూసుకుంది.‘బాధగా వుందా’ భర్త నిమ్మళంగా అడిగాడు. ఆమె లేదన్నట్లు కళ్ళతోనే చెప్పింది.మేడ మీద విశాలంగా నీటైన గది. మంచం. పరుపుమీద పాలనురుగులా తెల్లటి దుప్పటి, దిండ్లు. ఆమె తల దిండులోకి కాస్త దిగబడింది. ఆమె శరీర వర్ణం. ధరించిన చీర కూడా తెల్లని తెలుపు.ఎడం పక్క కిటికీలోంచి పెరట్లో బాదంచెట్టు అగుపిస్తోంది. పెరట్లో చాలా పూల మొక్కలూ, పాదులూ వున్నాయి.అత్తగారు నిండు విగ్రహం. లక్ష్మీదేవిలా వుంటుంది. అడ్డ బాస, గోచీ కట్టుతో ఆమెకి మొక్కలూ, పాదులూ పెంపకం అంటే సరదా.మామగారు బ్యాంకి యేజంటుగా పనిచేసి, ధర్మరాజులాంటివాడు, నికార్సయిన మనిషి అని పేరుపొంది రిటైరయేరు, పండు తమలపాకులా వుంటారు.

పెద్ద మరదలికి పూలూ, పాదులు కూడా యిష్టమే. చిన్న మరదలికవేవీ కిట్టవు. ఆమెదంతా ‘సింపులు’ పద్ధతి.బావగారు డాక్టరు. ఆయన భార్య కూడా డాక్టరే. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని, తన పెళ్లి కాకముందే ‘స్టేట్సుకి’ వెళిపోయేరట.పెద్దమరిది వృక్షశాస్త్రం చదువుతున్నాడు. అతనికి చెట్లు, ఆకులు, పువ్వులు, వేళ్లు డాక్టరుకి రోగుల్లా కనిపిస్తాయి. అన్నిటినీ పరీక్షగా చూస్తాడు. వాటిని ముందు కుటుంబాల వారీగా విభజిస్తాడు. ప్రతిదానికీ పైసాచిక భాషలాంటి పేరు పెడతాడు. చిన్నమరిది ఆర్థిక శాస్త్రం చదువు తున్నాడు.పెదమామగారు ఋషిలాంటివాడు. అంటే ఆయనకు గడ్డం వుంది. భార్యవుంది. పిల్లలు లేరు. చదువూ లేదు. కాని భూముల వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయనకు ‘అలోపతి’ వైద్యం మీద వీసం నమ్మకం లేదు. ‘హోమియో’ వైద్యమే శ్రేష్టం అంటాడు. ద్వాదశ లవణ చికిత్స పిలుస్తే పలుకుతుందంటాడు. పిల్లలకి మంచిదంటాడు. అతనికి పిల్లలు లేరు మరి! పొలం నుంచి వచ్చే వాళ్ళకి చక్కెర గుళ్లు యిస్తాడు.మామగారికి ప్రతిరోజూ ‘ఎనీమా’ వుండాలి. మరదలికి నెత్తురు కోసమో, నెత్తురెక్కువగా పోతూందనో నిత్యం కోర్సుల మీద కోర్సులు ఇంజక్షనులుండాలి.అత్తగారికి మాత్రం ఆయుర్వేదం తప్పించి మరో వైద్యం మీద నమ్మకం లేదు. పోతే, బైరాగి చిటికెల మీదా నమ్మకం ఉంది. అవి ప్రయోగించి యింట్లో ఒకరిద్దరు పిల్లల్ని పరలోకానికి పంపింది.ప్లాటుఫారం మీద రైళ్ళు వస్తూ పోతున్నట్టు నిత్యం వాళ్లింటికి బంధు మిత్రులొస్తూ పోతుంటారు. ఏలూరు మావయ్య, కాకినాడ పిన్ని, బీరకాయల తాత, శ్రీకాకుళం అమ్మమ్మ, బొబ్బిలి డాక్టరు గారు, కొత్తపేట నాయుడు, వగైరా వగైరా.