పొద్దున్నే పేపరు చూస్తూ టీ తాగుతున్న భారతి ఒక్క పొలికేక పెట్టింది ‘‘అక్కయ్యోవ్‌, బాపూ గారి ‘వంశవృక్షం’ క్రౌన్‌లో కొచ్చిందేవ్‌’’వినపడిందో లేదోనని మళ్లీ అరవబోతూండగా శారద తన టీ కపతో వచ్చి ఎదుటి సోఫాలో కూర్చుంటూ ‘‘ఎన్నిసార్లు చూస్తావేం ఆ పిక్చ్‌ర్‌ని? అంది. ‘‘ముందే చెప్తున్నాను, నేను రానుబాబూ, చాలాసార్లు టీవీలో కూడా వచ్చేసిందది’’.‘‘టీవీలో చూసేదీ ఓ సినిమాయేనా, చూస్తే థియేటర్లో చూడాలి. చెప్తే నమ్మవుకాని ఈ మధ్య సి.డి. తెప్పించుకుని కన్నడ మూలం వంశవృక్షం చూసేను. దీనిముందది బలాదూర్‌, బాపూగారి డైరెక్షన్లో పట్టిసీమనూ, గోదారినీ ఎన్నిసార్లు చూస్తే తనివితీరుతుంది? పైగా ముళ్ళపూడివారి అద్భుతమైన డైలాగ్స్‌, అన్నిట్నీ మించి లేత తాటిముంజెలాంటి అనిల్‌కపూర్‌..’’‘‘అదా సంగతి’’ అంటూ నవ్వింది శారద.‘‘కాదనకే అక్కయ్యా, రాకరాక సెలవుపెట్టి వచ్చిన ఓ చెల్లెలు కోరక కోరక కోరిన కోరిక కాదనకే అక్కయ్యా’’ అంది భారతి నాటకీయంగా.‘‘ఓకే, శాంక్షన్డ్‌’’్‌్‌్‌గేటు దగ్గరున్న వ్యక్తి చేతిలో టిక్కెట్లు పెట్టేసి లోపలికి నడిచింది శారద. ఉదయం పదకొండు గంటల వేళ, వేసవి వెల్తురులోంచి రావడం నుంచి హాలులోపల చిమ్మ చీకటిగా అన్పించిందో క్షణం.చింపిన టిక్కెట్లు ముక్కల కోసం చెయ్యిచాచి షో స్టార్టయి పోయిందేమోనని ఆత్రంగా లోపలికి తొంగిచూసింది భారతి. టిక్కెట్టు ముక్కల్ని ఇవ్వడం మరచిపోయి కన్నార్పకుండా చూస్తున్న గేట్‌కీపర్ని విసుగ్గా చూసి, అతని చేతిలో ముక్కల్ని లాక్కున్నంత పనిచేసి లోపలికి నడిచింది భారతి.

 నాలుగడుగులేసాక ఆ ముఖాన్నెక్కడో చూసినట్టన్పించి వెనక్కి తిరిగి చూసింది. ఆసరికే అతను అటు తిరిగిపోయాడు.ఇంటర్వెల్లో చటుక్కున గుర్తుకొచ్చింది ఆ ముఖం ఎవరిదో గోవిందు అవును గోవిందే కాని, గోవిందు మరీ అంత సన్నగా రోగిష్టిలాగా ఉండడే!అదాటున లేచి గేటు వైపు వెళ్ళింది.గేటు దగ్గర ఇపడు మరొకతను ఉన్నాడు. బైటికెళ్లే వాళ్లకి అవుట్‌ పాసులిస్తున్నాడు.ఓ పక్కగా నిలబడి అతన్ని పిలిచింది భారతి.‘‘ఇదిగో చూడు ఉదయం ఈ గేట్లో ఉన్నతని పేరు గోవిందేనా?’’ఆమె గొంతులోని కంగారు చూసి గేటు దగ్గరి వ్యక్తి భయపడ్డాడు. ‘‘ఏంటి మేడమ్‌, ఏం జరిగింది?’’ అన్నాడతను.‘‘ముందిది చెప, అతని పేరు గోవిందేనా?’’‘‘అవునండి’’‘‘ఇపడెక్కడున్నాడు?’’‘‘అఠాత్తుగా ఒంట్లో బాగోలేదని సెలవడిగి ఇంటికెళ్లి పోయేడండి, ఏం జరిగింది, ఏవన్నా అమర్యాదగా ప్రవర్తించేడా?’’‘‘అదేం కాదులే, అతని ఇల్లెక్కడో తెలుసా పోనీ’’‘‘తెలవదండి, అద్దె తక్కువని ఈ మజ్జినే ఊరికి దూరంగా మారేడండి’’‘‘షో విడిచిపేట్టే వేళకి వస్తాడా?’’‘‘ఇంక ఇయాల్టికి రాడండి,సెలవడిగి ఎల్లిపోయేడు కదండి’’సంగతేంటో తెలీని క్యూరియాసిటీ అతని మొహాన్ని వీడక పోవడం గమనించి ‘‘అతను మాకు తెలిసినవాడులే’’ అని వచ్చేసింది భారతి.